న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మూలధన నిల్వలకు సంబంధించి ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై దాఖలయిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ పిల్‌ను దాఖలు చేసిన ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాదికి రూ.50,000 కాస్ట్‌ను కూడా సుప్రీం విధించడం గమనార్హం. ఈ మొత్తం డిపాజిట్ చేసే వరకూ శర్మ ఎటువంటి పిల్ దాఖలు చేయలేరని, అందుకు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీని బెంచ్ ఆదేశించింది.
పిల్ వేయడానికి తగిన కారణమేమీ కనిపించడం లేదని, పైగా ఆర్థికమంత్రినే ఈ పిల్‌లో ప్రధాన పార్టీని చేయడం తగదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది .పిల్‌ను చూస్తుంటే, ఆర్థికమంత్రే డబ్బు కాజేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. తొలుత సుప్రీం కాస్ట్ విధించలేదు. పిల్‌ను కొట్టివేసిన తర్వాత కూడా న్యాయవాది వాదనలను కొనసాగించడంతో న్యాయస్థానం సంబంధిత కాస్ట్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment