‘రక్షణ’లో రాజీనా? | CAG Suspects Of Corruption Stash In Defense Dealings | Sakshi
Sakshi News home page

‘రక్షణ’లో రాజీనా?

Published Sun, Feb 17 2019 3:39 AM | Last Updated on Sun, Feb 17 2019 3:39 AM

CAG Suspects Of Corruption Stash In Defense Dealings - Sakshi

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కాగ్‌ నివేదిక ఉన్నప్పటికీ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు భారత రక్షణ ఒప్పందాల్లో అనుసరించిన విధానాలను మాత్రం ఘాటుగానే విమర్శించింది. అధికారంలో ఎవరున్నా.. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నాణ్యత లేని ఆయుధాలు భారత్‌కు వస్తున్నాయా? అన్న అనుమానం ప్రజల్లో ఎదురవుతోందని కాగ్‌ పేర్కొంది. సర్వసాధారణంగా రక్షణ ఒప్పందాల్లో నెలకొంటున్న లొసుగులను కాగ్‌ నివేదిక వివరించింది. 

వాయుసేన విధానాల్లో లోపాలు 
విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలంటే భారత వాయుసేన తమ నిబంధనలు, వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి ఆయుధాలు ఉండాలో, ఎంత ధర ఉండాలో.. ఎంతమేరకు సైనిక అవసరాలున్నాయో ముందే స్పష్టంగా చెప్పాలి. కానీ వాయుసేనకి ఈ అంశాలపై స్పష్టత కొరవడింది. ఎయిర్‌ స్టాఫ్‌ క్వాలిటేటివ్‌ రిక్వైర్‌మెంట్స్‌ (ఏఎస్‌క్యూఆర్‌) సూత్రీకరణ విధానాలను మెరుగుపరచుకోకపోవడం వల్ల భారత్‌ పలు ఆయుధాల ఒప్పందాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అపాచి అటాక్‌ హెలికాప్టర్లు, చినూక్‌ హెవీ లిఫ్ట్‌ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి 2015లో మోదీ సర్కార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటికి బదులుగా రష్యాకు చెందిన మిల్‌ ఎంఐ–26 హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఉంటే భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదనే చర్చ జరుగుతోంది. యుద్ధ ప్రాంతాలకు సైనికుల్ని, ఆయుధాల్ని చేరవేయడంలో చినూక్‌ కంటే మిల్‌ ఎంఐ–26కున్న సామర్థ్యం రెట్టింపని కొందరి వాదన. వాయుసేన తన అవసరాలను తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం బోయింగ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. 

ప్రామాణిక ధరల్లో మార్పు 
ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో సర్వసాధారణంగా ప్రభు త్వం ఒక ప్రామాణిక ధరను నిర్ణయించాలి. దానికి అనుగుణంగా వచ్చిన టెండర్లనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లని విప్పిచూసిన తర్వాత కూడా ఆ ధరల్ని మార్చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. డాప్లర్‌ వెదర్‌ రాడార్స్, అపాచి అటాక్‌ హెలికాఫ్టర్ల కొనుగోలులో అత్యంత కీలకమైన వాయుసేన ప్రమాణాలను (ఏఎస్‌క్యూఆర్‌) అమ్మకందారులు పాటించకపోయినప్పటికీ కాంట్రాక్టుల్ని అప్పగించారనే విమర్శలున్నాయి. 

బిడ్లు మార్చుకునే అవకాశం
ఆయుధాల కొనుగోలుకు టెండర్లను పిలిచాక విక్రేతలు బిడ్‌ వేస్తే దాన్ని మార్చే చాన్స్‌ ఇవ్వకూడదు. కానీ యూపీఏ ప్రభుత్వం యథేచ్ఛగా ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే విమర్శలున్నాయి. 2012లో యూపీఏ హయాంలో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్‌ కంపెనీకి బిడ్‌ మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని విపక్షాలు ఆరోపించాయి. అప్పుడప్పుడే విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన అతి చిన్న కంపెనీకి అలాంటి అవకాశం ఇవ్వడం వల్ల భారత్‌కు నాసిరకమైన విమానాలే వచ్చాయి. 

నిర్వహణ వ్యయంపై అవగాహన లేదు 
గతంలో.. ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని సంస్థ స్థాయిని చూడకుండా కొనుగోలు జరిగింది. వాటి నిర్వహణ వ్యయంపై ప్రభుత్వాలకు కనీస అంచనాలు ఉండకపోవడంతో భారీగా నష్టాలొచ్చాయి. స్విస్‌ పిలాటస్‌ విమానాల నిర్వహణ భారాన్ని మోయలేక.. వాటి వాడకాన్ని 2017లో మోదీ సర్కార్‌ నిలిపివేసింది. అదే ఆ విమానాల కొనుగోలుకు ముందే ఆలోచించి ఉంటే ఆర్థికంగా చాలా మేలు జరిగేది. 

ఒప్పందాల్లో జాప్యాలు..  
రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాలు కూడా మరో ప్రతికూల అంశమే. నాలుగు ఒప్పందాలకు మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, ఏడు ఒప్పందాలు కుదరడానికి అయిదేళ్ల కంటే ఎక్కువ పట్టింది. వివిధ స్థాయిల్లో అనుమతులు కావాల్సి ఉండడం, అధికారుల్లో నెలకొన్న అలసత్వం వల్లే ఈ జాప్యాలు జరుగుతున్నాయని కాగ్‌ నివేదిక విమర్శించింది. 

జాప్యాలతో ధరల భారం.. 
ఇలా సంవత్సరాల తరబడి జాప్యం జరగడం వల్ల ఆయుధాల ధరలు పెరిగిపోవడంతో.. దేశ ఖజానాపై అదనపు భారం పడుతోంది. రష్యా లేదా కామన్‌వెల్త్‌ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలులో ప్రతీ ఏడాది జాప్యానికి 5% ధర పెంచడానికి మన ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చింది. అదే యూరోపియన్‌ దేశాలకు 3.5% పెంచుకునేలా నిర్ణయించింది. కానీ మార్కెట్‌ ధరల్ని పరిశీలించి చూస్తే మన దేశం అనుమతించిన దానికి సగానికి సగం తక్కువగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ భారత్‌ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement