న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందాన్ని కట్టబెట్టడం ద్వారా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ సాయం చేశారనీ, ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ ‘కాపలాదారుడు (ప్రధాని మోదీని ఉద్దేశించి) ఒక దొంగ. మోదీ.. మీరు పారిపోవచ్చు, దాక్కోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. విచారణ జరిగిన రోజు అంతా బయటకు వస్తుంది’అని పేర్కొన్నారు.
36 రఫేల్ యుద్ధ విమానాల ధరలపై కాగ్ నివేదికను రాహుల్ ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై కూడా సందేహం వ్యక్తం చేశారు. ‘కాగ్ నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) పరిశీలించిందనీ, ప్రస్తుతం ప్రజలకు ఇది అందుబాటులో ఉందని కోర్టు అంటోంది. కానీ పీఏసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే సహా ఆ నివేదికను ఎవరూ చూడలేదు. కానీ కాగ్ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాగ్ నివేదిక అసలు ఎక్కడుంది. దాన్ని మాకూ చూపించండి. ఫ్రాన్స్ పార్లమెంటుకు గానీ దాన్ని చూపించారా? ప్రధాని మోదీ ప్రతీ స్వతంత్ర, ప్రభుత్వ వ్యవస్థనూ నాశనం చేశారు. అలాగే పీఏసీని కూడా ఆయన నాశనం చేసి తన కార్యాలయంలోనే సొంత పీఏసీని ఏర్పాటు చేసుకున్నారా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఈ తీర్పు తర్వాతైనా రఫేల్ ఒప్పందంపై విచారణకు కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అంబానీ–మోదీ దోస్తీ నిరూపిస్తా!
Published Sat, Dec 15 2018 2:25 AM | Last Updated on Sat, Dec 15 2018 2:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment