Economic Survey 2016-17
-
ఖర్చులు తగ్గించండి లేదా పన్నులు పెంచండి!
న్యూఢిల్లీ: ఆర్థిక సర్వే 2016-17 వాల్యూమ్-2 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సర్వేను పత్రికా సమావేశంలో మీడియాకు వివరించారు. రూపాయి విలువ, వ్యవసాయ రుణాల రద్దు జీడీపీని ప్రభావితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం చాలా కష్టమన్నారు. రైతు రుణలకు మాఫీ కల్పించడం వల్ల వృద్ధి రేటను సాధించడం కుదరదనీ, 2017-18 సంవత్సరానికి పెట్టుకున్న జీడీపీ టార్గెట్ రేటును అందుకోవడం పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకోవడం కానీ, లేదా పన్నుల పెంపు ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని ఆయన సూచించారు. గత పదినెలలుగా టార్గెట్లకు మించి ఆర్థిక వ్యవస్థ పుంజకుందని, దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసినట్టు చెప్పారు. అలాగే ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. అద్భుతమైన రాజకీయాలు, సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశాల కలయిక జీఎస్టీ అని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని3 శాతానికి చేరుకోవడంలో ఇది సహాయపడుతుందని అరవింద్ అన్నారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టి) 7 వ పే కమిషన్, మంచి రుతుపవనాలు, మార్పిడి రేట్లు లాంటి అంశాల క ఆరణంగా ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటుకు సంబంధించి, మార్చి చివరినాటికి ద్రవ్యోల్బణం మూడు శాతానికి దిగి వస్తుందన్నారు. జీఎస్టీ నెట్వర్క్ కింద సుమారు 13.5 లక్షల మంది రిజస్టర్ చేసుకున్నట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ అమలు ఊహించినదాని కంటే ఎక్కువగా ఉందన్నారు. జీఎస్టీ అమలు తీరు ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ వేగం కూడా పెరిగిందన్నారు. వ్యవసాయ దిగుబడి పెరిగినా, ధరలు తగ్గడం వల్ల ఆదాయం మాత్రం పడిపోయిందన్నారు. కేటాయింపులను తగ్గించామని, రాష్ట్రాలు పన్నులను పెంచాల్సిన సందర్భం వచ్చిందన్నారు. రైతుల రుణాలకు మాఫీ కల్పించడం వల్ల ధరలు తగ్గనున్నట్లు ఆయన చెప్పారు. కానీ ఇది ద్రవ్యోల్బణానికి దారి తీయదన్నారు. అంతేకాకుండా, ఈ వృద్ధి అధిక వడ్డీ రేటు, సానుకూల మార్పిడి రేటు మరియు అధిక పోటీతత్వానికి కారణమవుతుందని అరవింద్ చెప్పారు. -
7.5 శాతం జీడీపీ వృద్ధి రేటు అసాధ్యం-ఆర్థిక సర్వే
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు (శుక్రవారం) ఆర్థిక సర్వే 2016-17 వాల్యూం -2 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత ఆర్ధికవ్యవస్థ లోని వివిధ అంశాలపై దృష్టి పెట్టిన సర్వే దేశ ఆర్ధిక పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై నివేదించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మొదటిసారిగా, రెండవ లేదా మిడ్ టెర్మ్ ఆర్థిక సర్వేను సమర్పించింది. పుంజుకుంటున్న రూపాయి విలువ, వ్యవసాయ రుణాల రద్దు, జీఎస్టీ అమలు తదితర సవాళ్ల కారణంగా గతంలో అంచనా వేసిన 6.75-7.5 శాతం వృద్ధిని సాధించడం చాలా కష్టమవుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ముఖ్యంగా జీఎస్టీ నిర్మాణాత్మక సంస్కరణలు, డీమానిటైజేషన్ తదనంతర పరిణామాలను చర్చించింది. అలాగే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ సహా, పలు రంగాల్లో సంస్కరణలు చేపట్టాలని ఆ సర్వే నివేదిక ప్రతిపాదించింది. దీంతోపాటు భారతదేశ ఆర్ధికవ్యవస్థ ప్రస్తుత స్థితి, మొత్తం వాణిజ్యం, బాహ్య రుణం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్‌డీఐ కింది విదేశీ నిధుల ప్రవాహం తదితర అంశాలపై నివేదికలో ఆర్థిక సర్వే వివరించింది. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో సంస్కరణలు అత్యవసరమని ఆర్థికసర్వే సూచించింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ లాంటి మౌలికసదుపాయాలను స్థిరీకరించాలని నివేదిక తెలిపింది. పంటల దిగుబడి, రైల్వే ఆదాయాన్ని పెంచాలని అభిప్రాయపడింది. మధ్యతరహా పోర్టుల అభివృద్ధి, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అవసరమని పేర్కొన్నది. ఇండియాను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చాలంటే నిబంధనలను సరళీకరించాలని పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 7.5 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించడం అసాధ్యమని సర్వే స్పష్టం చేసింది. రైతు రుణాల మాఫీతో వృద్ధి రేటను సాధించడం కుదరదని నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణం 2018 మార్చినాటికి రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన టార్గెట్ 4 శాతం కిందికి దిగి వస్తుందని పేర్కొంది. మరోవైపు 2017-18 సంవత్సరానికి పెట్టుకున్న జీడీపీ టార్గెట్ రేటును అందుకోవడం పెద్ద సవాల్ అని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తూ, భారత ఎగుమతులు 2016-17 నాటికి 12.3 శాతం వద్ద సానుకూలంగా మారాయి. దిగుమతులు 1.0 శాతం పెరగడంతో 2016-17 నాటికి వాణిజ్య లోటు 112.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2015-16 నాటికి ఇది 130.1 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక లోటు 2016-17 నాటికి జీడీపీ 0.7 శాతం వరకు పెరిగింది, 2015-16లో 1.1 శాతం నుండి వాణిజ్య లోటులో పదునైన సంకోచం ఏర్పడింది. 2013-14 నుంచి 2015-16 మధ్యకాలంలో చెల్లింపుల పరిస్థితిని నిరుపయోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక లోటు తగ్గడంతో 2016-17లో మరింత మెరుగుపడింది. విదేశీ మారకద్రవ్యం మరింత పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015-16 నాటికి 55.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా , 2016-17 లో స్థూల ఎఫ్‌డీఐ 60.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే నికర పెట్టుబడులు 35.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2015-16 నాటికి ఇది 36.0 బిలియన్ డాలర్ల నుంచి 1.1 శాతానికి పరిమితమైంది. కరెంట్ అకౌంట్ లోటును నడుపుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో, బ్రెజిల్ తర్వాత 2017 జూలై 7 వ తేదీ నాటికి 386.4 బిలియన్ డాలర్ల నిల్వలతో భారత్ రెండవ అతిపెద్ద విదేశీ మారకద్రవ్యాన్ని కలిగి ఉందని సర్వే తేల్చింది. 2017 మార్చి చివరినాటికి విదేశీ రుణ సూచికలు 2017 చివరినాటికి మెరుగయ్యాయి. 2017 మార్చి చివరినాటికి భారత్ మొత్తం విదేశీ రుణాల నిల్వ 471.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 3.1 బిలియన్ డాలర్లు (2.7 శాతం) విదేశీ మారకద్రవ్యం గత ఏడాది 74.3 శాతంతో పోలిస్తే విదేశీ మారకద్రవ్యం 78.4 శాతం విదేశీ రుణాన్ని అందించింది. అయితే, విదేశీ మారకద్రవ్యం జిడిపికి 20.2 శాతానికి పడిపోయింది. ఋణ సేవల నిష్పత్తి 8.8 శాతం నుండి 8.3 శాతానికి పడిపోయిందని ఆర్థిక సర్వే నివేదించింది. -
ఆర్థిక సర్వే 2016–17
స్థూల ఆర్థిక స్థిరత్వం నేపథ్యంలో 2016లో భారతదేశం రెండు ముఖ్య విధాన నిర్ణయాలను చవిచూసింది. అందులో ఒకటి వస్తు, సేవల పన్నుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ కాగా, రెండోది పెద్ద నోట్ల రద్దు. వస్తు, సేవల పన్ను.. కామన్ ఇండియన్ మార్కెట్‌ను సృష్టించడంతో పాటు పన్ను విధానంలో గవర్నెన్స్‌ను, వృద్ధి–పెట్టుబడులను పెంచేందుకు తోడ్పడుతుంది. నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడినా దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయి. డిమాండ్ ఆధారిత, డీమానిటైజేషన్, తర్వాతి పన్ను సంస్కరణల్లో భాగంగా భూమి, రియల్ ఎస్టేట్‌ను వస్తు, సేవల పన్ను పరిధిలోకి తేవడం, పన్ను రేట్లు, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం లాంటిæచర్యలు వ్యయాల తగ్గింపు ద్వారా ప్రయోజనాలను గరిష్టపర్చడానికి సహకరిస్తాయి. డీమానిటైజేషన్ వల్ల అవినీతి తగ్గుదల, ఆర్థిక వ్యవస్థలో అధిక డిజిటలైజేషన్, ఫైనాన్షియల్ సేవింగ్స్ పెరుగుదల, ఆర్థిక వ్యవస్థలో సంఘటిత కార్యకలాపాల వృద్ధి లాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. 2016–17లో అభివృద్ధి సమీక్ష 2016–17 మొదటి అర్ధ భాగంలో వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.2 శాతం. 2015–16 రెండో అర్ధ భాగంలో సాధించిన వృద్ధి రేటు (7.6 శాతం) కంటే ఇది తక్కువ. కార్పొరేట్ రంగ వ్యయ ప్రణాళికల నేపథ్యంలో బ్యాలెన్స్ షీట్లపై ఒత్తిడి పెరిగిన కారణంగా స్థిర పెట్టుబడిలో తగ్గుదల నమోదైంది. దాంతో వృద్ధి రేటులోనూ తగ్గుదల ఏర్పడింది. మరోవైపు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ వినియోగంలో పెరుగుదలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల్లో డిమాండ్ పెరుగుదల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతి రంగంలో రికవరీ లాంటి ధనాత్మక ప్రభావాలను కూడా చవిచూసింది. 2015–16 మొదటి అర్ధ భాగంలో సాధారణ జీడీపీ వృద్ధి క్షీణించినా 2016–17 మొదటి అర్ధ భాగంలో మాత్రం సాధారణ జీడీపీ వృద్ధి పురోగమించింది. 2016–17 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో వివిధ రంగాల్లో వృద్ధి ధోరణులను పరిశీలిస్తే.. 1) పారిశ్రామిక, ప్రభుత్వేతర సేవల రంగంలో వృద్ధి పెరుగుదల 2) రుతుపవనాల అనుకూలత కారణంగా వ్యవసాయ రంగంలో వృద్ధి పెరుగుదల 3) ప్రభుత్వ పాలన, రక్షణ రంగంలో పటిష్ట వృద్ధి లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వినియోగ ధరల సూచీ నూతన సిరీస్ ద్రవ్యోల్బణం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో సగటున 4.9 శాతంగా నమోదైంది. ఖరీఫ్ కాలంలో వ్యవసాయ ఉత్పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా 2016, జూలై నుంచి వినియోగధరల సూచీల్లో తగ్గుదల ఏర్పడింది. పప్పుధాన్యాల ధరల్లో తగ్గుదల కారణంగా 2016, డిసెంబర్ చివరి నాటికి వినియోగధరల సూచీ ద్రవ్యోల్బణం 3.4 శాతానికి తగ్గింది. మరోవైపు టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 2015, ఆగస్టులో రుణాత్మకం (–5.1 శాతం) కాగా, 2016 డిసెంబర్ చివరి నాటికి 3.4 శాతానికి తగ్గింది. కరెంట్ అకౌంట్ లోటులో తగ్గుదల సంభవించి 2017 మొదటి అర్ధ భాగం నాటికి జీడీపీలో 0.3 శాతానికి తగ్గుతుంది. 2016, జనవరి చివరి నాటికి 350 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు 2016, డిసెంబర్ చివరి నాటికి 360 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2015, ఏప్రిల్–డిసెంబర్‌తో పోల్చితే 2016, ఏప్రిల్–డిసెంబర్లో వాణిజ్య లోటు 23.5 శాతం మేర తగ్గింది. అమెరికా, జర్మనీల్లో అధిక వృద్ధితోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు మెరుగైన కారణంగా ఎగుమతులు పెరిగి వాణిజ్య లోటు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం 2016–17 ఆర్థిక సంవత్స రంలో జీడీపీలో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యసాధ నకు కట్టుబడింది. గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అదనపు రాబడి చర్యల కారణంగా ఎక్సైజ్ డ్యూటీలతోపాటు సేవల పన్ను రాబడి కూడా పెరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ కాలంతో పోల్చితే 2016 ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో వాస్తవిక పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో 11.2 శాతం వృద్ధి నమోదవడంతో ఎక్సైజ్ డ్యూటీల రాబడి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల ఫైనాన్స్‌పై ఒత్తిడి పెరిగింది. కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లోటు పెరుగుతోంది. 2014–15లో రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లోటు జీడీపీలో 2.5 శాతం కాగా, 2015–16లో 3.6 శాతానికి పెరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో సరిపడా నూతన కరెన్సీ చెలామణిలోకి రానుంది. దీంతో ఆర్థిక వృద్ధి తిరిగి సాధారణ స్థాయికి చేరుకోగల దు. రుతుపవనాల అనుకూలత, ప్రపంచ వృద్ధి రేటు పెరుగుదలకు సంబంధించిన అంచనాల నేపథ్యంలో ఎగుమతుల్లో పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం అమలుచేసే సంస్కరణలు దేశంలో వృద్ధి రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. 2016–17తో పోల్చితే 2017– 18లో చమురు ధరల్లో 1/6 వంతు పెరుగుదల వృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో స్థిర పెట్టుబడుల్లో తగ్గుదల ఏర్పడింది. అదే సమయంలో ప్రైవేటుæ పెట్టుబడుల్లోనూ తగ్గుదల అధికంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు పెరిగితే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటును పెంచేందుకు చేపడుతున్న పటిష్ట చర్యల కారణంగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంది. వివిధ రంగాల్లో వృద్ధి కేంద్ర గణాంక సంస్థ విడుదల చేసిన మొదటి ముందస్తు గణాంకాల ప్రకారం 2016–17లో భారత ఆర్థిక వ్యవస్థలో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం. కేంద్ర గణాంక సంస్థ తర్వాతి సవరణల్లో వృద్ధి రేటు తగ్గే అవకాశం కూడా ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 7.2 శాతం వృద్ధి నమోదైంది. కాగా, రెండో అర్ధ భాగంలో వృద్ధిని కేంద్ర గణాంక సంస్థ 7 శాతంగా అంచనా వేసింది. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం స్థిర బేసిక్ ధరల వద్ద స్థూల కలిపిన విలువ 2015–16లో 7.2 శాతం కాగా, 2016–17లో 7 శాతం. 2016 –17 మొదటి అర్ధ భాగంలో స్థిర బేసిక్ ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వృద్ధి 7.2 శాతం కాగా, రెండో అర్ధ భాగంలో 6.7 శాతంగా అంచనా. మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2016–17లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో బేసిక్ ధరల వద్ద స్థూల కలిపిన విలువలో వృద్ధి 4.1 శాతం కాగా, పారిశ్రామిక రంగంలో వృద్ధి 5.2 శాతం, సేవా రంగంలో వృద్ధి 8.8 శాతం. పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఉప రంగాలైన మైనింగ్ అండ్ క్వారీయింగ్ రంగంలో రుణాత్మక వృద్ధి (–1.8 శాతం) నమోదు కాగా, తయారీ రంగంలో 7.4 శాతం, నిర్మాణ రంగంలో 2.9 శాతం, విద్యుచ్ఛక్తి, గ్యాస్, వాటర్ సప్లయ్‌లో 6.5 శాతం వృద్ధి నమోదైంది. సేవా రంగానికి సంబంధించి ఉపరంగాల్లో వృద్ధిని పరిశీలించినప్పుడు ప్రభుత్వ పాలన, రక్షణ రంగంలో అధిక వృద్ధి నమోదైంది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, నిల్వల్లో 6 శాతం వృద్ధి నమో దు కాగా, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి పరమైన సేవల్లో 9 శాతం, ప్రభుత్వ పాలన, రక్షణ రంగంలో 12.8 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతులు, దిగుమతులు ప్రపంచ వృద్ధి, వాణిజ్యంలో తగ్గుదల కారణంగా భారత్‌లో ఎగుమతులు 2014–15లో 1.3 శాతం, 2015–16లో 15.5 శాతం క్షీణించాయి. ఎగుమతులకు సంబంధించి రుణాత్మక వృద్ధి ధోరణి తొలగి.. 2016–17 (ఏప్రిల్ – డిసెంబర్)లో ఎగుమతుల వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2015–16 (ఏప్రిల్ – డిసెంబర్)లో మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్స్ ఎగుమతుల వాటా 11.1 శాతం కాగా, 2016–17 (ఏప్రిల్–డిసెంబర్)లో 9.8 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి పెట్రోలియం, చమురు, లూబ్రికెంట్స్యేతర ఎగుమతుల్లో పెరుగుదల 2.2 శాతంగా నమోదైంది. 2015–16లో ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, సీఐఎస్, బాల్టిక్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గాయి. కానీ, 2016–17 (ఏప్రిల్–డిసెంబర్)లో భారత్ ఎగుమతులు ఐరోపా, అమెరికా, ఆసియా దేశాలకు సంబంధించి వరుసగా 2.6 శాతం, 2.4 శాతం, 1.1 శాతం మేర పెరిగాయి. కానీ, ఆఫ్రికాకు భారత్ ఎగుమతుల్లో 13.5 శాతం మేర తగ్గుదల ఏర్పడింది. 2016–17లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్‌లు భారత్‌కు సంబంధించి అతిపెద్ద ఎగుమతి కేంద్రాలుగా నిలిచాయి. దిగుమతుల విలువ 2014–15లో 448 బిలియన్ డాలర్లు కాగా, 2015–16లో 381 బిలియన్ డాలర్లకు తగ్గింది. క్రూడ్ చమురు ధరల తగ్గుదల కారణంగా దిగుమతుల విలువలో తగ్గుదల ఏర్పడింది. 2015–16లో బంగారం, సిల్వర్ దిగుమతిలో 35.9 శాతం తగ్గుదల ఏర్పడింది. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, సీఐఎస్, బాల్టిక్ దేశాల నుంచి భారత్ దిగుమతులు 2015–16లో తగ్గాయి. కానీ, 2016–17 (ఏప్రిల్–నవంబర్)లో íసీఐఎస్, బాల్టిక్ ప్రాంతాల నుంచి భారత్ దిగుమతుల్లో పెరుగుదల 10.3 శాతంగా ఉంటే మిగిలిన 4 ప్రాంతాల నుంచి భారత్ దిగుమతుల్లో తగ్గుదల ఏర్పడింది. 2016–17 (ఏప్రిల్ – నవంబర్)లో భారత దిగుమతులకు సంబంధించి చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాలు ముఖ్య కేంద్రాలుగా నిలిచాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు –130.1 బిలియన్ డాలర్లుగా, కరెంట్ అకౌంట్ లోటు –22.2 బిలియన్ డాలర్లుగా, జీడీపీలో కరెంటు అకౌంట్ లోటు –1.1 శాతంగా, నికర మూలధన ప్రవాహాలు జీడీపీలో 1.9 శాతంగా, జీడీపీలో వాణిజ్య లోటు –6.3 శాతంగా నమోదయ్యాయి. విదేశీ రుణం 2016, సెప్టెంబర్ చివరి నాటికి భారతదేశ విదేశీ రుణం 484.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2016, మార్చి నెలాఖరుతో పోల్చితే 2016, సెప్టెంబర్ నాటికి విదేశీ రుణం 0.8 బిలియన్ డాలర్లు తగ్గడానికి కారణం.. వాణిజ్య రుణాలు, స్వల్పకాల రుణం తగ్గడమే. 2016, జూన్ స్థాయితో పోల్చితే 2016, సెప్టెంబర్ చివరి నాటికి విదేశీ రుణం 4.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తం విదేశీ రుణంలో (2016, సెప్టెంబర్) ప్రభుత్వ రుణం 20.1 శాతం కాగా, ప్రభుత్వేతర రుణం 79.9 శాతం. మొత్తం విదేశీ రుణంలో డాలర్ రూపంలోని రుణం 55.6 శాతం కాగా భారత రూపాయి వాటా 30.1 శాతం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 5.8 శాతం, జపాన్ యన్ 4.8 శాతం, పౌండ్ స్టెర్లింగ్ 0.7 శాతం, యూరో 2.4 శాతం, ఇతర కరెన్సీలు 0.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2016, సెప్టెంబర్ చివరి నాటికి భారతదేశానికి ఉన్న మొత్తం విదేశీ రుణంలో దీర్ఘకాల విదేశీ రుణం వాటా 83.2 శాతం కాగా, స్వల్పకాల రుణం 16.8 శాతం. మొత్తం విదేశీ రుణంలో విదేశీ మారక నిల్వలు 76.8 శాతం. కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను పటిష్టపర్చడానికి చర్యలు భారతదేశంలో కార్పొరేట్ బాండ్ మార్కెట్‌ను పటిష్టపర్చేందుకు రిజర్వు బ్యాంక్ అనేక చర్యలను తీసుకొంది. ఇందులో భాగంగా కార్పొరేట్ బాండ్ మార్కెట్లో పెట్టుబడిదారులను పెంచడం, మార్కెట్ ద్రవ్యత్వం పెంపునకు సంబంధించిన ఖాన్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ చర్యలు కింది విధంగా ఉన్నాయి. 1. వాణిజ్య బ్యాంకులు తమ మూలధన అవసరాల నిమిత్తం, అవస్థాపన సౌకర్యాలు, చౌక గృహాల నిర్మాణంపై పెట్టుబడులను పెంచుకోవడానికి వీలుగా మసాలా బాండ్ల జారీకి అనుమతి. 2. సెబీలో రిజిస్టరైన బ్రోకర్లు కార్పొరేట్ బాండ్ మార్కెట్లో కార్పొరేట్ రుణ సెక్యూరిటీలకు సంబంధించి రెపో లేదా రివర్స్ రెపో ఒప్పందాలను చేపట్టడానికి అనుమతి. 3. కార్పొరేట్ బాండ్లకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు అందించే పాక్షిక పరపతిని 20 నుంచి 50 శాతానికి పెంచడం. 4. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి ‘మార్కెట్ మేకర్స్’గా ఉండే విషయంలో ప్రాథమిక డీలర్లకు అనుమతి. తద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు రిటైల్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటాయి. -
నగదు బదిలీ... పన్నుల కోత!
2016–17 ఆర్థిక సర్వే చెబుతోందిదే... పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ పేదరిక నిర్మూలనకు కనీస ఆదాయ ప్రతిపాదన సబ్సిడీల స్థానంలో అమలు చేయాలని సూచన ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలి... రియల్ ఎస్టేట్‌పై స్టాంప్ డ్యూటీలో కోత విధించాలి... మరింత మంది పన్ను పరిధిలోకి ... ఆర్థిక వృద్ధికి నోట్ల రద్దు షాక్... 6.5 శాతానికి పడిపోవచ్చు వచ్చే ఏడాది 6.75–7.5 శాతంగా అంచనా జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్ ఫలాలు, నిర్మాణాత్మక సంస్కరణలతో భవిష్యత్తులో వృద్ధి పరుగులే జీఎస్టీ పరిధిలోకి భూ, ఇతర స్థిరాస్తి లావాదేవీలు... పన్ను పరిధిలోకి ఇక వ్యవసాయ ఆదాయం! నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) కారణంగా నెలకొన్న ప్రజావ్యతిరేకతను తగ్గించేందుకు మోదీ సర్కారు ఈసారి బడ్జెట్లో ప్రజాకర్షక తాయిలాల మంత్రాన్ని ప్రయోగించనుందా? అరుణ్ జైట్లీ అటు సామాన్యులు, వేతన జీవులకు.. ఇటు కార్పొరేట్ వర్గాలకూ తీపి కబురు అందిస్తారా? సంస్కరణ మోత మోగుతుందా? ఆర్థిక సర్వే నివేదికను చూస్తే నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి పెద్దపీటవేస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. సామాజిక పథకాల రూపంలో పేదలకు కల్పిస్తున్న సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి... దీని స్థానంలో నగదు బదిలీ(సార్వత్రిక కేనీస ఆదాయం–యూబీఐ)ని ప్రవేశపెట్టాలంటూ సర్వే సూచించింది. అంతేకాదు.. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ)తో పాటు కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని పేర్కొంది. మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టిపెట్టాలని స్పష్టం చేసింది. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు షాక్ తప్పదని తేల్చిచెప్పింది. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో మందగించినప్పటికీ.. వచ్చే ఏడాది మళ్లీ భారీగా పుంజుకోనుందని అభిప్రాయపడింది. మొత్తంమీద చూస్తే.. జైట్లీ ‘డ్రీమ్ బడ్జెట్’పై నెలకొన్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నగదు బదిలీ పథకాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016–17 ఆర్థిక సర్వేలో ప్రధానంగా దీన్ని ప్రస్తావించారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్నట్లుగా... ప్రజల కడగండ్లను తుడిచిపెట్టాలంటే పేదలందరికీ కనీస ఆదాయాన్ని(యూబీఐ) అందించాలంటూ సర్వేలో సూచించారు. ప్రస్తుతం ఉన్న సబ్సిడీలన్నింటినీ తొలగించి.. యూబీఐని ప్రవేశపెట్టాలని, దీనిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావంతో ఈ ఏడాది(2016–17) వృద్ధి రేటు కనీసం అర శాతం మేర దిగజారి 6.5 శాతానికి మందగించవచ్చని సర్వే అంచనా వేసింది. అయితే, వచ్చే ఏడాది మాత్రం తిరిగి వృద్ధి 6.75–7.5 శాతం స్థాయికి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం చూసినా.. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని తెలిపింది. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. వ్యవసాయ ఆదాయంపైనా పన్ను...? ప్రభుత్వం పన్నుల తగ్గింపు విషయంలో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని సర్వే సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్ల తగ్గింపునకే పరిమితం కాకుండా.. కార్పొరేట్ పన్నుల కోతకు సంబంధించిన కార్యాచరణ(టైమ్‌టేబుల్)ను వేగవంతం చేయాలని పేర్కొంది. అంతేకాదు ‘అధిక ఆదాయం కలిగిన వారందరూ’ పన్నులు కట్టేవిధంగా పన్నుల పరిధిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. అయితే, ఈ అధిక ఆదాయం కలిగినవారందరూ అంటే ఎవరనేది మాత్రం నిర్వచించలేదు. ప్రస్తుతం పన్నుల పరిధిలో లేని వ్యవసాయ ఆదాయాన్ని ఈ విధంగా ప్రస్తావించి ఉండొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణల జోరు పెంచాలి... వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు, డీమోనిటైజేషన్ ఫలాలతో పాటు నిర్మాణాత్మక సంస్కరణలన్నీ అమలు చేయగలిగితే.. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు పరుగులు తీయడం ఖాయమని సర్వే నొక్కిచెప్పింది. మన ఆర్థిక వ్యవస్థకున్న వాస్తవ సామర్థ్యం ప్రకారం మధ్యకాలికంగా 8–10 శాతం వృద్ధిని అందుకోవడం సాధ్యమేనని తెలిపింది. 2015–16లో జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది(తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 7.9 శాతం). ఈ ఏడాది వృద్ధి రేటు 7.1 శాతానికి తగ్గొచ్చనేది ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే, డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాన్ని ఈ అంచనాల్లో పూర్తిగా లెక్కలోకి తీసుకోలేదు. సంస్కరణల అమలు, విధానాత్మక చర్యల విషయంలో వెనకడుగు వేస్తే.. మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18)లో కూడా డీమోనిటైజేషన్ ప్రతికూలతలను ఆర్థిక వ్యవస్థ చవిచూడాల్సి వస్తుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. రిస్కులపై అప్రమత్తత అవసరం... ‘నోట్ల రద్దు కారణంగా తలెత్తిన నగదు కొరతతో కొన్ని వ్యవసాయోత్పత్తుల సరఫరాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పాలు, చక్కెర, బంగాళదుంపలు, ఉల్లిపాయల ఉత్పాదకత దిగజారింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో పప్పుదినుసుల విషయంలో ఎదురైన తీవ్ర పరిస్థితులు(ఉత్పత్తి పడిపోయి ధరలు ఆకాశాన్నంటడం) ఇప్పుడు ఇతర వ్యవసాయోత్పత్తులపై పడకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని సర్వే సూచించింది. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర ఎగబాకుతుండటం... అగ్ర దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు వంటి రిస్కులు కూడా మన ఆర్థిక వ్యవస్థకు పొంచిఉన్నాయని గుర్తుచేసింది. ‘క్రూడ్ ధర బ్యారెల్‌కు 60–65 డాలర్లకు గనుక ఎగబాకితే.. దేశీయంగా వినియోగం తగ్గేందుకు దారితీస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులకు ఆస్కారం తగ్గుతుంది. కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు పడిపోవడంతో ప్రైవేటు పెట్టుబడులను కూడా దెబ్బతీస్తుంది. అధిక క్రూడ్ ధర కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్క్ అధికమవుతుంది. దీంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని వివరించింది. సాధారణ స్థాయికి నగదు సరఫరా... నోట్ల రద్దు కారణంగా నెలకొన్న కరెన్సీ కొరత క్రమంగా తగ్గుము ఖం పడుతోందని సర్వే పేర్కొంది. కొత్త కరెన్సీ నోట్లు తగినంతగా అందుబాటులోకి వస్తుండటంతో ఆర్థిక వృద్ధి కూడా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘డీమోనిటైజేషన్ అనేది ద్రవ్యపరంగా అత్యంత అసాధారణ పరిణామాలకు కారకమైంది. నగదు సరఫరా, చలామణీని వ్యవస్థ నుంచి భారీగా తగ్గించేయగా.. