న్యాయశాఖ ఆమోదంతో మార్గం సుగమం
ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాటే ఏర్పాటైన 92 నూతన పోలీసు స్టేషన్లకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అధికారం ఎట్టకేలకు లభించనుంది. ఈ అంశంపై పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలకు న్యాయశాఖ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్లు కొత్తగా ఏర్పడిన పోలీస్‌స్టేషన్ల పేరిటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు అవకాశం లభించనుంది.
ఇప్పటివరకు పాత ఠాణాల్లోనే...
గతేడాది దసరాకు కొత్త పోలీసు స్టేషన్లు ఏర్పాటై నప్పటికీ వాటి పరిధిలో జరిగిన నేరాలకు సంబం ధించిన కేసులను ఇప్పటివరకు పాత పోలీసు స్టేషన్ల పేరిటే రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. దీని వల్ల కొత్త, పాత పోలీసు స్టేషన్ల మధ్య పరిధి వివాదంతోపాటు న్యాయపరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో హోంశాఖ ఎఫ్‌ఐ ఆర్ నమోదు ఉత్తర్వులను అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు పంపించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
పాత కేసులు బదిలీ అవుతాయా?
పాత పోలీసు స్టేషన్ల పేరుతో మూడున్నర నెలలుగా నమోదవుతున్న కేసులను కొత్త పోలీసు స్టేషన్ల పేరిట బదిలీ చేసుకోవాలా లేదా అవే పోలీసు స్టేషన్ల పరిధితో చార్జిషీట్లు దాఖలు చేయాలా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లోని కోర్టుల పరిధిలోకి కేసులను బదిలీ చేసుకుంటే సరిపోతుందన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
కొత్త ఠాణాలకు ఎఫ్‌ఐఆర్ అధికారం
Published Fri, Jan 20 2017 12:18 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement