భారత బ్యాంకింగ్ రంగంలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే మహిళ అధినేత్రిగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కొన్ని ఇతర బ్యాంకుల్లో డైరెక్టర్, మేనేజ్‌మెంట్ స్థానాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఏకైక మహిళా సీఈవో, ఎండీ
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం మణిమేఖలై సీఈవో, ఎండీగా ఉన్నారు. చురుకైన నిర్ణయాలతో బ్యాంకును విజయవంతంగా నడిపిస్తున్నారు. 1988లో విజయా బ్యాంక్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె అక్కడ ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్ విలీనం అయిన తర్వాత ప్రభుత్వం ఆమెను కెనరా బ్యాంక్‌లో మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఇందులో ఆమె వ్యూహాత్మక ప్రణాళిక, క్రెడిట్ సంబంధిత అంశాలు, తనిఖీ, మార్కెటింగ్, ఫైనాన్సియల్ ఇన్‌క్లూషన్, రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ బాధ్యతలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరును పర్యవేక్షించారు. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనంలో కీలక పాత్ర పోషించారు.
కాన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స్, కాన్‌బ్యాంక్ కంప్యూటర్ సర్వీసెస్, కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్, జనరల్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆమెకు విశేష అనుభవం ఉంది. అలాగే కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు ట్రస్టీగా వ్యవహరించారు. మణిమేఖలై బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్) పట్టా పొందారు. ముంబైలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పూర్తి చేశారు.
ఇతర బ్యాంకుల్లో..
కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి మరికొన్ని బ్యాంకుల్లో డైరెక్టరియల్, మేనేజ్‌మెంట్ వంటి కీలక స్థానాల్లో మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బిజినెస్ ఫైనాన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రూప్ హెడ్‌గా అషిమా భట్ సేవలు అందిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్‌గా శాంతి ఏకాంబరం ఉన్నారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్‌లలో బృందా జాగీర్దార్ ఒకరు. గతంలోనూ అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, పద్మజ చుండూరు, శిఖా శర్మ, చందా కొచర్ వంటి వారు పలు బ్యాంకులకు నాయకత్వం వహించారు.
ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు!
Comments
Please login to add a commentAdd a comment