మనలో చాలా మంది బ్యాంకు ఖాతాల ఆధారంగా లావాదేవీలు చేస్తూంటారు. ఎఫ్‌డీలో డబ్బు దాచుకుంటారు. సేల్ డీడ్ ద్వారా చెల్లింపులు చేస్తూంటారు. బిజినెస్ చేస్తున్నవారు కరెంట్ అకౌంట్ ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. అయితే ఏ ఖాతాకైనా లావాదేవీల పరంగా నిబంధనల ప్రకారం కొన్ని అవధులుంటాయి. వాటిని పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఆదాయపన్ను అధికారుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే ఖాతాలకు నిబంధనల ప్రకారం ఎంతమొత్తంలో లిమిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
సేవింగ్స్, కరెంట్ ఖాతాలో లావాదేవీలు
భారతీయ ఆదాయపు పన్ను చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం పొదుపు ఖాతాలో జమ చేసే నగదు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకు మించితే ఐటీ శాఖకు తెలియజేయాలి. అదే కరెంట్ అకౌంట్ల విషయంలో ఈ పరిమితి ప్రాథమికంగా రూ.50 లక్షలు ఉంటుంది. కొన్నిసార్లు కరెంట్ అకౌంట్‌కు సంబంధించి లేవాదేవీలు ఆయా బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. ఈ డిపాజిట్లు తక్షణ పన్నుకు లోబడి ఉండనప్పటికీ, పరిమితులను మించిన లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.
నగదు ఉపసంహరణ
నగదు ఉపసంహరణల విషయానికి వస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194ఎన్‌లో టీడీఎస్ నిబంధనలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు రూ.1 కోటికి మించితే 2% టీడీఎస్ చెల్లించాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని వ్యక్తులకు విత్‌డ్రావల్స్ రూ.20 లక్షలు దాటితే 2% టీడీఎస్ వర్తిస్తుంది. అదే రూ.1 కోటికి మించితే 5% టీడీఎస్ అమలవుతుంది.
నగదు బహుమతి
నగదు బహుమతులపై ఆదాయపు పన్నుశాఖ నిబంధనలు విధించింది. పన్ను విధించదగిన ఆదాయాన్ని దాచిపెట్టి పన్నులను ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నగదు బహుమతులకు సంబంధించి దీన్ని నిరోధించడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. సంబంధీకులు కానివారి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లేదా అంతకంటే తక్కువ మొత్తంలో నగదు బహుమతులు స్వీకరించినట్లయితే ఎటువంటి గిఫ్ట్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, అత్తమామలతో సహా ఇతర బంధువుల నుంచి బహుమతులను స్వీకరిస్తే పన్ను మినహాయింపు ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ పరిమితి
ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే కనీసం రూ.100 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయాలి. ఆపై చేసిన ఎఫ్‌డీపై ట్యాక్స్ ఉంటుంది. అయితే ఎఫ్‌డీల్లో రూ.రెండు కోట్లు కంటే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్లు ఉంటే బల్క్ డిపాజిట్ల రూపంలోకి మారుతాయి. ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ ఏటా రూ.10 వేలు దాటితో టీడీఎస్ 10 శాతం కట్ అవుతుంది.
‘రియల్’ లావాదేవీలు
పూర్తి నగదును ఉపయోగించి స్థలం లేదా, ఇల్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలు అనుమతించవు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు నగదు లావాదేవీల పరిమితికి లోబడి ఉంటాయి. నగదు రూపంలో రూ.2,00,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేయకూడదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్‌ఎస్ ప్రకారం నగదు రూపంలో రూ.రెండు లక్షల కంటే ఎక్కువ చెల్లింపులు స్వీకరిస్తే విక్రేత 100% పెనాల్టీ రుసుమును చెల్లించవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: పాన్ కార్డ్‌తో గేమ్స్ వద్దు
సేల్ డీడ్‌లో నగదు చెల్లింపులను రికార్డ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. రిజిస్టర్డ్ టైటిల్ డీడ్‌లో రుజువులు రికార్డు చేసే క్రమంలో రూ.రెండు లక్షలు గరిష్ట పరిమితి మాత్రమే ఉండాలి. అది కూడా బ్యాంకు డ్రాఫ్ట్, చెక్, ఈసీఎస్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో ఉండడం మేలు.
Comments
Please login to add a commentAdd a comment