విద్యా రుణం... తెలివుండాలి! | Educational loan rules and regulations | Sakshi
Sakshi News home page

విద్యా రుణం... తెలివుండాలి!

Published Mon, Feb 19 2018 12:21 AM | Last Updated on Mon, Feb 19 2018 12:21 AM

Educational loan rules and regulations - Sakshi

ఉన్నత చదువులు చదువుకోవటం అందరికీ ఇష్టమే. కాకపోతే కొందరికి ఆర్థికంగా ఎలాంటి దన్నూ ఉండదు కనక... ఉన్నత చదువులు కలగానే మిగిలిపోతుంటాయి. అలాంటి వారికి వెన్నుదన్నునిచ్చేవే విద్యా రుణాలు. కుటుంబీకులు కొంత కష్టపడి... చదువుకునే సంస్థ గనక సరైనదైతే ఈ రుణానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవు. ఇప్పుడు చాలా మంది ఆధారపడుతున్నది కూడా వీటిపైనే!!.

సరే! రుణం వస్తుంది. దాన్ని కాలేజీకి చెల్లించి చదువు కూడా పూర్తి చేస్తాం. ఆ తరవాత..? ఇపుడదే పెద్ద సమస్య. ఈ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత గుర్తొచ్చినప్పుడే కష్టమనిపిస్తుంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) చాలా ఇబ్బందిగా మారతాయి. త్వరగా ఉద్యోగం దొరక్కపోవటమో... దొరికినా తక్కువ జీతంతో రావటమో జరిగితే... ఆ ప్రభావం తిరిగి చెల్లించే వాయిదాలపై పడుతుంది. దీనివల్ల క్రెడిట్‌ స్కోరు పడిపోవడమే కాకుండా, ఆ రుణం భారంగా మారుతుంది కూడా. విద్యా రుణమూ దీనికి మినహాయింపేమీ కాదు. అందుకే... విద్యా రుణం తీసుకోవాలనుకున్న వారు ఆ రుణం చేతికందాక ఏం చేయాలి? అవసరమైతే దాన్ని పునరుద్ధరించుకుని గరిష్ట ప్రయోజనాలు ఎలా పొందాలి? పన్ను ప్రయోజనాలేంటి? వంటి కీలక సమాచారం తెలుసుకోవాలి. ఆ వివరాలే ఈ ‘ప్రాఫిట్‌’ ప్రధాన కథనం... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


అవసరమైతే రీఫైనాన్స్‌ చేసుకోండి
విద్యా రుణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా మంది అది చేతికొస్తే చాలనుకుంటారు. అందుకని వడ్డీ రేటు తగ్గించాలని డిమాండ్‌ చేయలేని పరిస్థితిలో ఉంటారు. బ్యాంకు పెట్టిన షరతులు, నియమ, నిబంధనలను ఆమోదిస్తున్నట్టు సంతకాలు కూడా చేసేస్తారు. రుణం తీసుకుని విద్య పూర్తయి ఉద్యోగంలో చేరాక మాత్రం... ఆ రుణానికి సంబంధించిన ఒప్పంద నిబంధనలు సౌకర్యంగా అనిపించకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి?

‘‘నిజానికిలా అనిపించినపుడు సమీక్షించాలని బ్యాంకును నిరభ్యంతరంగా డిమాండ్‌ చేయొచ్చు. వినియోగదారుడు తీసుకున్న విద్యా రుణానికి అవసరమైతే మరో సంస్థ నుంచి సానుకూల షరతులపై రీఫైనాన్స్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది’’ అని అవాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సీఈవో అమిత్‌గండా చెప్పారు. రీఫైనాన్స్‌ అంటే మరో సంస్థ నుంచి రుణం తీసుకుని పాత రుణాన్ని తీర్చివేయటమన్న మాట.

రుణం తీసుకుని విద్య పూర్తి చేసిన వారు, ఉద్యోగం దొరికి రుణాన్ని చెల్లించే మెరుగైన స్థితిలోకి వచ్చినపుడు వారికి నియమ, నిబంధనలు నచ్చలేదనుకోండి. అలాంటపుడు ఈ రీఫైనాన్స్‌తో పాతదానికి గుడ్‌బై చెప్పేయొచ్చు. కాకపోతే కొత్త సంస్థ నుంచి రుణం తీసుకుంటారు కనుక ప్రాసెసింగ్‌ ఫీజు కొంత చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా రుణాన్ని ఆఫర్‌ చేస్తున్న సంస్థ నిబంధనలు సౌకర్యంగా ఉంటే, తక్కువ వడ్డీ రేటుకు వస్తుంటే రీఫైనాన్స్‌ ఆప్షన్‌ను పరిశీలించొచ్చనేది అమిత్‌గండా సూచన.

ఇదెలా పనిచేస్తుందంటే...
ఉదాహరణకు రూ.20 లక్షల రుణాన్ని 12 శాతం వడ్డీ రేటుపై 9 ఏళ్లలో తీర్చేయాలి. ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేదనుకుంటే, రెండేళ్ల విద్యా సమయాన్ని మినహాయించి చూస్తే, మిగిలిన కాలానికి రూ.9.66 లక్షలను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత సహజంగానే తిరిగి రుణం పొందేందుకు అవకాశాలు మెరుగవుతాయి.

అప్పుడు 10 శాతం వడ్డీపై రీఫైనాన్స్‌ సదుపాయం పొందినా గానీ, మిగిలి ఉన్న ఏడేళ్ల కాలంలో వడ్డీ తగ్గడం వల్ల రూ.1.77 లక్షలు ఆదా అవుతాయి. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీటు సంపాదించి ఉంటే ఉద్యోగంలో చేరకముందే రుణ ఒప్పందాలను సమీక్షించాలని బ్యాంకులను డిమాండ్‌ చేయవచ్చు. ఎందుకంటే ప్రముఖ విద్యా సంస్థల్లో చదివిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కచ్చితంగా ఉంటాయి కనక బ్యాంకులూ వారి డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తాయి.

క్రెడిట్‌ స్కోరు పట్ల జాగ్రత్త
చాలా మందికి విద్యా రుణమే వారి జీవితంలో తీసుకునే తొలి రుణమవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా రుణ వాయిదా చెల్లింపులు జరిగేలా చూసుకోవాలి. లేదంటే వారి క్రెడిట్‌ స్కోరు తగ్గిపోయి, భవిష్యత్తులో ఇతర రుణాల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. వేళ ప్రకారం రుణ వాయిదాలు చెల్లిస్తే చాలు. ప్రత్యేకంగా ఏ చర్యలూ అవసరం లేదు. క్రెడిట్‌ బ్యూరోల నుంచి క్రెడిట్‌ రిపోర్ట్‌ను తెప్పించుకుని పరిశీలించే అవకాశం కూడా ఉంది.  

కోర్సు పూర్తికాకుంటే..? ఉద్యోగం రాకపోతే...?
ఒకవేళ రుణం తీసుకుని చేరిన కోర్సును విద్యార్థి పూర్తి చేయలేకపోతే ఎంటి పరిస్థితి? అన్న సందేహం తలెత్తవచ్చు. విద్యారుణ పథకం–2015 కింద ఇటువంటి సందర్భాల్లో విద్యార్థులు తమ కోర్స్‌ పూర్తి చేసేందుకు వీలుగా బ్యాంకులు కాల వ్యవధిని పొడిగిస్తాయి.

వడ్డీయే కాదు, అసలు చెల్లింపులకు కూడా ఈ మేరకు కాలవ్యవధి పొడిగించినట్టుగానే భావించాలి. ఒకవేళ కోర్సు పూర్తయి ఉద్యోగం రాకపోయినా లేదా విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం రాకపోయినా కూడా బ్యాంకులు మూడు సార్ల వరకు (ప్రతీ సారీ ఆరు నెలల చొప్పున) చెల్లింపుల కాల వ్యవధిని పొడిగించేందుకు సమ్మతిస్తున్నాయి. దీనివల్ల చెల్లింపుల భారం తగ్గుతుంది కానీ, రుణంపై చెల్లించే వడ్డీ భారం పెరుగుతుంది.

పన్ను లాభాలున్నాయి...
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఈ కింద విద్యా రుణం తీసుకున్న వారు దానిపై చెల్లించే వడ్డీని ఆదాయం నుంచి మినహాయించుకుని చూపే వెసులుబాటు ఉంది. ఈ సెక్షన్‌ కింద క్లెయిమ్‌ చేసుకునేందుకు పరిమితి లేకపోవడం ఆకర్షణీయాంశం. అంటే వడ్డీ రూపంలో ఎంత చెల్లించినా గానీ ఆ మొత్తాన్ని ఆదాయం నుం చి మినహాయించి చూపించవచ్చు. ఎనిమిదేళ్లు, లేదా రుణ చెల్లింపుల కాలం ఈ రెండింటిలో ఏది తక్కువయితే అది అమల్లోకి తీసుకుంటారు. రుణంలో అసలుకు చేసే చెల్లింపులపై మాత్రం మినహాయింపు లేదు. ఈ చట్టం కింద పన్ను మినహాయంపులు అన్నవి వ్యక్తిగత ఉన్నత చదువులకు, జీవిత భాగస్వామి, పిల్లల విద్యలకు కూడా పొందొచ్చు.

ఉదాహరణకు ఏడేళ్ల కాల వ్యవధి కలిగిన రూ.20 లక్షల విద్యా రుణంపై 11.5 శాతం వడ్డీ రేటు అనుకుంటే, మొదటి రెండేళ్లు చదివే సమయంలో చెల్లింపులపై మారటోరియం తీసేయగా, రుణాన్ని తీర్చేందుకు ఐదేళ్లు ఉంటుంది. దీంతో ఏటా వడ్డీ రూపంలో రూ.2.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న వ్యక్తి అధిక పన్ను శ్లాబ్‌ పరిధిలో ఉంటే పన్ను మినహాయింపుల రూపంలో రూ.71,760 ఆదా అవుతుంది. ఈ మినహాయింపు పొందేం దుకు వడ్డీ చెల్లింపుల సర్టిఫికెట్‌ను బ్యాంకు లేదా రుణమిచ్చిన సంస్థ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

ఏ బ్యాంకులో రుణం తీసుకున్నా ఈ ప్రయోజనానికి అర్హులే. అయితే, ఎన్‌బీఎఫ్‌సీల్లో కొన్నింటికే ఈ సదుపాయం ఉంది. అందుకే ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రుణం తీసుకునే ముందు ఈ అంశాన్ని ధ్రువీకరించుకోవాలి. రుణాన్ని ముందుగా తీర్చివేయదలిస్తే మాత్రం పన్ను ప్రయోజనాల కోణంలో ఓ సారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే పన్ను చెల్లించేంత ఆదాయం ఉంటే రుణాన్ని ముందుగా తీర్చివేయడం కంటే కాల వ్యవధి వరకు కొనసాగించటం ద్వారా గణనీయమైన పన్ను ఆదా చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement