షోలాపూర్‌లో గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో మోదీకి ఖడ్గాన్ని బహూకరిస్తున్న ఫడ్నవిస్
షోలాపూర్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో తమపై ఆరోపణలు చేసేలా కాంగ్రెస్‌ను ప్రేరేపిస్తున్నది ఏంటో ఆ పార్టీ చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మోదీ ఉటంకిస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉండి అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్.. యూపీఏ కాలం నాటి రఫేల్ ఒప్పందంలో డసో ఏవియేషన్ ప్రత్యర్థిగా ఉన్న మరో కంపెనీ యూరోఫైటర్ తరఫున లాబీయింగ్ చేశాడనీ, కంపెనీకి, ప్రభుత్వ పెద్దలకు నడుమ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపించారు.
ఈ విషయం నిజమో కాదో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ‘రఫేల్ అంశంలో కాంగ్రెస్‌లోని ఏ నేతతో మిషెల్‌కు సంబంధాలున్నాయో ఆ పార్టీ చెప్పాలి. ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్క చూపాలి’ అని డిమాండ్ చేశారు. ఉన్నత కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ సజావుగా ఆమోదించడమే.. తమపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న వారికి గట్టి సమాధానమని మోదీ అన్నారు. దళితులు, గిరిజననులు తదితరుల హక్కులపై ఈ బిల్లు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన బుధవారం పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘గత ప్రభుత్వాల కాలంలో మధ్యవర్తుల వ్యవస్థ పాలనలో భాగంగా ఉండేది. ఆ ప్రభుత్వాలు పేదల హక్కులను హరించాయి. దేశ భద్రతతోనూ ఆటలాడుకున్నాయి’అని మోదీ అన్నారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన బిల్లుపై మోదీ మాట్లాడుతూ, దీని కారణంగా అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు.
నన్నెవరూ కొనలేరు, భయపెట్టలేరు..
అవినీతిని శుభ్రం చేసేందుకు తాను నడుం బిగించాననీ, వెనక్కు తగ్గకుండా పనిచేసుకుపోతానని మోదీ వివరించారు. ‘మోదీని ఎవరూ కొనలేరు, భయపెట్టలేరు. ఈ కాపలాదారుడు నిద్రపోడు. తప్పుచేసే వాళ్లను చీకట్లోనూ పట్టుకోగలడు. వాళ్లు నన్ను దుర్భాషలాడటం ఆపకపోవచ్చు. కానీ అవినీతిని అంతం చేయాలన్న నా పనిని నేను విడిచిపెట్టను’ అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నామన్నారు.
రాహుల్ వర్సెస్ మోదీ
జైపూర్: ‘మహిళ’ కేంద్రంగా బుధవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య వేర్వేరు వేదికలపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని ఒక ర్యాలీలో రాహుల్ ప్రధానిని ఉద్దేశిస్తూ ‘56 అంగుళాల ఛాతీ కలిగిన మన దేశ చౌకీదార్ పార్లమెంటు నుంచి పారిపోయారు. రఫేల్‌కు సంబంధించి నేనడిగిన చిన్న ప్రశ్న కు బదులివ్వలేక ఒక మహిళ అయిన రక్షణ మంత్రి సీతారామన్‌జీకి ఆ బాధ్యత అప్ప గించి తప్పించుకున్నారు’ అని అన్నారు.
మహిళను అవమానించారు
ఆగ్రా: జైపూర్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రాలో ప్రధాని మోదీ స్పందించారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘వారు ఒక మహిళను, దేశ రక్షణమంత్రిని అవమానించే స్థాయికి దిగజారారు. ఇది దేశ మహిళలను, మహిళాశక్తిని అవమానించడమే. అందుకు వారు శిక్ష అనుభవించక తప్పదు’ అని కాంగ్రెస్ అధినేతపై విరుచు కుపడ్డారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసు పంపించినట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment