డిప్యూటీ స్పీకర్ ఇస్తే పోటీ పెట్టబోమన్న ఇండియా కూటమి
హామీ ఇవ్వని బీజేపీ.. కుదరని ఏకాభిప్రాయం
దళిత నేత సురేశ్‌ను పోటీకి దింపిన ‘ఇండియా’
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా పోటీ అనివార్యమైంది. కీలక నేతలను పాత పదవుల్లో కొనసాగిస్తున్న మోదీ 3.0 సర్కారు దానికి అనుగుణంగానే ఎన్డీఏ అభ్యర్ధిగా ఓం బిర్లాను మంగళవారం స్పీకర్ బరిలో నిలిపింది. ఓం బిర్లా 17వ లోక్‌సభలో ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. విపక్ష ఇండియా కూటమి ఆఖరి నిమిషంలో.. కాంగ్రెస్ ఎంపీ కొడైకున్నిల్ సురేశ్‌ను రంగంలోకి దింపింది. పార్లమెంటరీ సంప్రదాయాలను అనుసరించి విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తే.. ఓం బిర్లాకు మద్దతు ఇస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. అయితే బీజేపీ సీనియర్ నేతలు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.
స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుందని, ఆ సందర్భం వచ్చినపుడు చూద్దామని బీజేపీ పేర్కొంది. దీనికి ఇండియా కూటమి నేతలు సమ్మతించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి కేటాయిస్తామని హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా పేరు ఖరారయ్యాక కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చొరవ తీసుకొని విపక్షాలను సంప్రదించారు. రాజ్‌నాథ్ ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టి.ఆర్.బాలు మంగళవారం సమావేశమయ్యారు.
ఇరుపక్షాలు తమ తమ వాదనలకే కట్టుబడి ఉండటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. కొద్దిసేపట్లోనే ఈ భేటీ ముగిసింది. వేణుగోపాల్, బాలు అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. మూడుసార్లు ఎంపీ అయిన ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓం బిర్లా తరఫున 10కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు, టీడీపీ, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ (ఆర్) పార్టీలు ఓం బిర్లా తరఫున నామినేషన్‌లు దాఖలు చేశాయి. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత ఎంపీ కే.సురేష్ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. సురేష్ తరఫున మూడుసెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
సంప్రదాయాన్ని పాటించడం లేదు: వేణుగోపాల్
విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్ ఆరోపించారు. ఓం బిర్లాపై తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామని ప్రకటించారు. విపక్షం ఒత్తిడి రాజకీయాలకు దిగుతోందని, షరతులు పెడుతోందని కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, లలన్ సింగ్ (జేడీయూ)లు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే సమయం వచ్చినపుడు విపక్షాల డిమాండ్‌ను పరిశీలిస్తామని సీనియర్ మంత్రులు హామీ ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యం షరతులపై నడవదని పీయూష్ గోయల్ అన్నారు. ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు పోటీకి అంత సుముఖంగా లేనప్పటికీ కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
మూడోసారి పోటీ
స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగుతుంది. ఒకవేళ పోటీ అనివార్యమైతే.. లోక్‌సభ చరిత్రలో స్పీకర్ పదవికి పోటీ జరగడం ఇది మూడోసారి అవుతుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 1952, 1967, 1976లలో మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వి.మౌలాంకర్ 394 ఓట్లు సాధించి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి శాంతారాం మోరేకు కేవలం 55 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డితో తెన్నేటి విశ్వనాథం పోటీపడ్డారు. సంజీవరెడ్డికి 278 ఓట్లు రాగా, విశ్వనాథంకు 207 ఓట్లు పడ్డాయి.
1976లో జరిగిన ఎన్నిక పూర్తిస్థాయి స్పీకర్ పదవికి కాదు. 1975లో ఇందిగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఐదో లోక్‌సభ ఐదో సెషన్‌ను ఏడాది పాటు పొడిగించారు. అప్పటి స్పీకర్ జి.ఎస్.ధిల్లాన్ రాజీనామా చేయడంతో.. జనవరి 5, 1976న పొడిగించిన ఏడాది కాలానికి స్పీకర్ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నాయకుడు బలిరామ్ భగత్‌ను స్పీకర్ పదవికి ఇందిరా గాంధీ ప్రతిపాదించారు. జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి బరిలో నిలువడంతో ఎన్నిక జరిగింది. బలిరామ్ భగత్‌కు 344 ఓట్లు రాగా, జోషికి 58 ఓట్లు వచ్చాయి.
ప్రస్తుతం 18వ లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 (రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో విపక్షాల బలం ఒకటి తగ్గింది) ఎంపీలున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమికి ముగ్గురు స్వతంత్ర ఎంపీల మద్దతుంది. సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే. బుధవారం ఓటింగ్ జరిగితే.. పేపర్ స్లిప్పులనే వాడనున్నారు.
నూతన సభ్యులు ఎవరెక్కడ కూర్చోవాలో నిర్ణయించే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కాబట్టి ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థ సిద్ధంగా లేదు. ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైతే.. రెండు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేసిన ఐదోవ్యక్తి అవుతారు. కాకపోతే గతంలో కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ ఒక్కరు మాత్రమే రెండుసార్లు (ఏడు, ఎనిమిదో లోక్‌సభల్లో) స్పీకర్‌గా పూర్తి పదవీకాలాన్ని పూర్తిచేశారు.
అది మా హక్కు: సురేష్
‘గెలుస్తామా, ఓడుతామా అన్నది ముఖ్యం కాదు. అధికారపక్షం నుంచి స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలనేది సంప్రదాయం. గత రెండు లోక్‌సభల్లో మాకు పత్రిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు మేము గుర్తింపు పొందిన ప్రతిపక్షం. డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు. కానీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మంగళవారం 11:50 గంటల దాకా ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూశాం. ఎలాంటి సమాధానం రాలేదు’అని కే.సురేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment