రూ.34,614 కోట్ల డీహెచ్‌ఎఫ్‌ఎల్ కుంభకోణం
స్పెషల్ సీబీఐ కోర్టును ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు
బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణంగా పరిగణించే దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కేసు పరిష్కారానికి ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టును నియమించింది. రూ.34,614 కోట్లు కుంభకోణానికి సంబంధించి సీబీఐ చేసిన దర్యాప్తులో 3,30,000 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశారు. ఈ కేసులో 108 మంది నిందితులు, 736 మంది సాక్షులున్నారని తెలిపారు. దాంతో కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ హైకోర్టు స్పెషల్ సీబీఐ కోర్టుకు సిఫారసు చేసింది. ఈమేరకు ఆగస్టు 1న ప్రత్యేకంగా ఈ కేసు కోసమే సీబీఐ కోర్టును ఏర్పాటు చేసి, న్యాయమూర్తిని నియమించింది. దీనివల్ల కేసు త్వరగా పరిష్కారమవుతుందని పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టు తెలిపిన వివరాల ప్రకారం..‘డీహెచ్‌ఎఫ్‌ఎల్ కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు జడ్జి అశ్వనీ కుమార్ సర్పాల్ ఏప్రిల్ 27న న్యాయపరమైన ఉత్తర్వులను జారీ చేశారు. అందులో ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సీబీఐ 26 ట్రంక్‌పెట్టెల్లో 3,30,000 పేజీల పత్రాలను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మొత్తం 108 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. ఈ కేసులో నిజాలు నిరూపించడానికి 736 మంది సాక్షులున్నట్లు పేర్కొన్నారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని త్వరగా పరిష్కారం అయ్యేలా స్పెషల్ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపింది.
అసలేంటీ కేసు..
2010-18 మధ్య యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 17 బ్యాంకుల కన్సార్షియం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ.42,871 కోట్ల విలువైన రుణాలను ఇచ్చింది. వీటిని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ సీబీఐను ఆశ్రయించింది. సంస్థ ప్రమోటర్లుగా ఉన్న కపిల్, ధీరజ్‌లు నిజాల్ని కప్పిపుచ్చుతూ.. విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని, 2019 మే నుంచి రుణ చెల్లింపులను ఎగవేస్తూ రూ.34,614 కోట్ల మేర ప్రజా ధనాన్ని మోసం చేశారని బ్యాంకు ఆరోపించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఖాతా పుస్తకాల ఆడిట్‌లోనూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, నిధులు మళ్లించారని చెప్పింది. ఫలితంగా కపిల్, ధీరజ్‌లు సొంత ఆస్తులు పెంచుకున్నారని.. ఇదంతా ప్రజా ధనంతో చేశారని పేర్కొంది.
ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!
డీహెచ్‌ఎఫ్‌ఎల్ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలంటూ బ్యాంకులు కేపీఎమ్‌జీ ఆడిట్ సంస్థను నియమించాయి. కపిల్, ధీరజ్ వాధ్వాన్‌లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్‌అవుట్ సర్క్యులర్’లను జారీ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment