
బంతిలా పైకిలేస్తాం..!
నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్
• అంతర్జాతీయ ప్రతికూలతలనూ దీటుగా తట్టుకుంటున్నామని వ్యాఖ్య
• డీమోనిటైజేషన్‌కు 100 రోజులు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం భారత్ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ తిరిగి వేగంగా పురోగమిస్తుందని (‘వీ’ షేప్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘ప్రపంచీకరణ’ దిశ నుంచి ‘రక్షణాత్మక ధోరణి’ వైపునకు మారే పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయంగా భారత్ ప్రయోజనాలకు విఘాతం కలగని పరిస్థితి ఉందని అన్నారు. డీమోనిటైజేషన్ నిర్ణయం ప్రకటించి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్న అంశాల్లో కొన్ని..
⇔ స్వల్పకాలం ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ, తిరిగి ‘వీ’ షేప్‌లో పుంజుకుంటుదన్న అభిప్రాయానికి దాదాపు ప్రతి ఒక్కరి అంగీకారం ఉంది.
⇔ పెద్ద నోట్ల రద్దు అనంతరం వ్యవస్థలో కొత్తనోట్ల భర్తీ (రీమోనిటైజేషన్) వేగవంతంగా, పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది.
⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించిన ఆర్‌బీఐ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఈ రేటును 7.4 శాతంగా పేర్కొన్న సంగతి తెలిసిందే.
⇔ 86 శాతం కరెన్సీ నోట్ల రద్దు ప్రయోజనాలు కనబడ్డానికి మరికొంత సమయం పడుతుంది. ఇందుకు మరికొన్ని చర్యలూ జోడించాల్సిన అవసరం ఉంటుంది.
⇔ భారత్ 9 శాతం వృద్ధి సాధనకు కొన్ని రంగాల్లో సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని చెప్పగలం. భూ, కార్మిక విభాగాల్లో సంస్కరణలు ఇందులో కీలకమైనవి. 7.5 శాతంపైన వృద్ధి సాధ్యమని చెప్పడం కష్టమైనా... అంత స్థాయి వృద్ధి రేటు సాధ్యమేనని నేను భావిస్తున్నాను.
⇔ ద్రవ్యోల్బణమే ఆర్‌బీఐ రేట్ల పాలసీకి ప్రాతిపదిక. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే రేట్ల పెంపు నిర్ణయాన్ని ఇటీవల ద్రవ్యపరపతి విధాన కమిటీ తీసుకోలేదు.
⇔ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించేవేనని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వర్థమాన దేశాల పరిస్థితిని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఫైనాన్షియల్ ఒడిదుడుకులకు ఈ పరిస్థితి దారితీయవచ్చు. ఏదోఒకదేశం ఈ పరిస్థితి నుంచి తప్పించుకుంటుందని నేను భావించడం లేదు. దీనిని భారత్ కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది.
⇔ తన పనిని సమర్థవంతంగా నిర్వర్తించే పటిష్ట స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. (నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే). మేము మా విధులను సమర్థవంతంగా నిర్వహించాం. గడచిన కొన్ని నెలలుగా ప్రధాన సవాళ్లను ఎదుర్కొన్నాం. విమర్శలో నిజముంటే... దానిని సరిచేసుకునేందుకు కృషిచేశాం. సద్విమర్శ పరిష్కారంలో పట్టుదలతో వ్యవహరించాం.