న్యూడిల్లీ: ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసులో నిజాలు రాబట్టేందుకు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను కస్టడీలోకి తీసుకుని విచారించడం తప్పనిసరని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీలోని ఓ కోర్టుకు తెలిపింది. కాంగ్రెస్ నేత అయిన చిదంబరం విచారణలో తమకు సహకరించడం లేదనీ, అన్నీ దాటవేత సమాధానాలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ముందస్తు బెయిలు కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది.
అనేక మంది ప్రముఖులతో సంబంధాలు కలిగిన ఆయన అత్యంత శక్తిమంతుడనీ, సాక్షులను ప్రభావితం చేసి, ఆధారాలను నాశనం చేయతగ్గ వ్యక్తి కాబట్టి ముందస్తు బెయిలు ఇవ్వకూడదని ఈడీ వాదించింది. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించకపోతే దర్యాప్తును నిర్దిష్ట సమయంలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని ఈడీ పేర్కొంది. కాగా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ చిదంబరం చేసిన అభ్యర్థనను ఈ ఏడాది మే 30న కోర్టు తొలిసారి మన్నించడం తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు ఈ వెసులుబాటును కోర్టు పొడిగించింది. గత నెల 8న కూడా ఆయనకు నవంబర్ 1 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment