కోర్టుకు హాజరై వెళ్తున్న చిదంబరం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎయిర్‌సెల్–మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలు చేసింది. అనుమతులు ఇచ్చే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యారని అందులో ఈడీ ఆరోపించింది. చిదంబరం కుమారుడు కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరన్ పేరును కూడా స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఎదుట సమర్పించిన ఆ చార్జిషీటులో ప్రస్తావించింది. అయితే సీబీఐ, ఈడీ ఆరోపణలను చిదంబరం, ఆయన కుమారుడు ఖండించారు.
ఈ చార్జిషీటులో ఎయిర్‌సెల్ మాజీ సీఈవో వి.శ్రీనివాసన్, మాక్సిస్‌కు చెందిన ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్, ఆస్ట్రో ఆల్ ఏసియా నెట్‌వర్క్స్ మలేసియా, ఎయిర్‌సెల్ టెలీవెంచర్స్ లిమిటెడ్, మాక్సిస్ మొబైల్ సర్వీసెస్, బుమీ అర్మడా బెర్హాద్ పేర్లను కూడా పొందుపరిచారు. నవంబర్ 26న ఈ చార్జిషీటు విచారణకు రానుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇచ్చిన అనుమతులను 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారంలో రూ.1.6 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment