
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల శైలిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె విఫలయత్నం చేశారు. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయమని వ్యాఖ్యానించారు.
రఫేల్ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పాలక బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
ఈ దశలో ఎంపీల తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్‌లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. పార్లమెంటేరియన్ల కంటే స్కూల్ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు.
ఇక రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్ గాంధీయే క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment