సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా వేదికలన్నీ ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు దీటైన చర్యలు చేపట్టాలని ఐటీపై పార్లమెంటరీ కమిటీ కోరింది. ఎన్నికల కమిషన్‌తో సమన్వయంతో అసత్య వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించింది. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలపై యూజర్ల డేటా పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఈ కమిటీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సంస్థలను కోరింది.
ఎన్నికల సమయంలో అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తూ నివేదికలు అందించాలని అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఆయా సంస్థలను బుధవారం ఆదేశించింది. అసత్య వార్తలు సహా తలెత్తే పలు అంశాలను రియల్ టైమ్‌లో పరిష్కరించేందుకు ఆయా సంస్థలు సన్నద్ధం కావాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసీతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల వ్యవహారంలో పారదర్శకతతో కూడిన విధానాన్ని సోషల్ మీడియా వేదికలు ప్రవేశపెట్టాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment