Christian Michel James
-
విదేశీయుడని ఎన్నాళ్లు కస్టడీలో ఉంచుతారు?
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌ను విదేశీయుడన్న కారణంతో ఎన్ని రోజులు పోలీసు కస్టడీలో ఉంచుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతను భారతీయుడు కాకపోవడంతో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉంచడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ఇది అతని స్వేచ్ఛను పూర్తిగా అణిచివేయడమేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పిఎస్.నరసింహలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. బ్రిటన్ జాతీయుడైన మైఖేల్‌ను దుబాయ్ 2018లో భారత్‌కు అప్పగించింది. అప్పట్నుంచి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మైఖేల్ సుప్రీంలో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం .. విదేశీయుడైనందుకు అతను అలాగే కస్టడీలో మగ్గిపోవాలా ? అని వ్యాఖ్యానించింది. మైఖేల్ జేమ్స్ అప్పగింత సమయంలో జరిగిన ఒప్పందం వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2023 జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
‘అగస్టా’ మైకేల్‌ను విచారించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్(58)ను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 26 వరకు విచారించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మైకేల్ ఉంటున్న తీహార్ సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ జరగనుంది. జైల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలోగానీ, లేదా ఆయన అనుమతించిన వారి పర్యవేక్షణలోగానీ ఈ విచారణ జరగనుంది. గతేడాది డిసెంబర్లో దుబాయ్ ప్రభుత్వం ఆయనను భారత్‌కు అప్పగించింది. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
మిషెల్ బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: ఈస్టర్ పండగ జరుపుకునేందుకు వారం పాటు బెయిల్ ఇవ్వాలం టూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభ కోణంలో నిందితుడు క్రిస్టియన్ మిషెల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో అతడు తప్పించుకు పోయేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాల తీవ్రత దృష్ట్యా మిషెల్‌కు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక జడ్జి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. అగస్టా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసినందున సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం లేదని, అధికారుల విచారణకు మిషెల్ సహకరిస్తున్నాడని అతని లాయర్ తెలిపారు. ‘ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్రైస్తవులకు పవిత్ర వారం, 21న ఈస్టర్ పండగ. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మిషెల్‌కు వారం పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. దీనిపై ఈడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉండి కూడా మిషెల్ పండగ జరుపుకోవచ్చని అన్నారు. -
రూ.544 కోట్ల ముడుపులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చేట్లుగా ఉంది. అప్పటి యూపీయే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు, రక్షణ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు సుమారు రూ.544 కోట్ల(70 మిలియన్ యూరోల) ముడుపులు ముట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఒప్పంద విలువ రూ.3,600 కోట్లలో ఈ మొత్తం సుమారు 12 శాతమని తెలిపింది. ఈ వివరాలతో శుక్రవారం ఢిల్లీ కోర్టులో నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. మధ్యవర్తి, బ్రిటిష్ జాతీయుడైన క్రిస్టియన్ మిషెల్‌పై ఈ చార్జిషీటును వేసింది. ఇందులో ‘మిసెస్ గాంధీ’ అని పరోక్షంగా యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీని ప్రస్తావించినా ఆమెను నిందితురాలిగా చేర్చలేదని విశ్వసనీయ సమాచారం. ఈడీ ఆరోపణల్ని కోర్టు శనివారం పరిశీలించి, నిందితులు తమ ముందు హాజరుకావాలో? వద్దో? నిర్ణయించనుంది. మరోవైపు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు విచారణ సందర్భంగా తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని మిషెల్ కోర్టుకు చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈడీ చార్జిషీటు పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. చార్జిషీట్ ఎన్నికల స్టంట్: కాంగ్రెస్ ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఓటమి భయం పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ ద్వారా కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇలాంటి పరోక్ష ఆరోపణలు, అబద్ధాల్ని గతంలో కూడా ప్రచారం చేశారని, కానీ అవి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలవలేకపోయాయని అన్నారు. మోదీ, ఈడీలు ఎన్డీయే ప్రభుత్వ తలరాతను మార్చలేరని, ప్రజలు వారిని ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే చార్జిషీటులో ఎంపికచేసిన అంశాల్ని బయటకు పొక్కేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల సీజన్లో నిరాధార హాస్యాస్పద ఆరోపణలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యమే గెలుస్తుందని తనపై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఒక దొంగకు అందరూ దొంగలుగానే కనిపిస్తారని పరోక్షంగా మోదీని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేశారు.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కొనుగోలు ఒప్పందాన్ని విజయవంతంగా కుదిర్చినందుకు మధ్యవర్తులు మిషెల్, గైడో హష్కే ద్వారా రూ.544 కోట్లు చేతులు మారినట్లు ఈడీ తన చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేసినందుకు వేర్వేరు దశల్లో నిందితులకు ఈ మొత్తం ముట్టినట్లు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఏపీ(అహ్మద్ పటేల్), ఫ్యామ్(కుటుంబం) పేర్లను చార్జిషీటులో ప్రస్తావించింది. 2008 ఫిబ్రవరి, 2009 అక్టోబర్ మిషెల్ పలుమార్లు లేఖలు రాశారని చార్జిషీటులో ఈడీ ప్రస్తావించించింది. మిసెస్ గాంధీ, ఆమెకు అత్యంత సన్నిహితులైన సలహాదారులను ఒప్పించే బాధ్యతను భారత హైకమిషన్‌కు అప్పగించినట్లు ఈడీ తెలిపింది. మిసెస్ గాంధీ సన్నిహితులుగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఎంకే నారాయణన్, వినయ్ సింగ్‌లను పేర్కొన్నా వారిని నిందితులుగా చేర్చలేదు. అయితే, మిసెస్ గాంధీ ఎవరు? ఏ సందర్భంలో ఆమె పేరును లేవనెత్తారో పూర్తి వివరాలు తెలియరాలేదు. నింది తుల జాబితాలో ముగ్గురు భారత పాత్రికేయులు ఉన్నా వారి పేర్లు బహిర్గతం కాలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా మీడియా ప్రముఖులతో పరిచయం పెంచుకున్నట్లు మిషెల్ అంగీకరించినట్లు ఈడీ పేర్కొంది. -
అస్తానా నరకం చూపిస్తానన్నాడు
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విచారణలో చెప్పినట్లు వినకుంటే జైలులో తన జీవితాన్ని నరకప్రాయం చేస్తానని సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా బెదిరించినట్లు ఆరోపించాడు. మంగళవారం ఢిల్లీ కోర్టు ముందు ఆయన ఈ విషయాలు వెల్లడించాడు. చాలా మందిని చంపిన నేరగాళ్ల పక్కనే తనను జైలులో ఎందుకు ఉంచారని, తానేం నేరం చేశానని ప్రశ్నించాడు. ‘కొన్నేళ్ల క్రితం రాకేశ్ అస్తానా నన్ను దుబాయ్‌లో కలిసి నా జీవితాన్ని నరకప్రాయం చేస్తానని బెదిరించారు. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నా గది పక్కనే గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను ఉంచారు. 16–17 మంది కశ్మీరీ వేర్పాటువాదుల్ని కూడా నేనున్న జైలులోనే నిర్బంధించారు’ అని మిచెల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా, మిచెల్‌ను నేడు, రేపు తీహార్ జైలులోనే విచారించేందుకు స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతిచ్చారు. ఈ సమయంలో జైలు అధికారి ఒకరు అక్కడే ఉంటారు. మిచెల్‌ను ఆయన లాయర్ ఉదయం, సాయంత్రం అరగంట చొప్పున కలుసుకునేందుకు కూడా అనుమతిచ్చారు. జైలులో తనని మానసిక వేధింపులకు గురిచేశారన్న మిచెల్ ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు..సీసీటీవీ ఫుటేజీని గురువారం నాటికి సమర్పించాలని జైలు అధికారుల్ని ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో లాయర్ గౌతమ్ ఖైతాన్ బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. ఖైతాన్ విదేశాల్లో నల్లధనం, ఆస్తులు కూడబెట్టాడని ఈడీ ఆరోపించడంతో జనవరి 26న కోర్టు ఆయన్ని రెండ్రోజుల కస్టడీకి పంపిన సంగతి తెలిసిందే. -
‘భారత్ వస్తే జీవితం నరకం అవుతుందన్నారు’
న్యూఢిల్లీ : సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా తనను బెదిరింపులకు గురిచేశారంటూ క్రిస్టియన్ మైకేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి మైకేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్ ఆస్థానా గత మేలో దుబాయ్‌లో తనతో మాట్లాడారంటూ మైకేల్ మంగళవారం కోర్టుకు తెలిపాడు. భారత్‌కు తిరిగి వస్తే తన జీవితం నరకం అవుతుందని రాకేష్ తనను హెచ్చరించాడని అతడు పేర్కొన్నాడు. ఇక వైట్ కాలర్ నేరగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను హంతకులు, ఉగ్రవాదుల బ్లాకులో ఉంచడం సరైంది కాదని మైకేల్ కోర్టుకు విన్నవించినట్లు సమాచారం. ఈ క్రమంలో మైకేల్ ఉన్న బ్లాక్‌లో అటువంటి వ్యక్తులెవరూ లేరని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలపై ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. రాకేష్ ఆస్థానాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేయగా.. తనను ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్తాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇంతకీ మైకేల్ ఎవరు? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశాడు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగాడు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చాడు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగాడు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997-2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
‘మిషెల్ మామ’తో బంధమేంటి?
షోలాపూర్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో తమపై ఆరోపణలు చేసేలా కాంగ్రెస్‌ను ప్రేరేపిస్తున్నది ఏంటో ఆ పార్టీ చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మోదీ ఉటంకిస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉండి అరెస్టయిన క్రిస్టియన్ మిషెల్.. యూపీఏ కాలం నాటి రఫేల్ ఒప్పందంలో డసో ఏవియేషన్ ప్రత్యర్థిగా ఉన్న మరో కంపెనీ యూరోఫైటర్ తరఫున లాబీయింగ్ చేశాడనీ, కంపెనీకి, ప్రభుత్వ పెద్దలకు నడుమ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ విషయం నిజమో కాదో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ‘రఫేల్ అంశంలో కాంగ్రెస్‌లోని ఏ నేతతో మిషెల్‌కు సంబంధాలున్నాయో ఆ పార్టీ చెప్పాలి. ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్క చూపాలి’ అని డిమాండ్ చేశారు. ఉన్నత కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ సజావుగా ఆమోదించడమే.. తమపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న వారికి గట్టి సమాధానమని మోదీ అన్నారు. దళితులు, గిరిజననులు తదితరుల హక్కులపై ఈ బిల్లు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన బుధవారం పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘గత ప్రభుత్వాల కాలంలో మధ్యవర్తుల వ్యవస్థ పాలనలో భాగంగా ఉండేది. ఆ ప్రభుత్వాలు పేదల హక్కులను హరించాయి. దేశ భద్రతతోనూ ఆటలాడుకున్నాయి’అని మోదీ అన్నారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన బిల్లుపై మోదీ మాట్లాడుతూ, దీని కారణంగా అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు. నన్నెవరూ కొనలేరు, భయపెట్టలేరు.. అవినీతిని శుభ్రం చేసేందుకు తాను నడుం బిగించాననీ, వెనక్కు తగ్గకుండా పనిచేసుకుపోతానని మోదీ వివరించారు. ‘మోదీని ఎవరూ కొనలేరు, భయపెట్టలేరు. ఈ కాపలాదారుడు నిద్రపోడు. తప్పుచేసే వాళ్లను చీకట్లోనూ పట్టుకోగలడు. వాళ్లు నన్ను దుర్భాషలాడటం ఆపకపోవచ్చు. కానీ అవినీతిని అంతం చేయాలన్న నా పనిని నేను విడిచిపెట్టను’ అని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాహుల్ వర్సెస్ మోదీ జైపూర్: ‘మహిళ’ కేంద్రంగా బుధవారం ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య వేర్వేరు వేదికలపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని ఒక ర్యాలీలో రాహుల్ ప్రధానిని ఉద్దేశిస్తూ ‘56 అంగుళాల ఛాతీ కలిగిన మన దేశ చౌకీదార్ పార్లమెంటు నుంచి పారిపోయారు. రఫేల్‌కు సంబంధించి నేనడిగిన చిన్న ప్రశ్న కు బదులివ్వలేక ఒక మహిళ అయిన రక్షణ మంత్రి సీతారామన్‌జీకి ఆ బాధ్యత అప్ప గించి తప్పించుకున్నారు’ అని అన్నారు. మహిళను అవమానించారు ఆగ్రా: జైపూర్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రాలో ప్రధాని మోదీ స్పందించారు. ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘వారు ఒక మహిళను, దేశ రక్షణమంత్రిని అవమానించే స్థాయికి దిగజారారు. ఇది దేశ మహిళలను, మహిళాశక్తిని అవమానించడమే. అందుకు వారు శిక్ష అనుభవించక తప్పదు’ అని కాంగ్రెస్ అధినేతపై విరుచు కుపడ్డారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసు పంపించినట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. -
మిషెల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ముందు మిషెల్‌ను ఈడీ ప్రవేశపెట్టి 15 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో కోర్టు ముందుగా 15 నిమిషాలపాటు మిషెల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టు అనుమతితో ఈడీ మిషెల్‌ను అరెస్టు చేసింది. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ముడుపులకు సంబంధించి తమ విచారణలో 3 కోట్ల యూరోల గురించే సమాచారం ఉందనీ, సీబీఐ మాత్రం ఆ మొత్తం 3.7 కోట్ల యూరోలంటోంది కాబట్టి ఈ వ్యత్యాసంపై లెక్క తేల్చేందుకు తాము మిషెల్‌ను అరెస్టు చేయాల్సి ఉందని గతంలో ఈడీ కోర్టును కోరింది. -
మిషెల్‌కు బెయిల్ ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మిషెల్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ ఢిల్లీలోని ఓ కోర్టును కోరింది. భారత్ తరఫున సరైన సాక్ష్యాలను సమర్పించకపోవడంతోనే ఇటలీలోని ఓ న్యాయస్థానం అగస్టా కేసును కొట్టివేసిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం మిషెల్‌ను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసింది. మిషెల్‌కు విధించిన నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయన్ను బుధవారం కోర్టు ముందు హాజరుపరిచారు. మిషెల్ న్యాయవాది జోసెఫ్ వాదిస్తూ.. ఆయన డిస్లెక్సియా వ్యాధితో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
అధికారుల ప్రయాణాలకు రూ.92 లక్షలు
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్ ఎయిర్‌ఫోర్స్ అధికారుల విమాన ప్రయాణాల కోసం రూ.92 లక్షలు ఖర్చు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సుమారు రూ.2,666 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఈ కుంభకోణంలో పలు కీలక విషయాలపై మిషెల్ సమాధానం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సీబీఐ..మరో ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలంటూ శనివారం ప్రత్యేక కోర్టును కోరింది. అయితే, ఆ అధికారుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. 2009, 2013 సంవత్సరాల మధ్య ఎయిర్‌ఫోర్స్ అధికారుల ప్రయాణాల కోసం రూ.92 లక్షలను మిచెల్ వెచ్చించాడని తెలిపింది. అతడిని ముంబైలోని పవన్ హన్స్ ఇండియా లిమిటెడ్ కార్యాలయానికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించి వివిధ దేశాల నుంచి సేకరించిన పత్రాల్లోని అంశాలపై మిషెల్ మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉందని తెలిపింది. మిషెల్‌ను మరో నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన న్యాయస్థానం..అతడితో పది నిమిషాలపాటు మాట్లాడేందుకు లాయర్ రోజ్మేరీకి అవకాశం ఇచ్చింది. -
చాయ్‌వాలా కోర్టు మెట్లెక్కించాడు
సుమేర్పూర్/దౌసా: నాలుగు తరాలపాటు దేశాన్ని పాలించిన గాంధీల కుటుంబాన్ని నేడు ఓ చాయ్‌వాలా కోర్టు వరకు తీసుకొచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011–12 ఆర్థిక సంవత్సరంలో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీల ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అనుమతివ్వడం తెలిసిందే. పాలి, దౌసా జిల్లాల్లో మోదీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో నేను చూస్తా. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కుటుంబాన్ని కోర్టుకు తీసుకొచ్చిన టీ అమ్మే వ్యక్తి ధైర్యాన్ని చూడండి’ అని మోదీ అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైకేల్ క్రిస్టియన్‌ను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన అంశాన్నీ మోదీ ప్రస్తావించి కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. మైకేల్ నోరు తెరిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గాంధీ కుటుంబం వణికిపోతోందనీ, ఇది వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్న కుంభకోణమని మోదీ అన్నారు. ‘మైకేల్ రాజకీయ నేతలకు సేవలందించాడు. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లోని కుంభారం ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అని తప్పుగా పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంతా అయోమయంలో కూరుకుపోయిన పార్టీ అనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని కోరారు. గాంధీల కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందనీ, తమ పార్టీకి దేశమే కుటుంబమనీ, కాబట్టి మరోసారి రాజస్తాన్‌లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో ముగిసిన ప్రచారం రాజస్తాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య సాగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రానికి ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలుండగా 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 199 మంది మహిళలు, 830 మంది స్వతంత్రులు సహా మొత్తం 2,274 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆళ్వార్ జిల్లాలోని రామగఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ ముఖ్య ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మొత్తం 4.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 130 స్థానాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉండనుంది. మరో 50 సీట్లలో ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
సోనియా లక్ష్యంగా ‘అగస్టా’ కుట్ర
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని ఇరికించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇందులోభాగంగా సోనియాకు వ్యతిరేకంగా తప్పుడు నేరాంగీకార వాంగ్మూలం ఇవ్వాలని ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్‌ను విచారణ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని వెల్లడించింది. ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ప్రధాని మోదీ విచారణ సంస్థలను వాడుకుంటున్నారంది. ఈ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పుడు ఆధారాల సృష్టికి సాక్షాత్తూ ప్రధానమంత్రి పూనుకోవడం భారత దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నడూ సంభవించలేదు’ అని మండిపడ్డారు. ఈ ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న క్రిస్టియన్ మిచెల్‌ను దుబాయ్ పోలీసులు రెండ్రోజుల క్రితం అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. శిక్ష నుంచి తప్పించుకునేందుకు సోని యాకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని మిచెల్‌ను విచారణ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని అతని లాయర్ ఆరోపించారు. -
అగస్టా స్కాంలో ఈడీ దర్యాప్తు వేగవంతం
న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈడీ సోమవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలతో పాటు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈడీ ఏయే సంస్థలపై సోదాలు నిర్వహించిందనే దానిపై వివరాలను గోప్యంగా ఉంచింది. మరోవైపు అగస్టా కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇప్పటికే దుబాయి, మారిషస్, సింగపూర్‌లో ఆ సంస్థ కంపెనీలపై సోదాలు నిర్వహించి రూ.86.07 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాఫ్టర్ కుంభకోణంపై బుధవారం ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణానికి మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దేశంలో పెను దుమారం రేపిన రూ. 3,600 కోట్ల లావాదేవీకి సంబంధించిన అగస్టా మనీల్యాండరింగ్ కేసులో క్రిస్టియన్ మైఖేల్ మధ్యవర్తి అన్న ఆరోపణలు ఉన్నాయి.