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మరోరకంగా కరెన్సీ భారీగా పెరిగింది. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ ఆర్థిక వ్యవస్థకు మేలుచేకూరుస్తుందన్న విశ్వాసం పెంచాలంటే.. పన్ను చెల్లింపులను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. దీనివల్ల పన్ను ఎగవేతదారులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు తగ్గుముఖం పడతాయి’ అని సర్వేలో పేర్కొన్నారు. డీమోనిటైజేషన్ వల్ల స్వల్పకాలంలో భారం పడినప్పటికీ.. దీర్ఘకాలికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయని తేల్చిచెప్పింది. జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టే్టట్... డీమోనిటైజేషన్ చాలా శక్తివంతమైన ప్రక్రియ అని.. దీని ప్రయోజనాలు కనబడాలంటే తగిన చర్యలు అవసరమని సర్వే ఐదంచెల వ్యూహాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా జీఎస్టీ పరిధిని మరింత విస్తృతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా నల్లధనం పోగుపడేందుకు మూలకారణంగా నిలుస్తున్న భూ క్రయవిక్రయాలు, ఇతరత్రా స్థిరాస్తి లావాదేవీలు, కార్యకలాపాలను జీఎస్టీ కిందికి తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లతో పాటు రియల్ ఎస్టేట్ స్టాంప్ డ్యూటీలను కూడా తగ్గించాల్సిందేనని పేర్కొంది. ఐటీ పరిధిని నెమ్మదిగా విస్తరించాలని.. దీనికి రాజ్యాంగపరంగా తగిన విధానాలను పాటించాలని సూచించింది. అసమానతలను తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు వీలుగా పన్నుల యంత్రాంగాన్ని మెరుగుపరచాలని పేర్కొంది. ఈ ఏడాది చేపట్టిన అత్యంత కీలకమైన పాలసీ చర్యల్లో జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం... రూ.1,000; రూ.500 నోట్ల రద్దు నిలుస్తాయని తెలిపింది. జీఎస్టీ వల్ల భారత్‌లో ఏకీకృత మార్కెట్‌ను సృష్టిస్తుంది. పన్ను చెల్లింపులు, పరిపాలన మెరుగుపడటంతో పెట్టుబడులు, వృద్ధికి చేయూత లభిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సహకారం(కోపరేటివ్ ఫెడరలిజమ్) కొత్త పుంతలు తొక్కుతుంది’ అని పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై– నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు తాజా స్కీమ్)తో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం లభించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.1 శాతానికి ఎగబాకనుంది. గతేడాది ఈ వృద్ధి 1.2 శాతమే. పారిశ్రామిక రంగం వృద్ధి మాత్రం 7.4 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గొచ్చు. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి తగినంతగా లేకపోవడమే కాకుండా గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరం. పొదుపులను ప్రోత్సహించాలి. దీనివల్ల విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడకుండా పెట్టుబడి నిధులు అందుబాటులోకి వస్తాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిల తీవ్రత దృష్ట్యా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ రంగంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ రీహెబిలిటేషన్ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ)ని ఏర్పాటు చేయాలి. సామాజికపరమైన మార్పులకు దీర్ఘకాలంగా పరిష్కృతం కాకుండా ఉన్న మూడు కీలకమైన సవాళ్లను భవిష్యత్తులో మనం అధిగమించాల్సి ఉంటుంది. సంపద పంపిణీలో అసమర్థతలు, ప్రైవేటు రంగం–ప్రాపర్టీ హక్కుల విషయంలో నెలకొన్న అనిశ్చితి, సామర్థ్యానికి అనుగుణంగా దేశ ఆర్థిక వృద్ధి పుంజుకోలేకపోతుండటం వీటిలో ఉన్నాయి. ప్రతికూలతలను గుర్తించింది.. పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు .. ఎకానమీ ఎదుర్కొంటున్న ఎదురుగాలులను ఆర్థిక సర్వే స్పష్టంగా గుర్తించిందని విశ్లేషకులు, నిపుణులు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో సాహసోపేతమైన ప్రతిపాదనలు ఉండొచ్చని పేర్కొన్నారు. సంస్కరణలతో బడ్జెట్.. సర్వే బట్టి చూస్తే బడ్జెట్ సాహసోపేతంగా, సంస్కరణలతో కూడుకున్నదిగా ఉండొచ్చని తెలుస్తోంది. మౌలిక రంగ అభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. – రిచర్డ్ రేఖీ, సీఈవో, కేపీఎంజీ ఇండియా సవాళ్లు.. అవకాశాలు.. ఎకానమీ ఎదుర్కొం టున్న సవాళ్లు.. ముందున్న అవకాశాలను సర్వేలో స్పష్టంగా ప్రస్తావించారు. డిమాండ్‌కు ఊతమివ్వడం, పన్ను రేట్లు తగ్గించడం, పన్ను విధానాలను సంస్కరించడం తదితర చర్యలతో పెద్ద నోట్ల రద్దు దీర్ఘకాలిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించడంపై దృష్టి పెట్టాలి. మొండిబకాయిల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు ప్రతిపాదన మంచిదే. – పంకజ్ పటేల్, ప్రెసిడెంట్, ఫిక్కీ ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలుండాలి.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, జీఎస్టీ అమలు ద్వారా ఎగుమతులకు మరింత ఊతమివ్వాలి. నోట్ల రద్దుతో దెబ్బతిన్న ఎకానమీకి మళ్లీ ఊపిర్లూదేలా.. ఉపాధి కల్పనపై మరింత దృష్టి పెట్టాలి. అపారెల్ తదితర విభాగాల్లాగానే లెదర్, ఫుట్‌వేర్ రంగాలకూ సమగ్రమైన ప్యాకేజీ ఇవ్వాలి. – ఎస్సీ రాల్హన్, ప్రెసిడెంట్, ఎఫ్ఐఈవో డిమాండ్‌కు తోడ్పాటు ఉండాలి.. డిమాండ్‌కు ఊతమిచ్చే లా బడ్జెట్ ఉండగలదని ఆశిస్తున్నాం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్సేషన్ వంటి ప్రత్యక్ష పన్నులను కొంత సడలిస్తే ఉపయోగకరంగా ఉండగలదని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, డైరెక్టర్ జనరల్, సీఐఐ ఆందోళనకరంగా రక్షణాత్మక ధోరణులు.. ప్రపంచ ఎకానమీకి పొంచి ఉన్న రిస్కులు.. వాటి ఫలితంగా చమురు రేట్ల పెరుగుదల, వాణిజ్య సమస్యలS రూపంలో భారత్‌పై పడే ప్రతికూల ప్రభావాలను సర్వే గుర్తించింది. భారతీయ ఎగుమతులను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో రక్షణాత్మక ధోరణులు పెరుగుతుండటం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. – సునీల్ కనోడియా, ప్రెసిడెంట్, అసోచాం -
ఆర్థిక సర్వే 2016-17: ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధంచిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వే లో తేల్చింది. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను జైట్లీ ఇచ్చారు. అయితే ఇది తాత్కాలికమేనని ఆయన చెప్పారు. గత ఏడాది కాలంగా 7 ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. ముఖ్యంగా జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యపీఐ, కార్మిక రంగ అభివృద్ధి లాంటి అంశాల్లో సంస్కరణలు చేపట్టినట్టు ఆర్థిక సర్వేలో వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 4.1 శాతం పెరుగుదలను నమోదుచేయగా, గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ. పారిశ్రామిక ఉత్పత్తి 5.2 శాతానికి మందగించినట్టు చెప్పారు. సేవల వృద్ధి 8.8 శాతంగా ఉంటుంది. ఈ మూడు రంగాల మునుపటి ఆర్థిక సంవత్సరంలో వరుసగా 1.2 శాతం, 7.4 శాతం, 8.9 శాతం మేర విస్తరించినట్టు ఆర్థికమంత్రి చెప్పారు.ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది. రీమానిటైజేషన్ పూర్తి అయ్యి ఏప్రిల్ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన 2017-18 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ముఖ్యాంశాలు... ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే, ప్రజలకు నాణ్యమైన జీవనం దగ్గరవుతుంది. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను భారీగా వసూలవుతోంది నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం. నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం నగదు వెలుగులోకి వస్తోంది. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టే అవకాశం డిజిటలైజేషన్ తో కేంద్ర ఖజానాకు మరిన్ని నిధులు. జీడీపీ నాలుగేళ్ల కనిష్టాన్ని నమోదు చేసినా , తగ్గినట్టు కనిపించడం తాత్కాలికం మాత్రమే. విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నాం. మేకిన్ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. గ్లోబలైజేషన్ కారణంగా అత్యధికంగా లాభపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి పెద్దనోట్ల రద్దు పంచదార, పాలు, బంగాళదుంపలు , ఉల్లిపాయలు లాంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను ప్రభావితం చేయవచ్చు పేదరికం నిర్మూలనలో ప్రత్యామ్నాయ యూనివర్సల్ ప్రాథమిక ఆదాయ పధకం