బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.
ప్రత్యేక వేదిక ఏర్పాటు..?
బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..
కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
అనుమతుల్లేక కేసులు పెండింగ్
2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment