
2027 నాటికి 23 లక్షల ఉద్యోగావకాశాలు
మూడేళ్లలో 12 లక్షలకు నిపుణుల సంఖ్య
దేశవ్యాప్తంగా కొరత 10 లక్షలకుపైమాటే
బెయిన్ అండ్ కంపెనీ నివేదికలో వెల్లడి
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్‌కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది.
2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది.
రీస్కిల్–అప్‌స్కిల్..
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్‌సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్‌నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు.
‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది.
ఏఐ స్వీకరణలో వెనుకంజ..
ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి.
ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్.
మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక
నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా
డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్‌స్కిల్) అత్యవసరం.
Comments
Please login to add a commentAdd a comment