జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు.. మెటాకు భారత్‌ సమన్లు | Zuckerberg Election Comment Row: Meta Get Summons From Indian Govt | Sakshi
Sakshi News home page

జుకర్‌బర్గ్‌ ‘ఎన్నికల ఓటమి’ వ్యాఖ్యలు.. మెటాకు భారత్‌ సమన్లు

Published Tue, Jan 14 2025 2:48 PM | Last Updated on Tue, Jan 14 2025 8:42 PM

Zuckerberg Election Comment Row: Meta Get Summons From Indian Govt

సోషల్‌ మీడియా దిగ్గజం మెటాకు కేంద్రం సమన్లు జారీ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలపై ఆ సంస్థ బాస్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ చేసిన ‘అసత్య ప్రచారపు’ వ్యాఖ్యలే అందుకు కారణం.  

గతేడాది భారత్‌ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే.. జుకర్‌బర్గ్‌ చేసిన వాదనను భారత ప్రభుత్వం ఖండించింది.  బీజేపీ ఎంపీ, ఐటీ & కమ్యూనికేషన్‌ పార్లమెంటరీ హౌజ్‌ ప్యానెల్‌ చైర్మన్‌ నిషికాంత్‌ దుబే మెటాకు సమన్లు పంపే విషయాన్ని ధృవీకరించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకే సమన్లు అని ఎక్స్‌ వేదికగా తెలిపారాయన. 

ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ తప్పునకు భారత దేశ ప్రజలకు, చట్ట సభ్యులకు క్షమాపణ చెప్పాల్సిందే అని దుబే ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. అంతకు ముందు.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి గెలిపించారని  రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) కౌంటర్‌ బదులిచ్చారు.

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 2024లో నిర్వహించిన ఎన్నికల్లో 64కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం ఉందని తేల్చిచెప్పారు. కొవిడ్‌-19 తర్వాత భారత్‌ సహా అధికారంలో ఉన్న అనేక ప్రభుత్వాలు ఓడిపోయాయి అని జుకర్‌బర్గ్‌ చెప్పడంలో వాస్తవం లేదు. 

.. 80 కోట్ల మందికి ఉచిత ఆహారం మొదలు 220కోట్ల వ్యాక్సిన్లు అందించడంతోపాటు కొవిడ్‌ సమయంలో ప్రపంచ దేశాలకు భారత్‌ సాయం చేయడం వంటి నిర్ణయాలు మోదీ మూడోసారి విజయానికి నిదర్శనంగా నిలిచాయి’’ అని అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. అలాగే జుకర్‌బర్గ్‌ అలా మాట్లాడటం నిరాశకు గురిచేసిందన్న అశ్వినీ వైష్ణవ్‌.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను టాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

జుకర్‌బర్గ్‌ ఏమన్నారంటే..
జనవరి 10వ తేదీన ఓ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్‌ మాట్లాడారు. 2024 సంవత్సరం భారీ ఎన్నికల సంవత్సరంగా నిలిచింది. ఉదాహరణగా.. భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అన్నిచోట్లా అక్కడి ప్రభుత్వాలు అక్కడ ఓడిపోయాయి. దీనికి కరోనాతో ఆయా ప్రభుత్వాలు డీల్‌ చేసిన విధానం.. అది దారితీసిన ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణం అని అన్నారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement