సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చౌకీదార్ చోర్ (కాపలాదారే దొంగ) అనే వ్యాఖ్యలను తమకు ఆపాదించినందుకు గాను ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. రఫేల్ తీర్పుపై రాహుల్ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం) విచారణ చేపట్టింది. కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22 కల్లా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
చదవండి : రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
ఇటీవల ఎన్నికల సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి..చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అనిల్ అంబానికి రూ.40 వేల కోట్లు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో లబ్ధి జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల సభలో రాహుల్ పేర్కొన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment