నగదు బదిలీ... పన్నుల కోత! | Finance Minister Shri Arun Jaitley Presented Economic Survey 2016 - 2017 | Sakshi
Sakshi News home page

నగదు బదిలీ... పన్నుల కోత!

Published Wed, Feb 1 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

నగదు బదిలీ... పన్నుల కోత!

నగదు బదిలీ... పన్నుల కోత!

2016–17 ఆర్థిక సర్వే చెబుతోందిదే...

పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ  
పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ ప్రతిపాదన
సబ్సిడీల స్థానంలో అమలు చేయాలని సూచన  
ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించాలి...
రియల్‌ ఎస్టేట్‌పై స్టాంప్‌ డ్యూటీలో కోత విధించాలి...
మరింత మంది పన్ను పరిధిలోకి ...
ఆర్థిక వృద్ధికి నోట్ల రద్దు షాక్‌... 6.5 శాతానికి పడిపోవచ్చు
వచ్చే ఏడాది 6.75–7.5 శాతంగా అంచనా
జీఎస్‌టీ అమలు, డీమోనిటైజేషన్‌ ఫలాలు, నిర్మాణాత్మక సంస్కరణలతో భవిష్యత్తులో వృద్ధి పరుగులే
జీఎస్‌టీ పరిధిలోకి భూ, ఇతర స్థిరాస్తి లావాదేవీలు...  
పన్ను పరిధిలోకి ఇక వ్యవసాయ ఆదాయం!



నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) కారణంగా నెలకొన్న ప్రజావ్యతిరేకతను తగ్గించేందుకు మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాల మంత్రాన్ని ప్రయోగించనుందా? అరుణ్‌ జైట్లీ అటు సామాన్యులు, వేతన జీవులకు.. ఇటు కార్పొరేట్‌ వర్గాలకూ తీపి కబురు అందిస్తారా? సంస్కరణ మోత మోగుతుందా? ఆర్థిక సర్వే నివేదికను చూస్తే నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో వీటికి పెద్దపీటవేస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక పథకాల రూపంలో పేదలకు కల్పిస్తున్న సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి... దీని స్థానంలో నగదు బదిలీ(సార్వత్రిక కేనీస ఆదాయం–యూబీఐ)ని ప్రవేశపెట్టాలంటూ సర్వే సూచించింది. అంతేకాదు.. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ)తో పాటు కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించాలని పేర్కొంది. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిపెట్టాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు షాక్‌ తప్పదని తేల్చిచెప్పింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో మందగించినప్పటికీ.. వచ్చే ఏడాది మళ్లీ భారీగా పుంజుకోనుందని అభిప్రాయపడింది. మొత్తంమీద చూస్తే.. జైట్లీ ‘డ్రీమ్‌ బడ్జెట్‌’పై నెలకొన్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016–17 ఆర్థిక సర్వేలో ప్రధానంగా దీన్ని ప్రస్తావించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్నట్లుగా... ప్రజల కడగండ్లను తుడిచిపెట్టాలంటే పేదలందరికీ కనీస ఆదాయాన్ని(యూబీఐ) అందించాలంటూ సర్వేలో సూచించారు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీలన్నింటినీ తొలగించి.. యూబీఐని ప్రవేశపెట్టాలని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది(2016–17) వృద్ధి రేటు కనీసం అర శాతం మేర దిగజారి 6.5 శాతానికి మందగించవచ్చని సర్వే అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం తిరిగి వృద్ధి 6.75–7.5 శాతం స్థాయికి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం చూసినా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని తెలిపింది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది.

వ్యవసాయ ఆదాయంపైనా పన్ను...?
ప్రభుత్వం పన్నుల తగ్గింపు విషయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని సర్వే సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్ల తగ్గింపునకే పరిమితం కాకుండా.. కార్పొరేట్‌ పన్నుల కోతకు సంబంధించిన కార్యాచరణ(టైమ్‌టేబుల్‌)ను వేగవంతం చేయాలని పేర్కొంది. అంతేకాదు ‘అధిక ఆదాయం కలిగిన వారందరూ’ పన్నులు కట్టేవిధంగా పన్నుల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. అయితే, ఈ అధిక ఆదాయం కలిగినవారందరూ అంటే ఎవరనేది మాత్రం నిర్వచించలేదు. ప్రస్తుతం పన్నుల పరిధిలో లేని వ్యవసాయ ఆదాయాన్ని ఈ విధంగా ప్రస్తావించి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

సంస్కరణల జోరు పెంచాలి...
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు, డీమోనిటైజేషన్‌ ఫలాలతో పాటు నిర్మాణాత్మక సంస్కరణలన్నీ అమలు చేయగలిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పరుగులు తీయడం ఖాయమని సర్వే నొక్కిచెప్పింది. మన ఆర్థిక వ్యవస్థకున్న వాస్తవ సామర్థ్యం ప్రకారం మధ్యకాలికంగా 8–10 శాతం వృద్ధిని అందుకోవడం సాధ్యమేనని తెలిపింది. 2015–16లో జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది(తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7.9 శాతం). ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతానికి తగ్గొచ్చనేది ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే, డీమోనిటైజేషన్‌ ప్రతికూల ప్రభావాన్ని ఈ అంచనాల్లో పూర్తిగా లెక్కలోకి తీసుకోలేదు. సంస్కరణల అమలు, విధానాత్మక చర్యల విషయంలో వెనకడుగు వేస్తే.. మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కూడా డీమోనిటైజేషన్‌ ప్రతికూలతలను ఆర్థిక వ్యవస్థ చవిచూడాల్సి వస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది.

రిస్కులపై అప్రమత్తత అవసరం...
‘నోట్ల రద్దు కారణంగా తలెత్తిన నగదు కొరతతో కొన్ని వ్యవసాయోత్పత్తుల సరఫరాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పాలు, చక్కెర, బంగాళదుంపలు, ఉల్లిపాయల ఉత్పాదకత దిగజారింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పప్పుదినుసుల విషయంలో ఎదురైన తీవ్ర పరిస్థితులు(ఉత్పత్తి పడిపోయి ధరలు ఆకాశాన్నంటడం) ఇప్పుడు ఇతర వ్యవసాయోత్పత్తులపై పడకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని సర్వే సూచించింది. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్‌) ధర ఎగబాకుతుండటం... అగ్ర దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు కూడా మన ఆర్థిక వ్యవస్థకు పొంచిఉన్నాయని గుర్తుచేసింది. ‘క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 60–65 డాలర్లకు గనుక ఎగబాకితే.. దేశీయంగా వినియోగం తగ్గేందుకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులకు ఆస్కారం తగ్గుతుంది. కార్పొరేట్‌ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో ప్రైవేటు పెట్టుబడులను కూడా దెబ్బతీస్తుంది. అధిక క్రూడ్‌ ధర కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్క్‌ అధికమవుతుంది. దీంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని వివరించింది.

సాధారణ స్థాయికి నగదు సరఫరా...
నోట్ల రద్దు కారణంగా నెలకొన్న కరెన్సీ కొరత క్రమంగా తగ్గుము ఖం పడుతోందని సర్వే పేర్కొంది. కొత్త కరెన్సీ నోట్లు తగినంతగా అందుబాటులోకి వస్తుండటంతో ఆర్థిక వృద్ధి కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘డీమోనిటైజేషన్‌ అనేది ద్రవ్యపరంగా అత్యంత అసాధారణ పరిణామాలకు కారకమైంది. నగదు సరఫరా, చలామణీని వ్యవస్థ నుంచి భారీగా తగ్గించేయగా.. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మరోరకంగా కరెన్సీ భారీగా పెరిగింది. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్‌ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తుందన్న విశ్వాసం పెంచాలంటే.. పన్ను చెల్లింపులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. దీనివల్ల పన్ను ఎగవేతదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు తగ్గుముఖం పడతాయి’ అని సర్వేలో పేర్కొన్నారు. డీమోనిటైజేషన్‌ వల్ల స్వల్పకాలంలో భారం పడినప్పటికీ.. దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని తేల్చిచెప్పింది.

జీఎస్‌టీ పరిధిలోకి రియల్‌ ఎస్టే్టట్‌...
డీమోనిటైజేషన్‌ చాలా శక్తివంతమైన ప్రక్రియ అని.. దీని ప్రయోజనాలు కనబడాలంటే తగిన చర్యలు అవసరమని సర్వే ఐదంచెల వ్యూహాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా జీఎస్‌టీ పరిధిని మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా నల్లధనం పోగుపడేందుకు మూలకారణంగా నిలుస్తున్న భూ క్రయవిక్రయాలు, ఇతరత్రా  స్థిరాస్తి లావాదేవీలు, కార్యకలాపాలను జీఎస్‌టీ కిందికి తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ స్టాంప్‌ డ్యూటీలను కూడా తగ్గించాల్సిందేనని పేర్కొంది. ఐటీ పరిధిని నెమ్మదిగా విస్తరించాలని.. దీనికి రాజ్యాంగపరంగా తగిన విధానాలను పాటించాలని సూచించింది. అసమానతలను తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు వీలుగా పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచాలని పేర్కొంది. ఈ ఏడాది చేపట్టిన అత్యంత కీలకమైన పాలసీ చర్యల్లో జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం... రూ.1,000; రూ.500 నోట్ల రద్దు నిలుస్తాయని తెలిపింది. జీఎస్‌టీ వల్ల భారత్‌లో ఏకీకృత మార్కెట్‌ను సృష్టిస్తుంది. పన్ను చెల్లింపులు, పరిపాలన మెరుగుపడటంతో పెట్టుబడులు, వృద్ధికి చేయూత లభిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహకారం(కోపరేటివ్‌ ఫెడరలిజమ్‌) కొత్త పుంతలు తొక్కుతుంది’ అని పేర్కొంది.

ఇతర ముఖ్యాంశాలివీ...
ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన(పీఎంజీకేవై– నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు తాజా స్కీమ్‌)తో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం లభించనుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.1 శాతానికి ఎగబాకనుంది. గతేడాది ఈ వృద్ధి 1.2 శాతమే. పారిశ్రామిక రంగం వృద్ధి  మాత్రం 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గొచ్చు.

జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం.

పొదుపులను ప్రోత్సహించాలి. దీనివల్ల విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడకుండా  పెట్టుబడి నిధులు అందుబాటులోకి వస్తాయి.

బ్యాంకింగ్‌లో మొండిబకాయిల తీవ్రత దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, అసెట్‌ రీహెబిలిటేషన్‌ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలి.

సామాజికపరమైన మార్పులకు దీర్ఘకాలంగా పరిష్కృతం కాకుండా ఉన్న మూడు కీలకమైన సవాళ్లను భవిష్యత్తులో మనం అధిగమించాల్సి ఉంటుంది. సంపద పంపిణీలో అసమర్థతలు, ప్రైవేటు రంగం–ప్రాపర్టీ హక్కుల విషయంలో నెలకొన్న అనిశ్చితి, సామర్థ్యానికి అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి పుంజుకోలేకపోతుండటం వీటిలో ఉన్నాయి.

ప్రతికూలతలను గుర్తించింది..
పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు .. ఎకానమీ ఎదుర్కొంటున్న ఎదురుగాలులను ఆర్థిక సర్వే స్పష్టంగా గుర్తించిందని విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో సాహసోపేతమైన ప్రతిపాదనలు ఉండొచ్చని పేర్కొన్నారు.

సంస్కరణలతో బడ్జెట్‌..
సర్వే బట్టి చూస్తే బడ్జెట్‌ సాహసోపేతంగా, సంస్కరణలతో కూడుకున్నదిగా ఉండొచ్చని తెలుస్తోంది. మౌలిక రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
– రిచర్డ్‌ రేఖీ, సీఈవో, కేపీఎంజీ ఇండియా

సవాళ్లు.. అవకాశాలు..
ఎకానమీ ఎదుర్కొం టున్న సవాళ్లు.. ముందున్న అవకాశాలను సర్వేలో స్పష్టంగా ప్రస్తావించారు. డిమాండ్‌కు ఊతమివ్వడం, పన్ను రేట్లు తగ్గించడం, పన్ను విధానాలను సంస్కరించడం తదితర చర్యలతో పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన మంచిదే.
– పంకజ్‌ పటేల్, ప్రెసిడెంట్, ఫిక్కీ

ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలుండాలి..
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, జీఎస్‌టీ అమలు ద్వారా ఎగుమతులకు మరింత ఊతమివ్వాలి. నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఎకానమీకి మళ్లీ ఊపిర్లూదేలా.. ఉపాధి కల్పనపై మరింత దృష్టి పెట్టాలి. అపారెల్‌ తదితర విభాగాల్లాగానే లెదర్, ఫుట్‌వేర్‌ రంగాలకూ సమగ్రమైన ప్యాకేజీ ఇవ్వాలి.
– ఎస్‌సీ రాల్హన్, ప్రెసిడెంట్, ఎఫ్‌ఐఈవో

డిమాండ్‌కు తోడ్పాటు ఉండాలి..
డిమాండ్‌కు ఊతమిచ్చే లా బడ్జెట్‌ ఉండగలదని ఆశిస్తున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్‌ ట్యాక్సేషన్‌ వంటి ప్రత్యక్ష పన్నులను కొంత సడలిస్తే ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నాం.
– చంద్రజిత్‌ బెనర్జీ, డైరెక్టర్‌ జనరల్, సీఐఐ

ఆందోళనకరంగా రక్షణాత్మక ధోరణులు..
ప్రపంచ ఎకానమీకి పొంచి ఉన్న రిస్కులు.. వాటి ఫలితంగా చమురు రేట్ల పెరుగుదల, వాణిజ్య సమస్యలS రూపంలో భారత్‌పై పడే ప్రతికూల ప్రభావాలను సర్వే గుర్తించింది. భారతీయ ఎగుమతులను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం.
– సునీల్‌ కనోడియా, ప్రెసిడెంట్, అసోచాం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement