న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధంచిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2017 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైనట్లు ఆర్థిక సర్వే లో తేల్చింది. జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 0.3 శాతంగా ఉంటుందన్న సంకేతాలను జైట్లీ ఇచ్చారు. అయితే ఇది తాత్కాలికమేనని ఆయన చెప్పారు. గత ఏడాది కాలంగా 7 ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చినట్టు చెప్పారు. ముఖ్యంగా జీఎస్టీ, అవినీతి నిరోధక బిల్లు, పరపతి విధాన కమిటీ, ఆధార్ బిల్లు, విదేశీ పెట్టుబడుల సరళీకరణ, యపీఐ, కార్మిక రంగ అభివృద్ధి లాంటి అంశాల్లో సంస్కరణలు చేపట్టినట్టు ఆర్థిక సర్వేలో వెల్లడించారు.
2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 4.1 శాతం పెరుగుదలను నమోదుచేయగా, గతేడాదితో పోలిస్తే ఇది 1.2శాతం ఎక్కువ. పారిశ్రామిక ఉత్పత్తి 5.2 శాతానికి మందగించినట్టు చెప్పారు. సేవల వృద్ధి 8.8 శాతంగా ఉంటుంది. ఈ మూడు రంగాల మునుపటి ఆర్థిక సంవత్సరంలో వరుసగా 1.2 శాతం, 7.4 శాతం, 8.9 శాతం మేర విస్తరించినట్టు ఆర్థికమంత్రి చెప్పారు.ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులున్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయని సర్వే తేల్చింది. రీమానిటైజేషన్ పూర్తి అయ్యి ఏప్రిల్ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. అనంతరం లోక్ సభ రేపటికి వాయిదా పడింది.
చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ రూపొందించిన 2017-18 ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యాంశాలు...
ఆర్థిక వ్యవస్థ విస్తరించే కొద్దీ ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
జీఎస్టీ అమల్లోకి వస్తే, ప్రజలకు నాణ్యమైన జీవనం దగ్గరవుతుంది.
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్ను భారీగా వసూలవుతోంది
నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం.
నల్లధనంగా మిగిలిపోయిన మొత్తం నగదు వెలుగులోకి వస్తోంది.
ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టే అవకాశం
డిజిటలైజేషన్ తో కేంద్ర ఖజానాకు మరిన్ని నిధులు.
జీడీపీ నాలుగేళ్ల కనిష్టాన్ని నమోదు చేసినా , తగ్గినట్టు కనిపించడం తాత్కాలికం మాత్రమే.
విదేశీ కంపెనీల పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నాం.
మేకిన్ ఇండియాలో భాగంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి.
గ్లోబలైజేషన్ కారణంగా అత్యధికంగా లాభపడుతున్న దేశాల్లో భారత్ ఒకటి
పెద్దనోట్ల రద్దు పంచదార, పాలు, బంగాళదుంపలు , ఉల్లిపాయలు లాంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాను ప్రభావితం చేయవచ్చు
పేదరికం నిర్మూలనలో ప్రత్యామ్నాయ యూనివర్సల్ ప్రాథమిక ఆదాయ పధకం