chargesheets filed
-
డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విచారించవచ్చు
న్యూఢిల్లీ: డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలయ్యే పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టతనిచ్చింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు అధికారులు గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ కోరుతూ నిందితులు దాఖలు చేసే పిటిషన్లను హైకోర్టులు, ట్రయల్ కోర్టులు విచారించవచ్చంది. 60 నుంచి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితులు ఢిపాల్ట్ బెయిల్‌కు అర్హులు. విచారణ పూర్తవకుండానే అసంపూర్తి చార్జిషీట్‌ను దాఖలు చేసినా డిఫాల్ట్ బెయిల్ పొందవచ్చని రీతూ ఛాబ్రియా కేసులో జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 26న తీర్పు వెలువరించింది. కేవలం నిందితులకు డిఫాల్ట్ రావొద్దన్న కారణంతో చార్జిషీల్ దాఖలు చేయొద్దని సూచించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తీర్పును ఉపసంహరించుకోవాలని కోరింది. ఈడీ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కింది కోర్టులు రీతూ ఛాబ్రియా కేసు తీర్పుపై ఆధారపడాల్సిన అవసరం లేదని, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. కేంద్రంపై సుప్రీంకు ఆప్ ఢిల్లీ ప్రభుత్వాధికారులపై పాలనపరమైన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఈ విషయమై కేంద్రానికి, ఆప్ సర్కారుకు మధ్య గొడవలు సద్దుమణగడం లేదు. ప్రభుత్వ సేవల శాఖ కార్యదర్శి ఆశిష్ మోరే బదిలీని కేంద్రం అడ్డుకుంటోందని కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణకు వచ్చే వారం ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ పేర్కొన్నారు. ‘అదానీ’ విచారణకు 3 నెలలు? అదానీ గ్రూప్ అవకతవకల ఆరోపణలపై విచారణకు సెబీకి మరో మూడు నెలలు గడువివ్వాలని యోచిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. విచారణలో సెబీ వైఫల్యముందన్న వాదనలను తిరస్కరించింది. సెబీ నివేదికను తమ నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక దానిపై తేలుస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ స్టోరీపై నిషేధం ఎందుకు ? ది కేరళ స్టోరీ సినిమాను ఎందుకు నిషేధించారో చెప్పాలంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సీజేఐ ధర్మాసనం నోటీసులిచ్చింది. ‘‘ఇతర రాష్ట్రాలు ఏ సమస్యా లేకుండా సినిమాను ప్రదర్శిస్తున్నాయిగా! దానివల్ల ఏమీ జరగలేదు. మరి మీరెందుకు నిలిపివేశారు? సినిమా నచ్చకపోతే ప్రజలే తిరస్కరిస్తారు’’ అని వ్యాఖ్యానించింది. -
మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రేప్ అండ్ కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలైంది. మొత్తం ఆరు వందల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. ఛార్జ్‌షీట్‌లో అన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు నెలలపాటు జైల్లోనే ఉన్న నాగేశ్వరరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక పోలీస్ విభాగం ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని పేర్కొంటూ.. నాగేశ్వరరావును హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. సర్వీసు నుంచి తొలగించారు. ఛార్జ్‌షీట్‌లో సీసీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, యాక్సిడెంట్ వివరాలు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్మెంట్.. ఇలా మొత్తం వివరాలను నమోదు చేశారు. నాగేశ్వరరావుకు శిక్ష పడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించింది పోలీస్ శాఖ. -
దాష్టీకం తర్వాత ఆమెను చంపేయాలనుకున్నారట!
Kasturba Nagar Gang-Rape Charge Sheet Details: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కస్తూర్బానగర్ సామూహిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై బూట్ల దండతో ఆమెను ఊరేగించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో ప్రకంపనలు పుట్టించాయి ఈ జనవరిలో. ఈ కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. బాధితురాలిని చంపేయాలన్న ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన దేశ రాజధానిలో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు 20 ఏళ్ల బాధితురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లి, ఓ గదిలో బంధించి ఆడవాళ్ల సమక్షంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఊరేగించారు. జుట్టు కత్తిరించి, ముఖానికి మసి పూసి కస్తూర్బా వీధుల వెంట ఆమె మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి కొట్టుకుంటూ నడిపించారు. పోలీసుల ఎంట్రీతో.. వాళ్లంతా ఆమెను వదిలేసి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరగ్గా.. ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్రతీకారంగానే.. బాధితురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. బాధితురాలు, నిందితుల కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు స్నేహితులు. అయితే.. కిందటి ఏడాది నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు ఆమే కారణమని ఆరోపించింది కుర్రాడి కుటుంబం. ఆమె వల్లే తప్పతాగి.. రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ కుటుంబం అంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో.. ప్రతీకారంతో ఈ హేయనీయమైన చేష్టలకు పాల్పడింది. ఛార్జ్‌షీట్ వివరాలు.. మొత్తం 762 పేజీల ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది ఈ కేసులో. ఈ ఘాతుకం తర్వాత ఆమెను చంపేయాలన్న ఉద్దేశంతో నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 21 మంది పేర్లను ఛార్జీ షీట్లో పొందుపర్చగా.. 12 మంది మహిళలు, నలుగురు మగవాళ్లు, ఐదుగురు మైనర్ల పేర్లను చేర్చారు. నేరపూరిత కుట్ర, సామూహిక అత్యాచారం, హత్య చేయాలనే ప్రయత్నం, దోపిడీ, కిడ్నాప్ తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. తన ఆటోలో ఆమెను కిడ్నాప్ చేయడానికి సహకరించిన డ్రైవర్ దర్శన్ సింగ్ పేరును సైతం పోలీసులు చేర్చారు. సాక్షులుగా ప్రజలతో పాటు పోలీసుల పేర్లను, డాక్టర్లను సైతం చేర్చారు. మొత్తం 26 వీడియోలు, 12 సోషల్ మీడియా నుంచి.. 14 వీడియోలను నిందితుల మొబైళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. యాభై మంది పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగం అయ్యారు. మరోవైపు బాధితురాలి సోదరికి సైతం ఆ కుటుంబం నుంచి లైంగిక వేధింపులు ఎదురుకాగా.. ఆమె ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. 10 లక్షల సాయం.. ఇదిలా ఉండగా.. బాధితురాలిగా ఆర్థిక సాయంగా పది లక్షల రూపాయలు ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఆమె తరపున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వమే ఓ లాయర్ని నియమిస్తుందని మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. -
దళిత బాలిక దుస్తులపై వీర్యం ఆనవాళ్లు లేవు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు అదనపు సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నలుగురు నిందితుల దుస్తులపై, బాధితురాలి దుస్తులపై వీర్యం ఆనవాళ్లేవీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టెస్టులో బయటపడలేదని పేర్కొన్నారు. అలాగే నిందితుల దుస్తులపై, ఘటనా స్థలంలో వారి గదిలో లభించిన బెడ్‌షీట్‌పై బాలిక రక్తం మరకలు లేవని తేలినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ట్యాబ్ టెస్టు నివేదికను చార్జీషీట్తో జతచేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్మశానంలో నీళ్ల కోసం వెళ్లిన బాలికపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి, హతమార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో శ్మశానంలోని గుడి పుజారి రాధేశ్యామ్(55), శ్మశానం సిబ్బంది కుల్దీప్సింగ్, సలీం అహ్మద్, లక్ష్మీనారాయణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వారిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే బాలిక మృతదేహాన్ని దహనం చేశారని తల్లి ఆరోపించారు. చదవండి: పెళ్లికి ముందే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు -
జలాంతర్గాముల సమాచారం లీకేజీ కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: జలాంతర్గాములకు సంబంధించిన రెండు వేర్వేరు ప్రాజెక్టుల్లో కీలకమైన సమాచారం లీకైన కేసులో సీబీఐ మంగళవారం రెండు చార్జిషీటుల్ని దాఖలు చేసింది. ఒక కేసులో ఇద్దరు నేవీ కమాండర్లపై అభియోగాలు నమోదు చేయగా, రెండో చార్జిషీటులో మరో నలుగురిపై అభియోగాల్ని మోపింది. రక్షణ రంగంలో అవినీతికి సంబంధించిన కేసుల్లో వాయువేగంతో సీబీఐ చార్జిషీటు నమోదు చేయడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ 3న తొలి అరెస్ట్ చేసిన సీబీఐ 60 రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసింది. ఒక కేసులో నేవీ కమాండర్లు రణదీప్ సింగ్, ఎస్జే సింగ్‌లు ఉంటే మరో కేసులో హైదరాబాద్‌కు చెందిన అలెన్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.పి. శాస్త్రి, డైరెక్టర్లు ఎన్బి రావు, కె.చంద్రశేఖర్‌లు నిందితులుగా ఉన్నారు. -
మళ్లీ తెరపైకి సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నాలుగేళ్ల తర్వాత సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. 2017 జులై 2న ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. 30 మందిని అరెస్ట్ చేయడంతో పాటు, మరో 27 మందిని అధికారులు విచారించారు. 60 మంది అధికారులు విచారణ చేశారని ఛార్జ్‌షీట్‌లో అధికారులు పేర్కొన్నారు. 12 కేసుల్లో తొలుత 8 కేసులు మాత్రమే సిట్.. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది. 11 మంది ప్రముఖులతో పాటు రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా సిట్ విచారించింది. డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్‌చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కోరెగావ్ కేసులో స్టాన్ స్వామి అరెస్ట్
ముంబై: భీమా కోరెగావ్ హింసకు సంబంధిం చి మానవ హక్కుల నేతలు గౌతమ్ నవ్లఖా, 82 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి సహా 8 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వారు కుట్ర పన్నినట్లు అందులో ఆరోపించింది. ఇందులో మావోయిస్టులతో పాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందని పేర్కొంది. ఫాదర్ స్టాన్ స్వామి సహా ఆ 8 మంది సమాజంలో శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తున్నారని 10 వేల పేజీల చార్జిషీట్లో ఎన్ఐఏ వెల్లడించింది. గౌతమ్ నవ్ల ఖాకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయంది. వీరంతా వ్యవస్థీకృత మావోయిస్టు నెట్‌వర్క్‌లో భాగమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మావోలకు చేరవేసేవారని తమ దర్యాప్తులో తేలిం దని స్పష్టం చేసింది. స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఫాదర్ స్టాన్ స్వామిని రాంచీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చింది. శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీ షియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఎక్కువ వయస్సున్న వ్యక్తి 82 ఏళ్ల స్టాన్ స్వామినేనని అధికారులు తెలిపారు. మిలింద్ తెల్తుంబ్డే మినహా చార్జిషీట్లో పేర్కొన్న వారందరూ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్ దాఖలుచేయడం ఇది మూడోసారి. తొలిసారిగా పుణె పోలీసులు 2018 డిసెంబర్లో, రెండోసారి 2019ఫిబ్రవరిలో చార్జ్షీట్లు వేశారు. తర్వాత కేంద్రప్రభుత్వం ఈ కేసును ఈ ఏడాది జనవరిలో పుణే పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీచేసింది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్ పరిషత్ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్ఐఏ పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించా రని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్ స్టాన్ స్వామి మావో కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్ స్వామి ఖండించారు. -
మానస కేసులో చార్జిషీట్ దాఖలు
వరంగల్ క్రైం: అత్యాచారం, హత్యకు గురైన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన గాదం మానస కేసులో సుబేదారి పోలీసులు గురువారం కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మం డలం నెమలిగొండకు చెందిన పులి సాయిగౌడ్.. నవంబర్ 27న మానసను ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం, ఆపై హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు 24 గంటల్లో నిందితున్ని అరెస్టు చేశారు. అనంతరం వారం పాటు పోలీసు కస్టడీకి తీసుకుని శాస్త్రీయంగా వివరాలను సేకరించారు. మృతు రాలి దుస్తులపై ఉన్న రక్తం, వీర్యం మరకలతో పాటు, పోస్టుమార్టం నివేదిక, డీఎన్ఏ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అన్నీ నిందితుడు సాయిగౌడ్ ఆధారాలతో సరిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మానసపై అత్యాచారం, హత్యకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని సేకరించామని సుబేదారి ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్ తెలిపారు. నేరం జరిగిన 30 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, నిందితుడికి శిక్ష పడేందుకు అవసరమైన ప్రతి విషయాన్ని సేకరించామని పేర్కొన్నారు. -
కంపెనీ డైరెక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన నీరవ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు దాదాపు రూ.13వేలకోట్లు ఎగ్గొట్టి పరారైన వజ్రాలవ్యాపారి నీరవ్ మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం చార్జిషీట్ దాఖలు చేసింది. తన సంస్థలోని ఒక డమ్మీ డైరెక్టర్‌ను నీరవ్ బెదిరించారని మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈజిప్టులోని కైరో నుంచి ఇండియాకు తిరిగొస్తే చంపేస్తానని డైరెక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్ భాయ్ లాడ్‌ను నీరవ్ బెదిరించాడని తెలిపింది. బ్యాంకు స్కామ్ కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి లాడ్ దుబాయ్ నుంచి కైరోకు పారిపోయాడు. తర్వాత 2018లో భారత్‌కి తిరిగి రావాలని అనుకున్నప్పుడు నీరవ్ తరఫున నేహాల్ మోదీ బెదిరించాడని వెల్లడించింది. యూరప్ కోర్టులో జడ్జి ముందు నీరవ్‌కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని, దీనికి లాడ్‌కు నేహాల్ రూ.20 లక్షలు ఇవ్వజూపారని, అయితే దీనిని లాడ్ తిరస్కరించాడని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. -
రూ.544 కోట్ల ముడుపులు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెచ్చేట్లుగా ఉంది. అప్పటి యూపీయే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న నాయకులు, రక్షణ శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులకు సుమారు రూ.544 కోట్ల(70 మిలియన్ యూరోల) ముడుపులు ముట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపించింది. ఒప్పంద విలువ రూ.3,600 కోట్లలో ఈ మొత్తం సుమారు 12 శాతమని తెలిపింది. ఈ వివరాలతో శుక్రవారం ఢిల్లీ కోర్టులో నాలుగో అనుబంధ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. మధ్యవర్తి, బ్రిటిష్ జాతీయుడైన క్రిస్టియన్ మిషెల్‌పై ఈ చార్జిషీటును వేసింది. ఇందులో ‘మిసెస్ గాంధీ’ అని పరోక్షంగా యూపీయే చైర్పర్సన్ సోనియా గాంధీని ప్రస్తావించినా ఆమెను నిందితురాలిగా చేర్చలేదని విశ్వసనీయ సమాచారం. ఈడీ ఆరోపణల్ని కోర్టు శనివారం పరిశీలించి, నిందితులు తమ ముందు హాజరుకావాలో? వద్దో? నిర్ణయించనుంది. మరోవైపు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసు విచారణ సందర్భంగా తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని మిషెల్ కోర్టుకు చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పరాభవం తప్పదని, ఆ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈడీ చార్జిషీటు పేరిట చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. చార్జిషీట్ ఎన్నికల స్టంట్: కాంగ్రెస్ ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటు ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఓటమి భయం పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ ద్వారా కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇలాంటి పరోక్ష ఆరోపణలు, అబద్ధాల్ని గతంలో కూడా ప్రచారం చేశారని, కానీ అవి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలవలేకపోయాయని అన్నారు. మోదీ, ఈడీలు ఎన్డీయే ప్రభుత్వ తలరాతను మార్చలేరని, ప్రజలు వారిని ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే చార్జిషీటులో ఎంపికచేసిన అంశాల్ని బయటకు పొక్కేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల సీజన్లో నిరాధార హాస్యాస్పద ఆరోపణలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ అన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సత్యమే గెలుస్తుందని తనపై వచ్చిన ఆరోపణల్ని ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఒక దొంగకు అందరూ దొంగలుగానే కనిపిస్తారని పరోక్షంగా మోదీని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేశారు.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కొనుగోలు ఒప్పందాన్ని విజయవంతంగా కుదిర్చినందుకు మధ్యవర్తులు మిషెల్, గైడో హష్కే ద్వారా రూ.544 కోట్లు చేతులు మారినట్లు ఈడీ తన చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేసినందుకు వేర్వేరు దశల్లో నిందితులకు ఈ మొత్తం ముట్టినట్లు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఏపీ(అహ్మద్ పటేల్), ఫ్యామ్(కుటుంబం) పేర్లను చార్జిషీటులో ప్రస్తావించింది. 2008 ఫిబ్రవరి, 2009 అక్టోబర్ మిషెల్ పలుమార్లు లేఖలు రాశారని చార్జిషీటులో ఈడీ ప్రస్తావించించింది. మిసెస్ గాంధీ, ఆమెకు అత్యంత సన్నిహితులైన సలహాదారులను ఒప్పించే బాధ్యతను భారత హైకమిషన్‌కు అప్పగించినట్లు ఈడీ తెలిపింది. మిసెస్ గాంధీ సన్నిహితులుగా అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఎంకే నారాయణన్, వినయ్ సింగ్‌లను పేర్కొన్నా వారిని నిందితులుగా చేర్చలేదు. అయితే, మిసెస్ గాంధీ ఎవరు? ఏ సందర్భంలో ఆమె పేరును లేవనెత్తారో పూర్తి వివరాలు తెలియరాలేదు. నింది తుల జాబితాలో ముగ్గురు భారత పాత్రికేయులు ఉన్నా వారి పేర్లు బహిర్గతం కాలేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా మీడియా ప్రముఖులతో పరిచయం పెంచుకున్నట్లు మిషెల్ అంగీకరించినట్లు ఈడీ పేర్కొంది. -
అగస్టా కేసులో ఈడీ మరో చార్జిషీటు
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్, తదితరులు రూ.300 కోట్ల మేర లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొంది. 3వేల పేజీల రెండో చార్జిషీటును గురువారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఈ చార్జిషీటులో మిషెల్ వ్యాపార భాగస్వామి డేవిడ్ సిమ్స్‌నూ చేర్చింది. వీరిద్దరూ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్ ఎఫ్జెడ్ఈ అనే సంస్థలు నడుపుతున్నారు. భారత ప్రభుత్వం, ఇటలీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ అగస్టావెస్ట్‌ల్యాండ్‌తో 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తులుగా మిషెల్, సిమ్స్ తదితరులు ఈ సొమ్మును పొందారని ఈడీ పేర్కొంది. ఆ రూ.300 కోట్ల సొమ్ము అగస్టా సంస్థే గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్, గ్లోబల్ సర్వీసెస్‌లకు చెల్లించిందని ఆరోపించింది. ఈడీ తాజా చార్జిషీటును పరిగణనలోకి తీసుకోవాలో వద్దో ఈ నెల 6వ తేదీన ప్రకటిస్తానని స్పెషల్ జడ్జి తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసుకు సంబంధించి మిషెల్, ఇతర మధ్యవర్తులు రూ.225 కోట్ల మేర లబ్ధి పొందారని 2016లో న్యాయస్థానానికి సమర్పించిన మొదటి చార్జిషీటులో ఈడీ పేర్కొంది. -
అనుమతుల్లేకుండా చార్జిషీటా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఆమోదం లేకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేయడంపై ఢిల్లీ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ‘ఆమోదం లేకుండా ఎలా మీరు చార్జిషీట్ దాఖలు చేశారు. మీకు న్యాయ సలహాలు ఇచ్చే శాఖ లేదా’ అని పోలీసులను ప్రశ్నించింది. దీనిపై పోలీసులు సమాధానమిస్తూ.. మరో 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఫిబ్రవరి 6వ తేదీ వరకు పోలీసులకు గడువు ఇచ్చారు. కన్హయ్య కుమార్ 2016 ఫిబ్రవరిలో జేఎన్‌యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు జనవరి 14న చార్జిషీట్ దాఖలు చేశారు. -
చిదంబరంపై ఈడీ చార్జిషీటు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎయిర్‌సెల్–మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలు చేసింది. అనుమతులు ఇచ్చే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యారని అందులో ఈడీ ఆరోపించింది. చిదంబరం కుమారుడు కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరన్ పేరును కూడా స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఎదుట సమర్పించిన ఆ చార్జిషీటులో ప్రస్తావించింది. అయితే సీబీఐ, ఈడీ ఆరోపణలను చిదంబరం, ఆయన కుమారుడు ఖండించారు. ఈ చార్జిషీటులో ఎయిర్‌సెల్ మాజీ సీఈవో వి.శ్రీనివాసన్, మాక్సిస్‌కు చెందిన ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్, ఆస్ట్రో ఆల్ ఏసియా నెట్వర్క్స్ మలేసియా, ఎయిర్‌సెల్ టెలీవెంచర్స్ లిమిటెడ్, మాక్సిస్ మొబైల్ సర్వీసెస్, బుమీ అర్మడా బెర్హాద్ పేర్లను కూడా పొందుపరిచారు. నవంబర్ 26న ఈ చార్జిషీటు విచారణకు రానుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇచ్చిన అనుమతులను 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారంలో రూ.1.6 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఎయిర్‌సెల్ మాక్సిస్ కేసు : చిదంబరంపై చార్జిషీటు
సాక్షి, ముంబై: రూ. 3,500 కోట్ల ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసింది. అంతేకాదు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన్ను ఎ1 నిందితుడిగా చార్జిషీట్ లో పేర్కొంది. చిదంబరంతోపాటు, ఆయర కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్ భాస్కరన్ (కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్) వి. శ్రీనివాసన్ (ఎయిర్‌సెల్ మాజీ సీఈఓ), నాలుగు మాక్సిస్ కంపెనీలు సహా 9 మందిని నిందితులుగా ఈ సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఈ కేసు ఢిల్లీ కోర్టు విచారణకు రానుంది. నవంబర్ 26న ఈ చార్జిషీటును విచారణకు స్వీకరించనున్నట్లు సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి ఓపీ సైనీ చెప్పారు. అయితే ఈ కేసులోనవంబరు 29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీని అరెస్ట్ చేయకూడదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి అక్టోబర్ 25 వరకే ఉన్నా.. ఇవాళ మరోసారి దానిని పొడిగించింది. సీబీఐ, ఈడీ తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. -
మాజీ సీఎంపై సీబీఐ ఛార్జ్‌షీట్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాపై సోమవారం సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కశ్మీర్లో క్రికెట్ స్టేడియంలు, అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ కొరకు బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా (బీసీసీఐ) నుంచి 38 కోట్లు నిధులు తీసుకుని దుర్వినియోగపరిచారని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఫరూక్‌తో పాటు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోషియేషన్ (జేకేసీఎ) మాజీ చైర్మన్ మహ్మద్ అస్లాం గోని, జేకేసీఏ సెక్రటరీ సలీమ్ ఖాన్, కశ్మీర్ బ్యాంక్ చైర్మన్ బషీర్ అహ్మద్‌ల పేర్లు కూడా సీబీఐ ఛార్జ్‌షీట్ పెర్కొంది. 2015 నుంచి హైకోర్టు ఆదేశాల మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, ఫరూక్ అబ్దుల్లాను విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు పంపినట్లు సీబీఐ అధికారి ఎస్ఎస్ కిషోర్ తెలిపారు. జేకేసీఏ మాజీ చైర్మన్ అస్లాం గోని నిధుల అవకతవకలపై ఫిర్యాదు చేయడం విశేయం. కశ్మీర్లో క్రికెట్ స్టేడియంల నిర్మాణం కోసం తీసుకున్న నిధులను బ్యాలెన్స్ షీట్లో పెందుపరచలేదని, 50 కోట్లతో స్డేడియం, 27 వేలతో మౌలికవసతులు కల్పించామని తెలిపారు. ఫరూక్‌కు అతి సన్నిహితుడైన గోని అతనితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చెరారు. నిధుల దుర్వినియోగంపై సీబీఐతో విచారణ జరిపించడం జేకేసీఐ చైర్మన్‌గా తన నైతిక బాధ్యతని పేర్కొన్నారు. ప్రస్తుతం కుటంబంతో బ్రిటన్‌లో గడుపుతున్న ఫరూక్ దేశం తిరిగి రాగానే విచారణకు హాజకుకావల్సిందని సీబీఐ ఆదేశించింది. -
ఉన్నావ్ కేసు : బీజేపీ ఎమ్మెల్యేపై చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ లైంగిక దాడి కేసులో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌పై సీబీఐ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడైన కుల్దీప్ సెంగార్ ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు. గతంలో బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే సోదరుడుతో పాటు మరో నలుగురిపై సీబీఐ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సెంగార్ సోదరుడు జై దీప్ సింగ్, ఆయన అనుచరులు వినీత్ మిశ్రా, వీరేంద్ర సింగ్, రామ్ శరణ్ సింగ్ అలియాస్ సోను సింగ్, శశి ప్రతాప్ సింగ్ అలియాస్ సుమన్ సింగ్‌లపై చార్జిషీట్ నమోదైంది. వీరంతా ఉన్నావ్ జిల్లాలోని మాఖి గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు. కాగా నిందితులపై హత్య, సంబంధిత నేరాభియోగాలు నమోదు చేశామని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఉన్నావ్ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
శశిథరూర్‌పై చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై చార్జిషీట్ నమోదైంది. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు థరూర్ ప్రేరేపించారని అందులో ఆరోపించారు. ఈ మేరకు 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని చార్జ్‌షీట్‌లో కోర్టుకు తెలిపారు. కేసులో థరూర్‌ను ఏకైక నిందితుడిగా పేర్కొంటూ.. అతనిపై చట్టపరంగా ముందుకెళ్లేందుకు తగిన ఆధారాలున్నాయన్నారు. తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్న శశి థరూర్‌కు సమన్లు జారీచేయాలని కోర్టును పోలీసులు కోరారు. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ముందు దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌పై మే 24న విచారణ జరగనుంది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునంద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐపీసీ 498 ఏ(గృహ హింస), 306(ఆత్మహత్యకు పురికొల్పడం)సెక్షన్ల కింద శశిథరూర్‌పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ అర్థరహితమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని శశిథరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. -
చిదంబరం కుటుంబంపై ఐటీ చార్జిషీటు
చెన్నై: విదేశాల్లోని ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళిని, కొడుకు కార్తీ, కోడలు శ్రీనిధిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చార్జిషీట్లు దాఖలు చేసింది. చెన్నైలోని ప్రత్యేక కోర్టు ముందు ఈ చార్జిషీట్లను దాఖలు చేసింది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న రూ.5.37 కోట్ల విలువైన ఆస్తి, రూ.80 లక్షల విలువైన మరో ఆస్తి, అమెరికాలోని రూ.3.28 కోట్ల విలువైన ఆస్తి వివరాలను నళిని, కార్తీ, శ్రీనిధి వెల్లడించలేదని ఐటీ శాఖ పేర్కొంది. కార్తీ సహ యజమానిగా ఉన్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ, చిదంబరం కుటుంబం ఈ వివరాల్ని దాచడం నల్లధన నిరోధక చట్టాన్ని అతిక్రమించినట్లేనని తెలిపింది. ఈ కేసులో కార్తీకి, ఆయన కుటుంబానికి గతంలో నోటీసులు జారీచేసింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో కార్తీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. కాగా, ఈ కేసులో విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని, అందుకే కోర్టు ముందు చార్జిషీటు దాఖలు చేసినట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. నల్లధన చట్టం ప్రకారం వెల్లడించని విదేశీ ఆస్తులపై 120 శాతం పన్ను విధించడమే కాకుండా దాదాపు పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
కొత్త ఠాణాలకు ఎఫ్ఐఆర్ అధికారం
న్యాయశాఖ ఆమోదంతో మార్గం సుగమం ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాటే ఏర్పాటైన 92 నూతన పోలీసు స్టేషన్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఎట్టకేలకు లభించనుంది. ఈ అంశంపై పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలకు న్యాయశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సబ్ ఇన్స్పెక్టర్లు కొత్తగా ఏర్పడిన పోలీస్స్టేషన్ల పేరిటే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటివరకు పాత ఠాణాల్లోనే... గతేడాది దసరాకు కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటై నప్పటికీ వాటి పరిధిలో జరిగిన నేరాలకు సంబం ధించిన కేసులను ఇప్పటివరకు పాత పోలీసు స్టేషన్ల పేరిటే రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. దీని వల్ల కొత్త, పాత పోలీసు స్టేషన్ల మధ్య పరిధి వివాదంతోపాటు న్యాయపరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో హోంశాఖ ఎఫ్ఐ ఆర్ నమోదు ఉత్తర్వులను అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు పంపించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పాత కేసులు బదిలీ అవుతాయా? పాత పోలీసు స్టేషన్ల పేరుతో మూడున్నర నెలలుగా నమోదవుతున్న కేసులను కొత్త పోలీసు స్టేషన్ల పేరిట బదిలీ చేసుకోవాలా లేదా అవే పోలీసు స్టేషన్ల పరిధితో చార్జిషీట్లు దాఖలు చేయాలా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లోని కోర్టుల పరిధిలోకి కేసులను బదిలీ చేసుకుంటే సరిపోతుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. -
నయీమ్ కేసులో మరిన్ని చార్జిషీట్లు!
కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు మిర్యాలగూడ, భువనగిరి కోర్టులో మూడు చార్జిషీట్లు దాఖలుచేసిన సిట్ అధికారులు, మిగతా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మొత్తం 16 చార్జిషీట్లు కోర్టుకు చేరినా వాటిలో రెండు చార్జిషీట్లకు మాత్రమే కోర్టు సీసీ నంబర్(చార్జిషీట్ నంబర్) కేటాయించినట్లు సిట్ అధికారులు స్పష్టంచేశారు. త్వరలోనే మిగిలిన 14 చార్జిషీట్లకు కూడా సీసీ నంబర్లు కేటాయిస్తారని తెలిపారు. వారంలో మరో ఆరు చార్జిషీట్లు... వచ్చే గురువారం లోపు మహబూబ్‌నగర్, రాజేంద్రనగర్ కోర్టుల్లో ఆరు కేసులపై చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిట్ వర్గాలు తెలిపాయి. రాజేంద్రనగర్ పరిధిలోని నయీమ్ రెండు ఇళ్లపై జరిగిన సోదాలకు సంబంధించిన చార్జిషీట్‌తో పాటు ఓ మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించిన అంశంపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిసింది. అలాగే షాద్‌నగర్, మహబూబ్‌నగర్ పరిధిలోని రెండు హత్య కేసులు, రెండు భూకబ్జా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ప్రక్రియ పూర్తి చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటివరకు 174 కేసుల్లో 120 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేయగా.. కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. 12 మంది అధికారులకు నోటీసులు... నయీమ్‌తో అంటకాగిన పోలీస్ అధికారు లకు నోటీసులు జారీచేసి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 14 మంది పోలీస్ అధికారులను సిట్ ప్రశ్నించింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సిట్ కార్యాలయం ఏర్పాటుచేసి అక్కడే విచారణ సాగిస్తోంది. ఇందులో భాగంగా వారంలోగా మరో 12 మంది అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. వీరిలో నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు సీఐలు, ఇద్దరు అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నట్లు సమాచారం. ఇప్పట్లో అరెస్టుల్లేవు... ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉందని, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేంత ఆధారాలు లభించలేదని సిట్ వర్గాలు తెలిపాయి. ఆధారాల సేకరణలో తమ బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయని, మరో రెండు లేదా మూడు నెలల పాటు విచారణ సాగే అవకాశం ఉందని, అప్పటివరకు ఆధారాలు లభించిన అన్ని కేసుల్లో చార్జిషీట్ దాఖలుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు.