న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చేట్లుగా ఉంది. అప్పటి యూపీయే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు, రక్షణ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు సుమారు రూ.544 కోట్ల(70 మిలియన్ యూరోల) ముడుపులు ముట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఒప్పంద విలువ రూ.3,600 కోట్లలో ఈ మొత్తం సుమారు 12 శాతమని తెలిపింది. ఈ వివరాలతో శుక్రవారం ఢిల్లీ కోర్టులో నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది.
మధ్యవర్తి, బ్రిటిష్ జాతీయుడైన క్రిస్టియన్ మిషెల్‌పై ఈ చార్జిషీటును వేసింది. ఇందులో ‘మిసెస్ గాంధీ’ అని పరోక్షంగా యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీని ప్రస్తావించినా ఆమెను నిందితురాలిగా చేర్చలేదని విశ్వసనీయ సమాచారం. ఈడీ ఆరోపణల్ని కోర్టు శనివారం పరిశీలించి, నిందితులు తమ ముందు హాజరుకావాలో? వద్దో? నిర్ణయించనుంది. మరోవైపు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు విచారణ సందర్భంగా తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని మిషెల్ కోర్టుకు చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈడీ చార్జిషీటు పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది.
చార్జిషీట్ ఎన్నికల స్టంట్: కాంగ్రెస్
ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఓటమి భయం పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ ద్వారా కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇలాంటి పరోక్ష ఆరోపణలు, అబద్ధాల్ని గతంలో కూడా ప్రచారం చేశారని, కానీ అవి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలవలేకపోయాయని అన్నారు. మోదీ, ఈడీలు ఎన్డీయే ప్రభుత్వ తలరాతను మార్చలేరని, ప్రజలు వారిని ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు.
రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే చార్జిషీటులో ఎంపికచేసిన అంశాల్ని బయటకు పొక్కేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల సీజన్‌లో నిరాధార హాస్యాస్పద ఆరోపణలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యమే గెలుస్తుందని తనపై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఒక దొంగకు అందరూ దొంగలుగానే కనిపిస్తారని పరోక్షంగా మోదీని విమర్శించారు.
ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేశారు..
అగస్టా వెస్ట్‌ల్యాండ్ కొనుగోలు ఒప్పందాన్ని విజయవంతంగా కుదిర్చినందుకు మధ్యవర్తులు మిషెల్, గైడో హష్కే ద్వారా రూ.544 కోట్లు చేతులు మారినట్లు ఈడీ తన చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేసినందుకు వేర్వేరు దశల్లో నిందితులకు ఈ మొత్తం ముట్టినట్లు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఏపీ(అహ్మద్ పటేల్), ఫ్యామ్(కుటుంబం) పేర్లను చార్జిషీటులో ప్రస్తావించింది. 2008 ఫిబ్రవరి, 2009 అక్టోబర్ మిషెల్ పలుమార్లు లేఖలు రాశారని చార్జిషీటులో ఈడీ ప్రస్తావించించింది.
మిసెస్ గాంధీ, ఆమెకు అత్యంత సన్నిహితులైన సలహాదారులను ఒప్పించే బాధ్యతను భారత హైకమిషన్‌కు అప్పగించినట్లు ఈడీ తెలిపింది. మిసెస్ గాంధీ సన్నిహితులుగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఎంకే నారాయణన్, వినయ్ సింగ్‌లను పేర్కొన్నా వారిని నిందితులుగా చేర్చలేదు. అయితే, మిసెస్ గాంధీ ఎవరు? ఏ సందర్భంలో ఆమె పేరును లేవనెత్తారో పూర్తి వివరాలు తెలియరాలేదు. నింది తుల జాబితాలో ముగ్గురు భారత పాత్రికేయులు ఉన్నా వారి పేర్లు బహిర్గతం కాలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా మీడియా ప్రముఖులతో పరిచయం పెంచుకున్నట్లు మిషెల్ అంగీకరించినట్లు ఈడీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment