Dassault Aviation
-
మళ్లీ రాజుకున్న రఫేల్ గొడవ
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ సంస్థ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్న అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌లో తాజాగా న్యాయ విచారణ మొదలైనట్లు ఫ్రెంచ్ పరిశోధక వెబ్సైట్ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. విచారణకు నేతృత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక న్యాయమూర్తిని నియమించినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. దాదాపు రూ.59 వేల కోట్ల విలువైన ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారిందని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసిన 36 రఫేల్ ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య 2016 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే కొన్ని ఫైటర్ జెట్లను దసాల్ట్ సంస్థ తయారుచేసి భారత్‌కు పంపించింది. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఇరుదేశాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద రఫేల్ డీల్‌పై ఫ్రాన్స్‌లో ‘నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ ఆఫీస్(పీఎన్ఎఫ్)’ ఆదేశాల మేరకు గత నెల 14న న్యాయ విచారణ అధికారికంగా ప్రారంభమైనట్లు మీడియాపార్ట్ పేర్కొంది. అత్యంత భారీ ఆర్థిక, వాణిజ్య నేరాల విచారణ కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం.. పీఎన్‌ఎఫ్‌ను 2013 ఏడాదిలో ఏర్పాటుచేసింది. భారత మధ్యవర్తికి రూ.8.84 కోట్లు రఫేల్ ఒప్పందంలో అవినీతి, అవకతవకలపై ‘షెర్పా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో) ఫిర్యాదు చేసిందని, ఆర్థిక నేరాల గుట్టును రట్టు చేయడంలో ఈ సంస్థ దిట్ట అని మీడియాపార్ట్ గతంలో పేర్కొంది. డీల్ కుదిర్చినందుకు దసాల్ట్ .. భారత్‌లోని ఓ మధ్యవర్తికి 10 లక్షల యూరోలు(దాదాపు రూ.8.84 కోట్లు) కమీషన్ కింద చెల్లించినట్లు వెబ్సైట్ పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలను దసాల్ట్ కంపెనీ కొట్టిపారేసింది. రఫేల్ ఒప్పందంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు చెప్పింది. రఫేల్ డీల్ లో కమీషన్ల బాగోతంపై వచ్చిన మొదటి ఫిర్యాదును 2019లో అప్పటి పీఎన్ఎఫ్ చీఫ్ ఎలియానీ హూలెట్ తొక్కిపెట్టారని మీడియాపార్ట్ వెబ్సైట్ పాత్రికేయుడు యాన్ ఫిలిప్పిన్ ఆరోపించారు. ప్రత్యర్థి కంపెనీల ఏజెంట్ రాహుల్: బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రత్యర్థి రక్షణ కంపెనీల ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆయా కంపెనీ చేతుల్లో పావుగా మారారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్‌తోపాటు రాహుల్ గాంధీ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసత్య ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పర్యాయపదంగా మారిపోయిందన్నారు. రఫేల్ డీల్‌లో సోనియా గాంధీ కుటుంబానికి కమీషన్లు ముట్టలేదని, ఆ అక్కసుతో ఎన్డీయే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ‘కాగ్’, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయని సంబిత్ గుర్తుచేశారు. ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు విశ్వసించలేదని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ పట్టం కట్టారని అన్నారు. జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన ఫైటర్ల జెట్ల కొనుగోలులో గోల్మాల్ను నిగ్గుతేల్చడానికి ఇదొక్కటే మార్గమని చెప్పారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, జేపీసీ దర్యాప్తునకు ఆదేశించాలని సూర్జేవాలా డిమాండ్‌చేశారు. ‘ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం అంగీకరించింది. న్యాయ విచారణ ప్రారంభించింది. అలాంటప్పుడు ఈ అవినీతికి మూలకేంద్రమైన భారత్‌లో జేపీసీ దర్యాప్తు ఎందుకు జరపకూడదు?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోటీ అంశం కాదని, దేశ భద్రత, అవినీతికి సంబంధించిన అంశమన్నారు. రఫేల్ డీల్ సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని తెలిపారు. -
‘రఫేల్’లో కమీషన్ల బాగోతం
పారిస్/న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ‘మీడియాపార్ట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనీ రఫేల్ ఫైటర్ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులకు(సుశేన్ గుప్తా) దసాల్ట్ 1.1 మిలియన్ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్ యాంటీ కరప్షన్(ఏఎఫ్ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్ ఖాతాలను ఏఎఫ్ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయంది. ‘గిఫ్ట్ టు క్లయింట్స్’ కింద భారీగా ఖర్చును దసాల్ట్ చూపించినట్లు వివరించింది. ‘మీడియాపార్ట్’ కథనాన్ని దసాల్ట్ ఖండించింది. తాము ఎవరికీ ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్ ఫైటర్జెట్ల ప్రతిరూపాలను(రెప్లికా) తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చిచెప్పింది. సుశేన్ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్ కంపెనీ ‘డెఫ్సిస్ సొల్యూషన్స్’కు ఆర్డర్ ఇచ్చి, ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా–వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సుశేన్ గుప్తా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. డెఫ్సిస్ సొల్యూషన్స్ సంస్థ దసాల్ట్ సంస్థకు భారత్‌లో సబ్ కాంట్రాక్టర్. 50 రఫేల్ నమూనాలను తయారీకి 1.1 మిలియన్ యూరోలను భారతీయ కంపెనీకి చెల్లించినట్లు దసాల్ట్ చెబుతున్నప్పటికీ, అందుకు ఆధారాలు చూపలేదని ఏఎఫ్ఏ నివేదించిందని ‘మీడియాపార్ట్’ తెలిపింది. ఒక్కో రఫేల్ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్ చెబుతోంది. సొంత ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చును ‘గిఫ్ట్ టు క్లయింట్’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు? ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా? ఏఎఫ్ఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, దసాల్ట్ సంస్థ సమాధానం చెప్పలేకపోయిందని, కనీసం ఒక్క డాక్యుమెంట్ చూపించలేకపోయిందని ఏఎఫ్ఏ నివేదికను ఉటంకిస్తూ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ మీడియాపార్ట్ కథనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీల్‌పై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: బీజేపీ రఫేల్ డీల్‌పై మీడియాపార్ట్ కథనాన్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. తప్పుడు ఆరోపణలపై మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్‌కు రవిశంకర్ హితవు పలికారు. -
ఘోర ప్రమాదం: రాఫెల్ ఫేమ్ ఓలివర్ డసాల్ట్ దుర్మరణం
ప్యారిస్: ఫ్రెంచ్ బిలియనీర్, ఎంపీ, యుద్ధ విమానాల తయారీ సంస్థ రఫేల్‌కు చెందిన ఓలివర్ డసాల్ట్ రాఫెల్ (69) దుర్మరణం తీవ్ర విషాదాన్ని రేపింది. ఫ్రాన్స్‌లోని నార్మాండీ ప్రాంతంలో ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. హెల్‌కాప్టర్ ప్రమాదంలో ఆలీవర్ దుర్మరణంపై సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఓలివీర్ ఆకస్మిక మరణం తమకు తీరని నష్టమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు. ఆయన మరణం చాలా బాధాకరం అంటూ కన్జర్వేటివ్ నేత, పారిస్ ప్రాంతీయ అధ్యక్షుడు వాలెరీ పెక్రెస్ ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. (Muthoot Group: ఛైర్మన్ జార్జ్ ముత్తూట్ దుర్మరణం) కాగా ఫ్రెంచ్ విమానాల తయారీ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు మార్సెల్ డసాల్ట్ మనవడు ఓలివర్ డసాల్ట్. దివంగత ఫ్రెంచ్ బిలియనీర్ పారిశ్రామికవేత్త సెర్జ్ డసాల్ట్ పెద్ద కుమారుడు. ఓలివర్ 2002లో ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలోని దిగువ సభకు ఎన్నికయ్యారు. ఓలివర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలివర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలున్నారు. భారత్‌కు రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. Olivier Dassault aimait la France. Capitaine d’industrie, député, élu local, commandant de réserve dans l’armée de l’air : sa vie durant, il ne cessa de servir notre pays, d’en valoriser les atouts. Son décès brutal est une grande perte. Pensées à sa famille et à ses proches. — Emmanuel Macron (@EmmanuelMacron) March 7, 2021 -
రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్చిట్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఫ్రాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదు. కాబట్టి గతంలో మేం కేంద్రానికి ఇచ్చిన క్లీన్చిట్కే కట్టుబడి ఉన్నాం. ఈ అంశంపై మోదీని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు తప్పు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం.. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. దీనికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని తాజాగా గురువారం కొట్టివేసిన ధర్మాసనం.. దీనిపై గతంలో ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. రూ.58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనలను కూడా తిరస్కరించింది. న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్ చిట్కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, దానికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని 2018, డిసెంబర్ 14నే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, లాయర్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని సుప్రీం స్పష్టంచేసింది. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్న అభ్యర్థనల్ని కూడా తిరస్కరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అంశాలేవీ అందులో లేవని న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా జస్టిస్ కౌల్ తీర్పు చదివి వినిపించారు. తీర్పుపై తాను ఏకీభవిస్తానని చెబుతూనే... కొన్ని అంశాల్లో తనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయంటూ జస్టిస్ జోసెఫ్ విడిగా తీర్పు ఇచ్చారు. అందుకు గల కారణాలను వెల్లడించారు. మే 10న రివ్యూ పిటిషన్లపై తీర్పుని రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు... ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న అంతర్ ప్రభుత్వ ఒప్పందంలో (ఐజీఏ) సాంకేతిక సహకారం బదిలీని ఎందుకు చేర్చలేదని, ఒప్పందానికి సంబంధించి సార్వభౌమ పూచీకత్తుని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ సంస్థలు కేసుల్ని నమోదు చేయలేవని కోర్టుకు విన్నవించారు. ఇక టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా రాఫెల్ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి సరైన సమాధానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఆయన వరస ట్వీట్లు చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలందరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ జాగ్రత్తగా ఉండండి: సుప్రీం కోర్టు చీవాట్లు కోర్టు ధిక్కార కేసులన్నీ క్లోజ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్ చోర్ హై (కాపలదారుడే దొంగ) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, భవిష్యత్‌లో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలేవీ జరగలేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ పదే పదే అదే వ్యాఖ్య చేసి ప్రధాని పరువు తీశారని, ఇదంతా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. దీన్ని విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ ఎస్కే పాల్, జస్టిస్ కేఎం జోసెఫ్ రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో కీలకమైన హోదా అనుభవిస్తున్న రాహుల్ వాస్తవాలు పరిశీలించకుండా ప్రధానికి వ్యతిరేకంగా మాట తూలడం దురదృష్టకరం’అని వ్యాఖ్యానించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పునుద్దేశించి చేసినవి కాదని, అవి పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలని గతంలోనే రాహుల్ అఫడివిట్ దాఖలు చేశారు. ఇప్పుడు రాహుల్ కోర్టుకి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ధిక్కార కేసుల్ని మూసివేస్తున్నట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు. రాఫెల్‌పై విచారణ జరపాల్సిందే: రాహుల్ రాఫెల్ ఒప్పందంపై తీర్పు వెలువరించిన జస్టిస్ కేఎం జోసెఫ్ పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పేర్కొన్న అంశాలు రాఫెల్ కుంభకోణంపై విచారణకు మార్గం చూపాయి. దీనిపై ఇప్పుడు దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగాలి. ఈ స్కాంపై జేపీసీ కూడా వేయాలి’అని గురువారం ఆయన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని, సుప్రీంకోర్టు తీర్పుతో పండగ చేసుకోవడం మాని విచారణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కోరారు. కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలు 1. జాతీయ భద్రతా ముసుగులో యుద్ధ విమానాల ధరను వెల్లడించకపోవడం ఎంతవరకు సరైనది ? ధర తడిసిమోపెడవడానికి కారణాలేంటి ? 2. రిలయెన్స్‌ను ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి ? 3. దేశీయ విమానాల తయారీ సంస్థ హాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు ? 4. ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో పరిణామాలు ఎలా జరిగాయి ? -
‘రఫేల్’లో ఏ కుంభకోణం లేదు
బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం, అవినీతి ఏదీ లేదని ఆ విమానాల తయారీ కంపెనీ డసో ఏవియేషన్ సీఈవో పేర్కొన్నారు. భారత వాయుసేనకు మరో 110 విమానాలను సమకూర్చే ఒప్పందాన్ని దక్కించుకునేందుకు కూడా తాము రేసులో ఉన్నామని ఆయన బుధవారం చెప్పారు. ఫ్రాన్స్‌కు చెందిన సంస్థ అయిన డసో ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రేపియర్ బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘రఫేల్ ఒప్పందంలో కుంభకోణమేదీ లేదు. 36 రఫేల్ విమానాలను మేం సరఫరా చేయబోతున్నాం. భారత ప్రభుత్వానికి మరిన్ని విమానాలు కావాలంటే వాటిని కూడా అందించేందుకు మేం సంతోషంగా అంగీకరిస్తాం’ అని ఆయన తెలిపారు. 110 విమానాల కొనుగోలుకు సంబంధించి భారత వాయుసేన 2018 ఏప్రల్ 6న తొలిదశ టెండర్లను (రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్) ఆహ్వానించగా, ఆ బిడ్డింగ్‌లో డసో ఏవియేషన్ కూడా పాల్గొంటోంది. రక్షణ రంగం లో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ ను భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా డసో ఏవియేషన్ ఎందుకు ఎంపిక చేసుకుందని ప్రశ్నించగా ‘వారికి అనుభవం లేదు నిజమే. కానీ మాకుందిగా. మా అనుభవాన్ని, సాంకేతికతను మేం భారత బృందానికి బదిలీ చేస్తు న్నాం. భారత బృందాన్ని మా కొత్త సంయుక్త సంస్థ ఎంపిక చేసింది. వారు భారత్‌కు, మా కొత్త కంపెనీకి ఉపయోగపడతారు. ఇంక సమస్యేముంది?’ అని ట్రేపియర్ అన్నారు. దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి లాభం చేకూర్చేందుకే డసోకు భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంపిక చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రిలయన్స్ గ్రూప్ ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థతోనూ ఎందుకు జట్టుకట్టారన్న ప్రశ్నకు ‘అవి వాళ్ల అంతర్గత విషయం.. కానీ మేం కలసి పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
‘మిషెల్ మామ’తో బంధమేంటి?
షోలాపూర్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో తమపై ఆరోపణలు చేసేలా కాంగ్రెస్‌ను ప్రేరేపిస్తున్నది ఏంటో ఆ పార్టీ చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మోదీ ఉటంకిస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉండి అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్.. యూపీఏ కాలం నాటి రఫేల్ ఒప్పందంలో డసో ఏవియేషన్ ప్రత్యర్థిగా ఉన్న మరో కంపెనీ యూరోఫైటర్ తరఫున లాబీయింగ్ చేశాడనీ, కంపెనీకి, ప్రభుత్వ పెద్దలకు నడుమ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ విషయం నిజమో కాదో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ‘రఫేల్ అంశంలో కాంగ్రెస్‌లోని ఏ నేతతో మిషెల్‌కు సంబంధాలున్నాయో ఆ పార్టీ చెప్పాలి. ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్క చూపాలి’ అని డిమాండ్ చేశారు. ఉన్నత కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ సజావుగా ఆమోదించడమే.. తమపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న వారికి గట్టి సమాధానమని మోదీ అన్నారు. దళితులు, గిరిజననులు తదితరుల హక్కులపై ఈ బిల్లు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన బుధవారం పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘గత ప్రభుత్వాల కాలంలో మధ్యవర్తుల వ్యవస్థ పాలనలో భాగంగా ఉండేది. ఆ ప్రభుత్వాలు పేదల హక్కులను హరించాయి. దేశ భద్రతతోనూ ఆటలాడుకున్నాయి’అని మోదీ అన్నారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన బిల్లుపై మోదీ మాట్లాడుతూ, దీని కారణంగా అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు. నన్నెవరూ కొనలేరు, భయపెట్టలేరు.. అవినీతిని శుభ్రం చేసేందుకు తాను నడుం బిగించాననీ, వెనక్కు తగ్గకుండా పనిచేసుకుపోతానని మోదీ వివరించారు. ‘మోదీని ఎవరూ కొనలేరు, భయపెట్టలేరు. ఈ కాపలాదారుడు నిద్రపోడు. తప్పుచేసే వాళ్లను చీకట్లోనూ పట్టుకోగలడు. వాళ్లు నన్ను దుర్భాషలాడటం ఆపకపోవచ్చు. కానీ అవినీతిని అంతం చేయాలన్న నా పనిని నేను విడిచిపెట్టను’ అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాహుల్ వర్సెస్ మోదీ జైపూర్: ‘మహిళ’ కేంద్రంగా బుధవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య వేర్వేరు వేదికలపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని ఒక ర్యాలీలో రాహుల్ ప్రధానిని ఉద్దేశిస్తూ ‘56 అంగుళాల ఛాతీ కలిగిన మన దేశ చౌకీదార్ పార్లమెంటు నుంచి పారిపోయారు. రఫేల్‌కు సంబంధించి నేనడిగిన చిన్న ప్రశ్న కు బదులివ్వలేక ఒక మహిళ అయిన రక్షణ మంత్రి సీతారామన్‌జీకి ఆ బాధ్యత అప్ప గించి తప్పించుకున్నారు’ అని అన్నారు. మహిళను అవమానించారు ఆగ్రా: జైపూర్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రాలో ప్రధాని మోదీ స్పందించారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘వారు ఒక మహిళను, దేశ రక్షణమంత్రిని అవమానించే స్థాయికి దిగజారారు. ఇది దేశ మహిళలను, మహిళాశక్తిని అవమానించడమే. అందుకు వారు శిక్ష అనుభవించక తప్పదు’ అని కాంగ్రెస్ అధినేతపై విరుచు కుపడ్డారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసు పంపించినట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. -
రఫేల్ ఒప్పందం సక్రమమే
న్యూఢిల్లీ: మోదీ సర్కారుకు పెద్ద ఊరట. రఫేల్ ఒప్పందంపై కేంద్రం తీరును సమర్థిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమకు కనిపించడం లేదని స్పష్టం చేసింది. విమానాల కొనుగోలుకు నిబంధనలను అనుసరించి రక్షణ ఉత్పత్తుల సేకరణ విధానాల (డీపీపీ) ప్రకారమే మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. ఈ ఒప్పందం లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా పదేపదే ఆరోపిస్తుండటం తెలిసిందే. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ వచ్చిన 36 పిటిషన్లను సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని సందేహించాల్సినం తగా మాకు ఈ ఒప్పందంలో తప్పులేవీ కనిపించడం లేదు’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం తెలిపింది. ఒకవేళ చిన్నచిన్న పొరపాట్లేమైనా ఈ ఒప్పందంలో జరిగి ఉంటే అవి ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన లేదా క్షుణ్నంగా పరిశీలించాల్సినంత పెద్ద తప్పులేమీ కాదని పేర్కొంది. ఈ తీర్పు అద్భుతమనీ, చాలా మంచి తీర్పనీ, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చినట్లుగా ఉందని కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్, తదితరులు రఫేల్ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం తెలిసిందే. ధరలను పోల్చడం మా పని కాదు.. యూపీఏ హయాంలో కొనుగోలుకు ప్రతిపాదించిన యుద్ధ విమానాలు, బీజేపీ ప్రభుత్వం కొంటున్న యుద్ధ విమానాల ధరలను పోల్చి చూడటం తమ పని కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివరాలను రహస్యంగానే ఉంచాలంది. కేవలం విలేకరుల సమావేశాల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు లేదా ఇచ్చిన సలహాల ఆధారంగా ఈ ఒప్పందంపై న్యాయ సమీక్ష చేయలేమనీ, అందునా ఆ వ్యాఖ్యలు లేదా సలహాలను ఇరు దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు మళ్లీ వాటిపై న్యాయ సమీక్ష జరపడం కుదరదని ధర్మాసనం తెలిపింది. భారత ప్రభుత్వ బలవంతంతోనే రిలయన్స్‌ను డసో ఏవియేషన్ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కొన్ని నెలల క్రితం ఫ్రెంచి మీడియాతో చెప్పడం తెలిసిందే. ‘యూపీఏ హయాంలో అనుకున్నట్లుగా 126 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని మేం బలవంతం చేయలేం. ఈ అంశంలో కోర్టు ప్రభుత్వానికి పై అధికారిగా వ్యవహరిస్తూ ఒప్పందం, విమానాల సేకరణకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలించడం సరికాదు’అని న్యాయమూర్తులు 29 పేజీలో తీర్పులో పేర్కొన్నారు. భారత వాయుసేనకు ఆధునిక విమానాలు కావాలనీ, శత్రుదేశాలు నాల్గో, ఐదో తరం యుద్ధ విమానాలను కూడా కలిగి ఉన్నందున మన వైమానిక దళానికి కూడా ఆధునిక విమానాలు కావాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అలా కాకుంటే మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం లేదా అసంపూర్తిగా సిద్ధం అవడం కిందకు వస్తుందన్నారు. (రఫెల్‌పై వెనక్కి తగ్గేదిలేదు) రిలయన్స్ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదు.. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పిటిషనర్ల ఆరోపణల్లోని ప్రధానంగా మూడు అంశాలపై విచారణ జరిపామని సుప్రీంకోర్టు తెలిపింది. వాటిలో ఒకటి ప్రభుత్వ నిర్ణయం, రెండోది విమానాల ధరలు కాగా ఇక మూడోది భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక ప్రక్రియ అని పేర్కొంది. ఈ మూడు అంశాలను పరిశీలించిన మీదట ఈ సున్నితమైన కేసులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తమకు అనిపించలేదని న్యాయూర్తులు అన్నారు. రఫేల్ విమానాలను ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుండగా భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామిగా రిలయన్స్‌ను ఆ కంపెనీ ఎంపిక చేసుకోవడం తెలిసిందే. మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే విమానాల తయారీలో అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను కాదని కొత్త సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌ను డసో ఏవియేషన్‌ను తమ ఆఫ్సెట్ భాగస్వామిగా ఎంపిక చేసుకుందని ఆరోపణలున్నాయి. అయితే ఇందుక తగ్గ ఆధారాలేవీ లేవనీ, ప్రభుత్వం వాణిజ్యపరంగా ఆశ్రిత పక్షపాతం చూపిందని నిరూపించేలా సాక్ష్యాలేవీ లేవని కోర్టు పేర్కొంది. ఒప్పందం ప్రకారం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక నిర్ణయం అసలు ప్రభుత్వం చేతుల్లోనే లేదని ధర్మాసనం తెలిపింది. -
రఫేల్ వివరాలు బయటపెడితేనే ధరలపై చర్చ సాధ్యం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం వివరాలు బహిర్గతమైతేనే వాటి ధరలపై చర్చించడం సాధ్యపడుతుందని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ కంపెనీ నుంచి భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలంటూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం సీల్డ్ కవర్లో అందించిన వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న విషయంపై తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ రిజర్వ్‌లో ఉంచింది. ‘రఫేల్ ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలా వద్దా అన్న దానిపై ఇప్పుడు మేం నిర్ణయం తీసుకోవాలి’ అని జడ్జీలు అన్నారు. ఒప్పందం వివరాలు బయటపెట్టకుండా ధరలపై విచారణ జరిపే అవకాశమే లేదని వారు కేంద్రానికి స్పష్టం చేశారు. అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్ కేంద్రం తరఫున వాదించారు. ధర, ఒప్పందం వివరాలు బహిర్గతమైతే శత్రు దేశాలకు ఇదో లాభించే అంశమవుతుందని ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వాయుసేన అవసరాలకు సంబంధించినది కాబట్టి.. ప్రభుత్వం పంపే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి కాకుండా వాయుసేన అధికారిని తాము ప్రశ్నించాలనుకుంటున్నామని జడ్జీలు తెలిపారు. వాయుసేన ఉన్నతాధికారులను కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా జడ్జీలు ఆదేశించడంతో హుటాహుటిన అధికారులు కోర్టుకు వచ్చారు. దీంతో ఎయిర్ వైస్ మార్షల్ జొన్నలగడ్డ చలపతి, ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా, ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి తదితరులు కోర్టుకు హాజరయ్యారు. చలపతిని సీజేఐ వివరాలు అడిగారు. 40 శాతం పెరిగింది: ప్రశాంత్ భూషణ్ పిటిషనర్లలో ఒకరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ఇతర పిటిషనర్లు, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీల తరఫున కూడా కలిపి వాదనలు వినిపించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో విమానం ధర 155 మిలియన్ యూరోలు కాగా, బీజేపీ ప్రభుత్వం ఆ ధరను 40 శాతం పెంచి, 270 మిలియన్ యూరోలకు ఒక్కో విమానాన్ని కొంటోందని భూషణ్ కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదన్నారు. ప్రభుత్వాల మధ్య ఒప్పందమే కాదు: కాంగ్రెస్ రఫేల్ ఒప్పందం రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం కానేకాదని కాంగ్రెస్ పేర్కొంది. విమానం నాణ్యత, ఒక్కో విమానం తయారీని ఎన్ని పనిగంటల్లో పూర్తి చేస్తారనే వాటిపై డసో ఏవియేషన్ ఏ విధమైన హామీ ఇవ్వనందున అది నిబంధనలను అతిక్రమించినట్లేననీ, కాబట్టి కేంద్రం ఆ కంపెనీతో ఈ ఒప్పందం చేసుకుని ఉండాల్సింది కాదని పేర్కొంది. కాంగ్రెస్ నేత, ప్రముఖ లాయరు కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘ఫ్రాన్స్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ రక్షణ పరికరాల సరఫరాపై మరో దేశ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. ఈ రకమైన ఒప్పందాన్ని కేవలం అమెరికా ప్రభుత్వం మాత్రమే చేసుకుంటుంది. రఫేల్ రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం కానేకాదు. ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ అనే కంపెనీతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది అంతే’ అని తెలిపారు. నిపుణులు చర్చించాల్సిన విషయాలివి: ఏజీ ఒప్పందం వివరాలు నిపుణులు చర్చించాల్సినవనీ, ఒక్కో యుద్ధ విమానం ధర ఎంతనే పూర్తి వివరాలను ఇప్పటివరకు పార్లమెంటుకే కేంద్రం తెలియజేయలేదని ఏజీ వాదించారు. యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విమానాల్లో ఆయుధాలను నింపే వ్యవస్థ లేదనీ, తాజా∙ఒప్పందం ప్రకారం ఆయుధాలను విమానంలోనే నింపి ఆకాశం నుంచి నేరుగా ప్రయోగించవచ్చన్నారు. ఇది అంతర ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ – ఇంటర్ గవర్న్మెంట్ అగ్రిమెంట్) అయినందున వివరాలను రహస్యంగా ఉంచాలని ఒప్పందంలో ఉందని ఏజీ కోర్టుకు చెప్పారు. కాబట్టి వివరాలను బహిర్గతం చేయడంలో కేంద్రానికి అభ్యంతరాలున్నాయన్నారు. -
రాఫెల్ డీల్ : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందం వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వం సోమవారం సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఒప్పందంలో ఏ భారత వాణిజ్య సంస్థ పేరును ప్రభుత్వం ఆఫ్సెట్ పార్టనర్‌గా సిఫార్సు చేయలేదని ఈ నివేదిక పేర్కొంది. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై పూర్తి వివరాలను పిటిషనర్‌తో పాటు ప్రజా బాహుళ్యానికి వెల్లడించాలని అక్టోబర్ 31న సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు రాఫెల్ విమానాల కచ్చిత ధరను సైతం సుప్రీం న్యాయమూర్తులకు సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికలో కేంద్రం పొందుపరిచింది. ఆఫ్సెట్ పార్టనర్ విషయంలో దసాల్ట్ ఏవియేషన్ నుంచి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదని కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. దీంతో ఈ ఒప్పందంలో రిలయన్స్ డిఫెన్స్ వాస్తవంగా ఎలాంటి పాత్ర పోషిస్తుందనే వివరాలను కేంద్రం అఫిడవిట్లో పొందుపరచలేదు. ఇక రాఫెల్ విమానాల సేకరణలో 2013 డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విధానాలను పాటించామని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం పొందామని, ఫ్రాన్స్‌తో భారత బృందం సంప్రదింపులు జరిపిందని తెలిపింది. ఫ్రాన్స్‌తో సంప్రదింపులు ఏడాదిపాటు సాగయని, ఒప్పందంపై సంతకం చేసేముందు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతి తీసుకున్నామని పేర్కొంది. దసాల్ట్ ఏవియేషన్ ఆఫ్సెట్ భాగస్వాముల ఎంపికలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. -
రాఫెల్ డీల్‌పై రాహుల్ : మోదీకి నిద్రలేని రాత్రులు
-
రాఫెల్ డీల్‌పై రాహుల్ : మోదీకి నిద్రలేని రాత్రులు
సాక్షి, న్యూడిల్లీ : రాఫెల్ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.ఈ ఒప్పందంపై విచారణ చేపడితే చర్యలు తప్పవనే భయంతో ప్రధాని మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. దసాల్ట్ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపిర్ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంబానీ భూమిని కొనుగోలు చేసిన అనంతరమే అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్‌ను ఆఫ్సెట్ భాగస్వామిగా దసాల్ట్ నియమించిందని ఆరోపించారు. నాగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో భూములున్నందునే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాదని, రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకున్నట్టు దసాల్ట్ ఏవియేషన్ ఇటీవల వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఏఎల్కు ఎక్కువ భూములున్నా పక్కనపెట్టి మరీ అంబానీ కంపెనీని భాగస్వామిగా ఎంచుకున్నారని రాహుల్ ఆరోపించారు. అనిల్ అంబానీకి నాగపూర్ ఎయిర్పోర్ట్ వద్ద భూములున్నందునే కాంట్రాక్టును ఇచ్చినట్టు దసాల్ట్ సీఈవో చెబుతున్నారని, అయితే దసాల్ట్ ఇచ్చిన డబ్బుతోనే అనిల్ అంబానీ భూములను కొనుగోలు చేసినట్టు వెల్లడైందని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ డీల్ ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్ అంబానీల మధ్య భాగస్వామ్య ఒప్పందమేనని దుయ్యబట్టారు. రాఫెల్ ఒప్పందంపై విచారణకు సిద్ధమైనందునే సీబీఐ చీఫ్ అలోక్ వర్మను తప్పించారని ఆరోపించారు. ఈ ఒప్పందంపై విచారణ జరిపితే మోదీ తప్పించుకోలేరని, ఇందుకు అవినీతి ఓ కారణమైతే, విధాన నిర్ణేతగా ప్రధాని దోషిగా నిలబడాల్సిందేనన్నారు. అనిల్ అంబానీకి రూ 30,000 కోట్లు కట్టబెట్టేందుకు మోదీ, అంబానీల మధ్య జరిగిన ఒప్పందం ఇదని రాహుల్ అభివర్ణించారు. రాఫెల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ చేపడితే స్వాగతిస్తామన్నారు. -
రఫేల్ ప్లాంట్‌లో రక్షణ మంత్రి
పారిస్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రఫేల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. పారిస్ సమీపంలోని ఈ ఉత్పత్తి కేంద్రంలో ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ తయారుచేసే విమానాలనే భారత్‌కు సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా డసో కంపెనీ ప్రతినిధులతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్, విమానాల తయారీ పురోగతిని పరిశీలించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి పలు దశల్లో రఫేల్ విమానాలు భారత్‌కు అందుతాయి. అంతకుముందు, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో సమావేశమైన నిర్మలా సీతారామన్..ఇరు దేశాల వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చించారు. వీరి మధ్య రఫేల్ ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందో? రాలేదో? తెలియరాలేదు. ఆగని విమర్శలు, ప్రతివిమర్శలు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలకోరు, వదంతుల సృష్టికర్త అని బీజేపీ మండిపడింది. రఫేల్ ఒప్పందంపై ఆయన తరచూ చెబుతున్న అబద్ధాలు నిజాన్ని కప్పిపుచ్చలేవని పేర్కొంది. డసో ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఫ్రాన్స్ ప్రభుత్వం రాహుల్ మాటల్లోని డొల్లతనాన్ని బహిర్గతంచేసిందని, ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. మరోవైపు, బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. రఫేల్ ఒప్పందంపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని, ఎవరు అబద్ధాలు చెబుతున్నారో అప్పుడే తెలుస్తుందని పేర్కొంది. గోయల్ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా స్పందిస్తూ ‘వాస్తవాల ఆధారంగానే మేము ప్రశ్నలు అడిగాం. మీరు కూడా వాస్తవాలతో కూడిన సమాధానాలు ఇవ్వాలి. దేశానికి నిజాలు కావాలి. రాహుల్‌కు మీరు ఆపాదిస్తున్న విశేషణాలు కాదు. అప్పుడు ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధాలాడుతున్నారు? అన్నది ప్రజలు నిర్ణయిస్తారు’ అని అన్నారు. -
రాఫెల్ వివాదం: రిలయన్స్ ఎంపికపై దసాల్ట్ వివరణ
న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందాన్ని సొంతం చేసుకునేందుకే రిలయన్స్ డిఫెన్స్‌ను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్ ఏవియేషన్ గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌కు చెందిన రిలయన్స్ గ్రూప్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నామని, 2017, ఫిబ్రవరి 10న దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ ఏర్పాటైందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్-ఫ్రాన్స్‌ల మధ్య 2016 సెప్టెంబర్‌లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగానే దసాల్ట్ ఏవియేషన్ భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలను విక్రయించిందని ప్రకటన పునరుద్ఘాటించింది. బీటీఎస్ఎల్, కైనెటిక్, మహింద్రా, మైని, శాంటెల్ వంటి వంద సంస్ధలతో వ్యాపార భాగస్వామ్యాలు కుదర్చుకున్నామని కూడా దసాల్ట్ వివరించింది. రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టును దక్కించుకునేందుకు అనివార్యంగానే రిలయన్స్ డిఫెన్స్‌తో డీల్‌కు సంస్థ సంతకం చేసిందని కంపెనీ అంతర్గత నివేదిక పేర్కొందనే వార్తల నేపథ్యంలో ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ దసాల్ట్ ఏవియేషన్ తాజా వివరణతో ముందుకొచ్చింది. రూ 60,000 కోట్ల రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ చేసిన ప్రకటనతో పెనువివాదంలో కూరుకుపోయింది. భారత్ ఒత్తిడి మేరకే రిలయన్స్ డిఫెన్స్‌ను ఒప్పందంలో భాగస్వామిగా చేర్చారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
ఈ ప్రశ్నలకు బదులు లేదంటే రా‘ఫేల్’!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం 60 వేల కోట్ల రూపాయలకు మించిపోయిన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కొనసాగుతున్న రగడకు సంబంధించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానానికి ఎక్కడ ఇసుమంత కూడా సంబంధం ఉండడం లేదు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత రావాలంటే కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. మొదటి ప్రశ్న : ఈ రాఫెల్ యుద్ద విమానాల ఒప్పందం గురించి అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు తెలుసా? తెలిస్తే ఆయన ఎందుకు క్యాబినెట్ సమావేశంలో ఇంత పెద్ద ఒప్పందం గురించి చర్చించలేదు ? చర్చించినట్లయితే ‘మినిట్స్’ ఉంటాయి గదా! ఎందుకు లేవు ? ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ వెళ్లి ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన వెంట పారికర్ ఎందుకు వెళ్లలేదు? 2015, ఏప్రిల్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ వెళ్లి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండేతో చర్చలు జరిపారు. 126 రాఫెల్ యుద్ధ విమానాలకు గాను 36 యుద్ద విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆదే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఒప్పందానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న డసౌ కంపెనీకి భారతీయ భాగస్వామి కంపెనీగా ఎంపికయిన అనిల్ అంబానీ నాయకత్వంలో రిలయెన్స్ గ్రూపు ‘రిలయెన్స్ డిఫెన్స్ ఫిక్సిడ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్’ సంస్థ మోదీ పర్యటనకు కేవలం 12 రోజుల ముందే 2015, మార్చి నెలలో ఏర్పాటయింది. అనిల్ అంబానీ గ్రూప్ 2015, జూన్ నెలలో మహారాష్ట్ర ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నాగపూర్‌లో ఇంటర్నేషనల్ కార్గో హబ్, ఎయిర్ పోర్ట్ సెజ్ నుంచి 289 ఎకరాల స్థలాన్ని కోరింది. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆ మేరకు స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ అంబానీ గ్రూప్ సంస్థకు అప్పగించింది. 2016లో భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల తుది ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతనే అనిల్ అంబానీ రిలయెన్స్ పేరు బయటకు వచ్చింది. 2017, అక్టోబర్ 27వ తేదీన నాగపూర్‌లో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో అనిల్ అంబానీ. పక్కన డసౌ ఏవియేషన్ సీఈవో ఎరిక్ ట్రాపియర్.... నాగపూర్‌లో 2017, అక్టోబర్ 27వ తేదీన ‘డసౌ రిలయెన్స్ ఎయిరోస్పేస్ లిమిటెడ్’ పేరిట సంయుక్త ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గడ్కారీ, డసౌ సీఈవో ఎరిక్ ట్రాపియర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, అనిల్ అంబానీ హాజరయ్యారు. అయినా డసౌ భాగస్వామ్య కంపెనీ రిలయెన్స్ కంపెనీ అని తనకు తెలియదని మనోహర్ పారికర్ స్థానంలో సెప్టెంబర్‌లోనే కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ పలు సార్లు పదే పదే చెప్పడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. 2016, జూన్ నెలలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేస్తూ రాఫెల్ యుద్ధ విమానాల గురించి తనకు తెలయదనే చెప్పారు. పవర్ఫుల్ ప్రధాని ఉన్నప్పుడు కేబినెట్ డమ్మీగా ఉండడం సహజమేగానీ, ఏకంగా 60 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన రక్షణ ఒప్పందం గురించి రక్షణ మంత్రికి చెప్పకుండా ఓ ప్రధాని ఒప్పందం చేసుకుంటారా? అన్నది రెండో ప్రశ్న. ఒప్పందం గురించి తనకు తెలియదన్నట్లుగా మాట్లాడినందుకే పారికర్‌ను మూడు నెలల్లోనే ఆ శాఖ నుంచి తప్పించారా? అనారోగ్య కారణాలే కారణమా? 2018, ఫిబ్రవరి నెలలో నిర్మలా సీతారామన్ రాజ్యసభలో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విలువను వెల్లడించకపోవడానికి కారణం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ నాడు ఫ్రాన్స్, భారత్‌తో ఒప్పందం చేసుకోవడమేనని తెలిపారు. ఇందులో ఏ మాత్రమైన నిజముందా? భారత్‌కు సంబంధించిన భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు భారతీయులకు జవాబుదారీగా ఉండాల్సిన భారత ప్రభుత్వం ఇలాంటి ఒప్పందానికి లొంగడం అంటే ఎంత అర్థరహితం. ఫ్రాన్స్‌కు చెందిన డసౌ ఏవియేషన్స్ కంపెనీ ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీ, అలాంటప్పుడు రహస్య ఒప్పందాలకు ఆస్కారం ఉండదు. భారత్‌కు 36 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి 8.139 బిలియన్ యూరోల విలువైన రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు 2016 బ్యాలెన్స్ షీట్లో ఆ కంపెనీ పేర్కొంది. ఒప్పందం విలువలో రహస్యమేమి లేదని, 36 విమానాల్లోని ఫీచర్స్ ఏమీటన్నదే రహస్యమని ఫ్రాన్స్ అధ్యక్షుడే ఆ తర్వాత వివరణ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నేటి రూపాయి విలువతో పోలిస్తే నాటి బిలియన్ యూరోల ఒప్పందం అక్షరాల 69 వేల కోట్ల రూపాయలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు అనుభవం లేదా? రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థయిన ‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)’ కంపెనీ డసౌ భాగస్వామ్య కంపెనీగా ఉండాలని ప్రతిపాదించారు. ఆ కంపెనీని కాదని అనిల్ అంబానీ కంపెనీని తీసుకరావడానికి కారణం ఏమిటంటే హెచ్ఏఎల్కు అంత అనుభవం లేకపోవడమేనని నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. అనుభవాలిదుగో! అంతకుముందు సోవియట్, ఆ తర్వాత రష్యా నుంచి మిగ్, సుఖోయ్ రేంజ్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఆ తర్వాత బ్రిటన్, ఫ్రెంచ్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఫొలాంగ్ గ్నాట్ నుంచి ఆంగ్లో-ఫ్రెంచ్ విమానాల ఒప్పందాల వరకు క్రియాశీలక భాగస్వామ్య కంపెనీగా ఉన్నది హెచ్ఏఎల్యే. అంతెందుకు ‘ఫ్రెంచ్ మిరేజ్-2000’ యుద్ధ విమానాల ప్రాజెక్టులో ప్రస్తుత డసౌ కంపెనీతోనే హెచ్ఏఎల్ గత 30 ఏళ్లుగా కలిసి పనిచేస్తోంది. అనిల్ కంపెనీకి జీరో అనుభవం యుద్ధ విమానాలను తయారు చేయడంలో అనిల్ అంబానీ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. అయినా నౌకా కంపెనీలో ఎరోనాటిక్స్ అన్నది ఓ చిన్న విభాగం. ఆయన నౌకా కంపెనీ 2011లో భారతీయ నౌకాదళంలో ఐదు నౌకల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని 2016, నవంబర్ నాటికి అప్పగించాలి. గత నెల సెప్టెంబర్ నెలలో రెండో నౌకను సరఫరా చేసింది. ఇక మరో మూడు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. 45 వేల కోట్ల అప్పులు అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్ కమ్యూనికేషన్లకు 45 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను భరించలేకనే ఆయన ఇటీవల అధాని గ్రూపునకు తన పవర్ కంపెనీలను 18వేల కోట్ల రూపాయలకు విక్రయించారు. అప్పుల్లో ఉన్న కంపెనీకి ఓ భారీ ప్రాజెక్టును కట్టబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలి? ఈ ప్రాజెక్ట్‌తో ఆ అప్పులన్నింటినీ తీర్చుకోమని చెప్పడమా? అనిల్ అంబానీ వేరు, ముకేష్ అంబానీ వేరు 2012, 2013లో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం గురించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చర్చలు జరిపినప్పుడు రిలయెన్స్ కంపెనీని కూడా పరిగణలోకి తీసుకున్నారని, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే వచ్చిందా? అని మోదీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ట్వీట్లు కూడా వదులుతున్నారు. ముకేష్ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీ అప్పట్లో సంప్రతింపుల్లో పాల్గొన్న మాట నిజం. 2014లోనే అది పూర్తిగా తప్పుకొంది. ముకేష్ కంపెనీలు వేరు అనిల్ అంబానీ కంపెనీలు వేరన్న విషయం మోదీ ముఖ్యులకే తెలియకపోతే ఎలా? -
రఫెల్ డీల్: బాంబు పేల్చిన హోలాండే
రఫెల్ డీల్‌లో అనిల్ అంబానీ కంపెనీని ఎంచుకున్నది డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీయేనని నరేంద్ర మోదీ సర్కార్ పదే పదే చెబుతుండగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే బాంబు పేల్చారు. రాఫెల్ జెట్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ను ఇండియన్ పార్టనర్‌గా నియమించాలని భారత ప్రభుత్వమే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కోరిందంటూ స్థానిక మీడియాపార్ట్ ఒక వ్యాసం ప్రచురించింది. ఇందులో ఈ డీల్ సందర్భంగా భాగస్వామి ఎంపికలో తమ ప్రభుత్వ పాత్ర ఏమీలేదని హోలాండే స్పష్టం చేసినట్టుగా నివేదించింది. సర్వీస్ ప్రొవైడర్‌గా అనిల్ అంబానీ కంపెనీ పేరును భారత ప్రభుత్వం ప్రతిపాదించిందని డస్సాల్ట్ కంపెనీ ఎంచుకోలేదని పునరుద్ఘాటించినట్టు తెలిపింది. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలను ఎక్కుపెడుతున్నారు. రఫెల్ ఒప్పందం నుండి హెచ్ఎఎల్ను తొలగించి, అంబానీకి కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఇవి తప్పుడు ఆరోపణలంటూ ఈ విమర్శలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సర్వీస్ ప్రొవైడర్‌గా అంబానీ కంపెనీని డస్సాల్ట్ కంపెనీయే ఎంచుకుందనీ, అలాగే రఫెల్ విమానాల ధర గత యూపీఏ ప్రభుత్వం అంగీకరించిన ధర కంటే 9 శాతం తక్కువని సీతారామన్ వాదిస్తున్నారు. కాగా 2016లో భారత ప్రభుత్వం, ప్రాన్స్ ప్రభుత్వంతో డస్సాల్ట్ కంపెనీకి చెందిన 36 రఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు హెచ్‌ఏల్‌ను తొలగించారు.. ఎవరు అంబానీకి అప్పగించారు అనేది కీలక ప్రశ్నగా మారింది. హోలాండ్ వ్యాఖ్యలు నిజమని తేలితే మోదీ సర్కార్ ఇరుకు పడినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తాజా పరిణామంపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు ఈ వ్యవహారంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని మండిపడ్డారు. అటు ఈ అంశంపై స్పందించేందుకు న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ నిరాకరించింది. -
రాఫెల్ జెట్ల కుంభకోణం.. రిలయన్స్ పాత్ర..!
న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన(ఐఏఎఫ్) కోసం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ జెట్ల వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఫ్రాన్స్ ఖండించింది. ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ అనే సంస్థ రాఫెల్ జెట్లను తయారు చేస్తుంది. భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ డస్సాల్ట్‌తో భాగస్వామిగా ఉంది. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ ఆరోపణలను వెనక్కు తీసుకోపోతే పార్టీని న్యాయపరంగా చర్యలకు వెళ్తామని హెచ్చరించింది. రిలయన్స్ కాంగ్రెస్‌పై తీవ్రంగా మండిపడటం వెనుక పెద్ద కారణమే ఉంది. రిలయన్స్ కంపెనీ యజమాని అనిల్ అంబానీకి లాభం చేకూర్చేలా రాఫెల్ జెట్ల కొనుగోలు ధరను ఎన్డీయే ప్రభుత్వం అమాంతం పెంచేసిందన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. 2015లో తన ఫ్రాన్స్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అప్పటి ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలెండ్‌తో చర్చించి రూ. 58 వేల కోట్లకు 36 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి 2012లోనే రాఫెల్ జెట్లను కొనుగోలు(ఇప్పటి ధరతో పోల్చితే తక్కువకు) చేసేందుకు యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చర్చలు జరిపింది. చర్చల్లో ఉండగానే.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ డీల్ మరుగునపడింది. దీంతో రాఫెల్ జెట్ల అవసరాన్ని వాయుసేన చీఫ్ పలుమార్లు ప్రధానితో చర్చించి వివరించారు. పాజిటివ్‌గా స్పందించిన ప్రధాని 2015లో డీల్‌ను కుదుర్చుకున్నారు. 2016 జూన్‌లో భారత ప్రభుత్వం రక్షణ రంగంలో 49 శాతం ప్రైవేటు పెట్టుబడులను(ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక అనుమతుల అవసరం లేకుండా) అనుమతించింది. మేక్ ఇండియాలో భాగంగా భారత్‌కు ఫ్రాన్స్ అందజేసే రాఫెల్ జెట్లలో కొన్నింటిని భారత్‌లోనే అసెంబుల్ చేసి అందించాలి. దీంతో డస్సాల్ట్ కంపెనీలో రూ. 30 వేల కోట్ల భాగస్వామ్యాన్ని రిలయన్స్ తీసుకుంది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఎన్డీయే ప్రభుత్వం కావాలనే డస్సాల్ట్‌లో భాగస్వామిగా రిలయన్స్‌కు అవకాశం ఇచ్చిందని, జెట్ల కొనుగోలు వెనుక పెద్ద కుంభకోణం జరగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని ఫ్రాన్స్ పేర్కొంది. పారదర్శక పద్దతి ద్వారా మాత్రమే రిలయన్స్ డస్సాల్ట్‌లో భాగస్వామి అయిందని చెప్పింది. 2012 ధరలకు, 2016 ధరలకు మార్పులు ఉండవా? అని రిలయన్స్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. భారత్‌లో జెట్లను అసెంబుల్ చేయడం వల్ల ధర మరింత పెరుగుతుందని తెలిపింది. ఆరోపణలు వెనక్కు తీసుకోకపోతే న్యాయపరంగా చర్యలకు ఉపక్రమిస్తామని కాంగ్రెస పార్టీకి హెచ్చరికలు పంపింది. -
ఫ్రాన్స్ కంపెనీతో రిలయన్స్ భారీ డీల్
ముంబై: ఫ్రాన్స్‌తో రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన భారీ ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజం డస్సాల్ట్ ఏవియేషన్‌తో దేశీ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం ' డస్సాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్' పేరుతో భాగస్వామ్య సంస్థ (జాయింట్ వెంచర్) ను ఏర్పాటు చేయనున్నాయి. రూ. 30,000 కోట్ల విలువైన ఆఫ్సెట్ కాంట్రాక్ట్ లను ఈ జేవీ చేపట్టనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించింది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కొత్త పథకం ఐడీడీఎం ప్రాజెక్టు (స్వదేశీపరిజ్ఞానంతోనే రూపకల్పన అభివృద్ధి మరియు ఉత్పత్తి)ను డసాల్ట్, రిలయన్స్ మధ్య ప్రతిపాదిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రమోట్ చేయనుంది. భారతదేశంలో తమ జాయింట్ వెంచర్ ఏర్పాటు పై డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్, రిలయన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ ధీరూభాయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యూహాత్మక పారిశ్రామిక భాగస్వామ్యాల అభివృద్దిలో కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వం మేక్ ఇండియా పాలసీకి తమ జాయింట్ వెంచర్ మరింత దోహదం చేస్తుందని డసాల్డ్ సీఈవో వ్యాఖ్యానించారు. ఎరిక్ ట్రాపియర్ లాంటి అధ్బుతమైన ప్రపంచ నాయకుడితో భాగస్వామ్యం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. ఇది భారత ఏరోస్పేస్ రంగం లో ట్రాన్స్ఫర్మేషనల్ మూమెంట్ అని తెలిపారు. అలాగే అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ కూడా ఈ జేవీ ద్వారా లబ్ది పొందనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. దీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేరు, రిలయన్స్ డిఫెన్స్ ఈనాటి మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. మరోవైపు ప్రయివేట్ డిఫెన్స్ ఇండస్ట్రీలో దేశంలో ఇదే అతిపెద్ద ఆఫ్ సెట్ ఒప్పందమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా రూ.58 వేల కోట్లతో 36 యుద్ధ విమానాల కొనుగోలుకుగత నెలలో ఒప్పందం కురింది. ఈ ఒప్పందంపై భారతదేశ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఫ్రెంచ్ రక్షణ మంత్రి జీన్ యవెస్ లెడ్రియన్ ఢిల్లీలో సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.