ఫేస్‌బుక్ లో మంత్రి అచ్చెన్నాయుడు మిస్టేక్!
నూఢిల్లీ: తెలుగుదేశం నేతలకు పొరపాట్లు చేయడం, తరువాత నాలుక్కరుచుకోవడం అలవాటే. సాక్షాత్తు పార్టీ అధినేతే గతంలో బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు. అంతకు ముందు ‘బీకాంలో ఫిజిక్స్ చదివా’నంటూ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఫేమస్ అయిపోయారు.
తాజాగా ఏపీ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు దివంగత తెలుగుదేశం నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజర రామ్మోహన్ నాయుడుకు ఇటీవలే వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి రిసెప్షన్ వేడుకలను ఢిల్లీలో ఈనెల 19న ఏర్పాటు చేశారు.
ఈ విందుకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకకు ఎవరెవరు వచ్చారో తెలుపుతూ అచ్చెన్నాయుడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో ఫొటోలను పోస్టు చేశారు. అందులో ‘ప్రధాని నరేంద్రమోదీలతో పాటు లోకసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీమతి షీలా దీక్షిత్ గారు, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు’. అని రాశారు. వాస్తవానికి లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ కొనసాగుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెట్‌జన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ ఎవరో తెలియకుండా మంత్రి ఎలా అయ్యారంటూ మండిపడుతున్నారు. అయితే ఆ ఫేస్‌బుక్ అకౌంట్ సదరు మంత్రిగారిదో లేక నకిలీదో తెలియాల్సిఉంది.