ఢిల్లీలో రాఫెల్ వివాదంపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తను అరెస్టుచేస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ/పారిస్: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేశాయి. ఈ భారీ కాంట్రాక్ట్ విషయంలో కావాలనే వివాదాన్ని సృష్టిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం మండిపడింది. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ (ఆర్డీఎల్)ను చేర్చే విషయంలో తమ ప్రమేయం లేదని తెలిపింది. రాఫెల్ యుద్ధ విమానాలు తయారుచేసే డసో ఏవియేషన్ (ఫ్రెంచ్ కంపెనీ) కూడా వివాదం అవసరమే లేదని తన భారత భాగస్వామిని ఎన్నుకోవడం తమ సంస్థ తీసుకున్న నిర్ణయమని పేర్కొంది. రాఫెల్, ఆర్డీఎల్ భాగస్వామ్య ఒప్పందంలో తమ ప్రమేయం లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ వివాదంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్.. కేంద్రంపై చేస్తున్న విమర్శల జడి కొనసాగుతోంది.
మళ్లీ మళ్లీ అదే చెబుతున్నాం..
రూ.58వేల కోట్ల భారీ ఒప్పందంలో మేకిన్ ఇండియా భాగస్వామిగా భారత ప్రభుత్వం రిలయన్స్‌ను ప్రతిపాదించిందని హోలండ్ వ్యాఖ్యానించడం వివాదమైంది. ఈ వ్యాఖ్యలను శనివారం విడుదల చేసిన ప్రకటనలో రక్షణ శాఖ ఖండించింది. ‘ఆర్డీఎల్‌ను స్వదేశీ భాగస్వామిగా ఎంచుకోవడంలో డసో ఏవియేషన్‌కు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని గతంలోనే చెప్పాం. ఈ ఒప్పందంలో వివాదాలకు తావులేదు.
తన ప్రమాణాలకు తగ్గట్లుగా ఆర్డీఎల్ ఉందా? లేదా? అని నిర్ధారించుకున్నాకే డసో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. విమానాల తయారీకోసం జాయింట్ వెంచర్‌కు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని ప్రకటనలో పేర్కొంది. ‘హోలండ్ ప్రకటన పూర్తిపాఠాన్ని సరిగ్గా చదవాల్సిన అవసరం ఉంది. మాజీ అధ్యక్షుడైన హోలండ్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తులపై పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని లేవనెత్తేందుకు ఫ్రాన్స్ మీడియా చేసి న ప్రయత్నమిది’ అని రక్షణ శాఖ పేర్కొంది.
మేమే నిర్ణయించాం: డసో
ఆర్డీఎల్‌ను భాగస్వామిగా తీసుకోవడం పూర్తిగా తమ సంస్థ నిర్ణయమేనని డసో ఏవియేషన్ స్పష్టం చేసింది. ‘2016 రక్షణరంగ సేకరణ నిబంధనలు (డీపీపీ) ప్రకారమే ఆర్డీఎల్‌తో ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వ విధానమైన మేకిన్ ఇండియాను అమలుచేసేందుకు స్థానిక కంపెనీతో ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌తో జట్టుకట్టాం. ఇది పూర్తిగా డసో ఏవియేషన్ నిర్ణయమే’ అని ఆ సంస్థ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
డసో, ఆర్డీఎల్ సంయుక్తంగా నాగ్‌పూర్‌లో ఫాల్కన్, రాఫెల్ విమానాల విడిభాగాల తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నాయని వెల్లడించింది. అయితే డసో, ఆర్డీఎల్ భాగస్వామ్యంలో తమ పాత్ర ఏమీ లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ విధానాల ప్రకారం ఫ్రెంచ్ కంపెనీలు విదేశాల్లో తమ భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో పూర్తి స్వేచ్ఛను కల్పించామని పేర్కొంది. భారత ప్రభుత్వంతో పలు రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులు పెట్టామని.. ప్రతిచోటా భారత నిబంధనలకు అనుగుణంగానే అక్కడి కంపెనీల సామర్థ్యాన్ని సమీక్షించాకే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
నువ్వంటే నువ్వే!
రాఫెల్ వివాదంపై రాహుల్ గాంధీ విమర్శల జోరు పెంచారు. మోదీ, అంబానీ సంయుక్తంగా భద్రతా బలగాలపై రూ.1.3లక్షల కోట్ల సర్జికల్ స్ట్రైక్ చేశారని ఆరోపించారు. హోలండ్ ప్రకటనను ఆధారంగా చేసుకుని.. ‘అమరులైన సైనికుల రక్తాన్ని మోదీ అగౌరవ పరిచారు. ప్రధాని సిగ్గుపడాలి, భారతీయతను మోసం చేశారు’ అని రాహుల్ విమర్శించారు. ‘రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఉందనేది స్పష్టమైంది. ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. హోలండ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ బహిరంగ ప్రకటన చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ సరైన సమాచారం లేకుండా అవినీతి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. యూపీఏ హయాంలో ముడుపులు ఆశించే చర్చలు జరిపినా.. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. డసో, ఆర్డీఎల్‌మధ్య 2012లోనే ఒప్పందం కుదిరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్, చైనాలు ఆడించినట్లుగా రాహుల్ ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
ఢిల్లీలో రాఫెల్ వివాదంపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తను అరెస్టుచేస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment