లోక్‌సభ స్పీకర్‌: ఎవరీ ఓం బిర్లా.. | loksabha speaker om birla biography | Sakshi
Sakshi News home page

లోక్‌సభ స్పీకర్‌: ఎవరీ ఓం బిర్లా..

Published Wed, Jun 19 2019 1:40 PM | Last Updated on Wed, Jun 19 2019 2:03 PM

loksabha speaker om birla biography - Sakshi

ఓం బిర్లా.. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఈ పేరు చర్చనీయాంశమైంది. కేవలం రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయిన బిర్లా బుధవారం 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. లోక్‌సభ స్పీకర్‌గా ఆయన పేరును  బీజేపీ ప్రతిపాదించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాధారణంగా సీనియర్‌ నేతలను స్పీకర్‌ పదవికి పరిగణలోకి తీసుకుంటారు. గత లోక్‌సభ స్పీకర్‌గా ఎనిమిది పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన సుమిత్రా మహాజన్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసింది. అయితే ఇకపై పార్టీలోనూ, చట్టసభల్లోనూ కురువృద్ధులకు స్థానం ఉండదన్న సంకేతాలను బిర్లాను ఎంపిక చేయడం ద్వారా ప్రధాని మోదీ పంపారనే తెలుస్తోంది. 

ఎవరీ ఓం బిర్లా..
ఓం బిర్లా 1969 నవంబర్‌ 23న రాజస్తాన్‌లోని కోటాలో జన్మించారు. తండ్రి శ్రీకృష్ణ బిర్లా, తల్లి శకుంతల దేవి. బిర్లా బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన వారు.  ఓం బిర్లా తన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా రాజస్తాన్‌లోనే పూర్తి చేశారు. 12వ తరగతి అనంతరం బిజినెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. కోటాలోని కామర్స్‌ కాలేజీలో, అజ్మీర్‌లోని మహర్షి దయానంద సరస్వతి విశ్వవిద్యాలయంలో ఆయన చదివారు. 1991లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న అమితా బిడాలీని వివాహం చేసుకున్నారు. 

కాలేజీలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బిర్లా భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరుకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 1997 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. 2003లో కోటా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ నేత శాంతి ధారీవాల్‌ను 10 వేల ఓట్ల తేడాతో ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2008లో కోటా నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్‌ నేత రామ్‌ కిషన్‌ వర్మను 24 వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన మొత్తం మూడు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014లో కోటా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సునాయాసంగా గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కోట నుంచి పోటీ చేసిన ఆయనను స్పీకర్‌ పదవి వరించింది. 

చురుకైన నేతగా, అప్పగించిన పనికంటే ఎక్కువ కష్టపడే వ్యక్తిగా అధిష్టానం వద్ద బిర్లాకు మంచి గుర్తింపు ఉంది. సవాళ్లను స్వీకరించడంలో ఆయనకు ఆయనే సాటి. సభ నియయనిబంధనలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న బిర్లా స్పీకర్‌ పదవికి అర్హుడనే వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో వినిపించడంతో ఆయనను సభాపతి పదవి వరించినట్టు తెలుస్తోంది. బిర్లాను స్పీకర్‌గా బీజేపీ ప్రతిపాదించగా ఎన్డీయే వర్గాలతోపాటు ఏఐఏడీఎంకే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. స్పీకర్‌గా బిర్లాకు మద్దతునిస్తున్నట్లు లోక్‌సభ కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ చౌదరి తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికయిన బిర్లాను ప‍్రధాని మోదీ సాదరంగా తీసుకువెళ్లి  చైర్‌లో కూర్చోబెట్టారు. మొదటిసారి లేదా రెండుసార‍్లు ఎంపీగా ఎన్నికైన వారూ ఈ పదవిని చేపట్టిన సందర్భరాలు గతంలోనూ ఉన్నాయి. 2002లో స్పీకర్‌గా ఎన్నికైన మురళీ మనోహర్‌ జోషి అప్పుడు తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆయన తరువాత ఆ పదవి చేపట్టిన జీఎంసీ బాలయోగి అప్పటికి రెండుసార్లు మాత్రమే ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 16వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్‌ ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement