నీతి ఆయోగ్‌కు కన్సల్టెంట్లు కావలెను!
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ నిపుణుల కొరతతో సతమతమవుతోంది. దీంతో ఏడుగురు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)లను నియమించుకోవాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి నెలకు రూ.1.55 లక్షల వేతనాన్ని ఇవ్వనున్నట్లు సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఆర్థిక, సామాజిక, ఐటీ, రవాణా, న్యాయ, ఇంజనీరింగ్ విభాగాల్లో కన్సల్టెంట్లు అవసరమని అందులో పేర్కొంది. ప్రత్యేక కార్యకలాపాల కోసం పనిచేసే వీరిని తొలుత ఏడాది కాలపరిమితితో నియమించనున్నట్లు తెలిపింది.
ఆయారంగాల్లో సరైన నిపుణులు లభించకపోవడంతో సంస్థ కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందని సీనియర్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. దీంతో ఇందులో ఉన్న సభ్యులపై పనిభారం పెరుగుతోందని, సంస్థ వైస్‌చైర్మన్ అరవింద్ పనగరియా 10 డివిజన్లు, 20 మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నారని; సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ 3 డివిజన్లు, 18 మంత్రిత్వ శాఖలు, 15 రాష్ట్రాలు చూస్తున్నారన్నారు. మరో సభ్యుడు వీకే సారస్వత్ 15 మంత్రిత్వ శాఖలు, 17 రాష్ట్రాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.