Kasturba Nagar Gang-Rape Charge Sheet Details: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కస్తూర్బానగర్ సామూహిక అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆపై బూట్ల దండతో ఆమెను ఊరేగించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రకంపనలు పుట్టించాయి ఈ జనవరిలో. ఈ కేసులో పోలీసులు సోమవారం ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. బాధితురాలిని చంపేయాలన్న ఉద్దేశంతోనే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి 26వ తేదీన దేశ రాజధానిలో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు 20 ఏళ్ల బాధితురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లి, ఓ గదిలో బంధించి ఆడవాళ్ల సమక్షంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఊరేగించారు. జుట్టు కత్తిరించి, ముఖానికి మసి పూసి కస్తూర్బా వీధుల వెంట ఆమె మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి కొట్టుకుంటూ నడిపించారు. పోలీసుల ఎంట్రీతో.. వాళ్లంతా ఆమెను వదిలేసి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరగ్గా.. ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది.
ప్రతీకారంగానే..
బాధితురాలిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. బాధితురాలు, నిందితుల కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు స్నేహితులు. అయితే.. కిందటి ఏడాది నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు ఆమే కారణమని ఆరోపించింది కుర్రాడి కుటుంబం. ఆమె వల్లే తప్పతాగి.. రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ కుటుంబం అంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో.. ప్రతీకారంతో ఈ హేయనీయమైన చేష్టలకు పాల్పడింది.
ఛార్జ్‌షీట్ వివరాలు..
మొత్తం 762 పేజీల ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది ఈ కేసులో. ఈ ఘాతుకం తర్వాత ఆమెను చంపేయాలన్న ఉద్దేశంతో నిందితులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 21 మంది పేర్లను ఛార్జీ షీట్‌లో పొందుపర్చగా.. 12 మంది మహిళలు, నలుగురు మగవాళ్లు, ఐదుగురు మైనర్ల పేర్లను చేర్చారు. నేరపూరిత కుట్ర, సామూహిక అత్యాచారం, హత్య చేయాలనే ప్రయత్నం, దోపిడీ, కిడ్నాప్ తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. తన ఆటోలో ఆమెను కిడ్నాప్ చేయడానికి సహకరించిన డ్రైవర్ దర్శన్ సింగ్ పేరును సైతం పోలీసులు చేర్చారు.
సాక్షులుగా ప్రజలతో పాటు పోలీసుల పేర్లను, డాక్టర్లను సైతం చేర్చారు. మొత్తం 26 వీడియోలు, 12 సోషల్ మీడియా నుంచి.. 14 వీడియోలను నిందితుల మొబైళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. యాభై మంది పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగం అయ్యారు. మరోవైపు బాధితురాలి సోదరికి సైతం ఆ కుటుంబం నుంచి లైంగిక వేధింపులు ఎదురుకాగా.. ఆమె ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు.
10 లక్షల సాయం..
ఇదిలా ఉండగా.. బాధితురాలిగా ఆర్థిక సాయంగా పది లక్షల రూపాయలు ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఆమె తరపున వాదనలు వినిపించేందుకు ప్రభుత్వమే ఓ లాయర్‌ని నియమిస్తుందని మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment