నోట్ల రద్దు విశిష్ట ప్రయోగం
దీని మీద 100 పీహెచ్‌డీ థీసిస్‌లు రావొచ్చు
రీమోనిటైజేషన్‌తో వృద్ధికి ఊతం
ప్రధాన ఆర్థిక సలహాదారు
అరవింద్ సుబ్రమణియన్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్)ను ’ద్రవ్య చరిత్రలోనే ఒక విశిష్ట ప్రయోగం’గా అభివర్ణించారు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. అయిదేళ్ల తర్వాత దీనిపై 50–100 పీహెచ్‌డీ థీసిస్‌లు రాసే అవకాశాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతా భావించిన దానికి భిన్నంగా డీమోనిటైజేషన్ ప్రకటించిన నవంబర్‌లో నగదు కొరత చాలా తక్కువగానే కనిపించిందని పేర్కొన్నారు. నెలా రెణ్నెల్లలో వ్యవస్థలోకి నగదు సరఫరా (రీమోనిటైజేషన్) ప్రక్రియ పూర్తయిపోగలదని, ఆ తర్వాత వృద్ధి మళ్లీ పుంజుకోగలదని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. ‘రీమోనిటైజేషన్ జరిగే కొద్దీ ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది. రీమోనిటైజేషన్ వేగంగా జరగాలన్నది నా అభిప్రాయం. నగదుపై పరిమితులను ఎంత తొందరగా ఎత్తివేస్తే అంత శ్రేయస్కరం’ అని సుబ్రమణియన్ వివరించారు. నగదుపై నియంత్రణ కన్నా ప్రోత్సాహకాల ద్వారానే డిజిటల్ చెల్లింపులకు ప్రాచుర్యం కల్పించవచ్చన్నారు.
రియల్టీ రేట్ల తగ్గుదల..
రియల్టీ ధరలను నేలపైకి తేవడం కూడా డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో ఒకటని సుబ్రమణ్యన్ చెప్పారు. ’రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు, విక్రయాలు, కొత్త ప్రాజెక్టులు రావడంలో కొంత తగ్గుదల కనిపిస్తూనే ఉంది. ఇది ఎకానమీకి కాస్త ప్రతికూలమే అయినప్పటికీ.. దీర్ఘకాలంలో కొంత మంచే జరగగలదు. ఎందుకంటే రియల్టీ ధరలను తగ్గించడం కూడా డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో ఒకటి’ అని ఆయన పేర్కొన్నారు.
అమితాబ్ సినిమాలా చేద్దామనుకున్నాం..
ఎప్పుడూ నిరాసక్తంగా, నిస్సారంగా అనిపించే ఆర్థిక సర్వేకు కాస్త అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ సినిమా తరహా హంగులు అద్దే ప్రయత్నం చేశామన్నారు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్. కాస్తంత డ్రామా, కాసింత ట్రాజెడీ, మరికాస్తంత కామెడీని జోడించేందుకు యత్నించామని వివరించారాయన. ’అమితాబ్ బచ్చన్ చెబుతుంటారు కదా.. ఇస్మే డ్రామా హోనా చాహియే.. ట్రాజెడీ హోనా చాహియే .. కామెడీ హోనా చాహియే.. సబ్ కుచ్ హోనా చాహియే అని.. (కథలో డ్రామా ఉండాలి, ట్రాజెడీ ఉండాలి, కామెడీ ఉండాలి.. అన్నీ ఉండాలి). నేను కూడా దాదాపుగా అదే విధంగా సర్వే ఉండేందుకు ప్రయత్నించానని అనుకుంటున్నాను’ అంటూ ఎకనమిక్ సర్వే రూపకల్పన గురించి చమత్కరించారు. ‘సర్వే అనేది వివిధ అంశాల అరుదైన మేళవింపుగా ఉండాలి.
ఇందులో గణితం, చరిత్ర, వేదాంతం, రాజనీతిజ్ఞత మొదలైనవన్నీ తగుపాళ్లలో ఉండాలి. సంకేతాలను అర్ధం చేసుకుని.. వాటిని పదాల రూపంలో వ్యక్తపర్చగలగాలి. నిగూఢమైన అంశాలను, వాస్తవికతను ఒకే తీరుగా స్పృశించగలగాలి’ అన్న ప్రఖ్యాత ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్జ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుబ్రమణియన్ ఉటంకించారు. సర్వే అనేది.. భవిష్యత్ అవసరాలపై దృష్టితో.. గతకాలపు అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వర్తమానాన్ని అధ్యయనం చేసే విధంగా ఉండాలన్నారు. మరోవైపు, సర్వేలో డీమోనిటైజేషన్ అంశం గురించి ప్రస్తావించడాన్ని కూడా సుబ్రమణియన్ వివరించారు. దీన్ని గాని స్పృశించకుండా ఉండి ఉంటే .. డెన్మార్క్ రాకుమారుడు (షేక్‌స్పియర్ రాసిన హామ్లెట్ నవలలో కథానాయకుడు) లేని హామ్లెట్ నవలలాగా సర్వే ఉండేదని ఆయన పేర్కొన్నారు.