రఫెల్ డీల్‌లో అనిల్ అంబానీ కంపెనీని ఎంచుకున్నది డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీయేనని నరేంద్ర మోదీ సర్కార్ పదే పదే చెబుతుండగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే బాంబు పేల్చారు. రాఫెల్ జెట్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియన్ పార్టనర్‌గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందంటూ స్థానిక మీడియాపార్ట్ ఒక వ్యాసం ప్రచురించింది. ఇందులో ఈ డీల్ సందర్భంగా భాగస్వామి ఎంపికలో తమ ప్రభుత్వ పాత్ర ఏమీలేదని హోలాండే స్పష్టం చేసినట్టుగా నివేదించింది. సర్వీస్ ప్రొవైడర్‌గా అనిల్ అంబానీ కంపెనీ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని డస్సాల్ట్ కంపెనీ ఎంచుకోలేదని పునరుద్ఘాటించినట్టు తెలిపింది.
రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నారు. రఫెల్ ఒప్పందం నుండి హెచ్‌ఎఎల్‌ను తొలగించి, అంబానీకి కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఇవి తప్పుడు ఆరోపణలంటూ ఈ విమర్శలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్‌గా అంబానీ కంపెనీని డస్సాల్ట్ కంపెనీయే ఎంచుకుందనీ, అలాగే రఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని సీతారామన్ వాదిస్తున్నారు.
కాగా 2016లో భారత ప్రభుత్వం, ప్రాన్స్ ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు హెచ్‌ఏల్‌ను తొలగించారు.. ఎవరు అంబానీకి అప్పగించారు అనేది కీలక ప్రశ్నగా మారింది. హోలాండ్ వ్యాఖ్యలు నిజమని తేలితే మోదీ సర్కార్ ఇరుకు పడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామంపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు ఈ వ్యవహారంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. అటు ఈ అంశంపై స్పందించేందుకు న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment