న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) రూ.34,615 కోట్ల బడా బ్యాంకింగ్ మోసం కేసుపై జరుగుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి.
అత్యున్నత స్థాయి వర్గాల కథనం ప్రకారం, రూ. 14,683 కోట్ల డీహెచ్‌ఎఫ్‌ఎల్ నిధుల ’మళ్లింపు’లో తొమ్మిది రియల్టీ సంస్థల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కీలక విచారణ జరుగుతోంది. అప్పటి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, వ్యాపారవేత్త సుధాకర్ శెట్టిల నియంత్రణలో ఉన్న ఈ తొమ్మిది రియల్ ఎస్టేట్ సంస్థలు తమ బాస్‌ల ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ మార్గాలను అనుసరించాయని సీబీఐ పేర్కొంది.
తొమ్మిదిలో ఐదు సుధాకర్ శెట్టివే...
తొమ్మిది రియల్టీ సంస్థల్లో ఐదు వ్యాపారవేత్త సుధాకర్ శెట్టి నియంత్రణలోనివి కావడం గమనార్హం. కంపెనీలు తీసుకున్న రుణాలు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్‌ల ఆదేశాల మేరకు దారిమళ్లినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
2010–2018 మధ్య కాలంలో రూ. 42,871 కోట్ల మేర రుణాలను మంజూరు చేసిన 17 బ్యాంకుల కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుండి వచ్చిన ఫిర్యాదుపై జూన్ 20వ తేదీన కేసు నమోదయ్యింది. కేసు నమోదయిన తర్వాత సీబీఐకి చెందిన దాదాపు 50 మందికిపైగా అధికారుల బృందం బుధవారం ముంబైలోని 12 ప్రాంగణాల్లో విస్తృత సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీహెచ్‌ఎఫ్‌ఎల్ మొత్తం కుంభకోణం రూ.34,615 కోట్లుగా సీబీఐ అధికారులు తెలిపారు.
దీనిప్రకారం, ఇంత స్థాయిలో బ్యాంకింగ్ మోసం కేసుపై సీబీఐ విచారణ జరగడం ఇదే తొలిసారి. వాధ్వాన్ ద్వయం ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడి, వాస్తవాలను తప్పుగా చూపించి దాచిపెట్టారని, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడ్డారని బ్యాంక్ తన ఫిర్యాదులో పేర్కొంది. మే 2019 నుండి రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ కావడం ద్వారా కన్సార్టియంను రూ. 34,614 కోట్ల మేర మోసగించడానికి కుట్ర జరిగిందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment