కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొన్న పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ అంశంపై బహుముఖ దాడితో అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ముందుగా ‘ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్‌పై వేటు వేశా’రంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఎంపీలంతా మంగళవారం ఉదయమే సమావేశమై దీనిపై మల్లగుల్లాలు పడ్డారు.
కోర్టు శిక్ష విధించిన గంటల వ్యవధిలోనే ఆగమేఘాలపై రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన వైనాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా హైలైట్ చేయొచ్చన్న భావన వ్యక్తమైంది. అనంతరం దీనిపై విపక్షాలతో కూడా విస్తృతంగా చర్చోపచర్చలు జరిపినట్టు సమాచారం. అన్నీ కుదిరితే వచ్చే సోమవారం అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే కొన్ని విపక్షాలు ఇందుకు అభ్యంతరం చెబుతున్నట్టు సమాచారం.
ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్న విపక్షాల ఐక్యత యత్నాలకు ఇది గండి కొట్టే ప్రమాదముందన్నది వాటి వాదనగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు సంతకాలు అవసరం. పైగా పార్లమెంటు ఉభయ సభలూ రెండు వారాలుగా ఒక్క రోజు కూడా సజావుగా నడవని నేపథ్యంలో తీర్మానం సాధ్యాసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెట్టినా వీగిపోయే అవకాశాలే ఉన్నప్పటికీ ముందుకెళ్లాలనే యోచనలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.
త్యాగాలకు సిద్ధమవ్వాలి విపక్షాలకు రాహుల్ పిలుపు
రాహుల్‌పై వేటును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్‌తో సహా 17 ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌కు తాజాగా సంఘీభావం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంటులో కన్పించిన విపక్షాల ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ తొలి వారంలో విపక్ష అగ్రనేతలతో కీలక సమావేశం జరపాలని నిర్ణయించింది. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన విపక్షాల భేటీలోనే ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘విపక్షాల అగ్ర నేతలు, అధ్యక్షులంతా భేటీ అయ్యేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో పాటు డీఎంకే, జేడీ(యూ), సీపీఎం నేతలు ప్రతిపాదించారు.
2024 సాధారణ ఎన్నికలకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉందని వారు పదేపదే చెప్పారు’’ అని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వివరించారు. విపక్షాలన్నీ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ‘‘విపక్షాల ఐక్యత కోసం ఎంతటి త్యాగాలకైనా కాంగ్రెస్ సిద్ధం. నేనూ సిద్ధం’’ అని ఆయన కుండబద్దలు కొట్టారని సమాచారం. ఆ భేటీకి దూరంగా ఉన్న శివసేన (ఉద్ధవ్ వర్గం) కూడా తమతో కలిసి నడుస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వివరించారు అదానీ ఉదంతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తృణమూల్ సహా విపక్షాలను కాంగ్రెస్‌కు దగ్గర చేయడం తెలిసిందే.
‘అదానీ’పై మోదీకి లేఖలు!
రాహుల్‌పై వేటును నిరసిస్తూ, అదానీ అంశంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ నెల రోజుల పాటు బ్లాక్ స్థాయి నుంచి హస్తిన దాకా దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మార్చి 24న పార్టీ స్టీరింగ్ కమిటీ, పీసీసీ చీఫ్‌లు, అనుబంధ విభాగాల చీఫ్‌లతో జరిగిన భేటీలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. వివరాలు...
► ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మొదలు పెట్టి దేశంలోని 35 ప్రధాన నగరాల్లో మంగళ, బుధవారాల్లో ‘లోక్‌తంత్ర్ బచావో శాంతి మార్చ్’
► ఏప్రిల్ రెండో వారంలో ‘జై భారత్ మహా సత్యాగ్రహం’. ఇందులో భాగంగా బ్లాక్/మండల కాంగ్రెస్ విభాగాలు సభలు, సమావేశాలు నిర్వహించి రాహుల్‌పై వేటు, అదానీతో ప్రధాని మోదీ బంధంపై ప్రజలకు వివరిస్తాయి. రాహుల్ సందేశాన్ని పార్టీ సోషల్ మీడియా విభాగాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాయి.
► ఏప్రిల్ 15 నుంచి 20 దాకా జై భారత్ మహా సత్యాగ్రహంలో భాగంగా విపక్షాలతో కలిసి జిల్లాల్లో కలెక్టరేట్ల ఘెరావ్. రాష్ట్ర స్థాయిలోనూ భారీ కార్యక్రమం. ఒక్క రోజు ఉపవాస దీక్షలు. అనంతరం ఢిల్లీలో జాతీయ స్థాయిలో భారీ సత్యాగ్రహం.
► మార్చి 31న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతల మీడియా సమావేశాలు.
► యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎన్‌యూఐ తదితరాల ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం. అదానీ అవినీతి, రాహుల్‌పై వేటు తదితరాలపై ప్రశ్నిస్తూ ప్రధాని మోదీకి లేఖలు.
► మహిళా కాంగ్రెస్ నిరసన ర్యాలీ.
Comments
Please login to add a commentAdd a comment