ఢిల్లీలో 32 శాతం మంది అద్దె ఇళ్లల్లోనే నివాసం
హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు
ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా చేస్తామంటున్న ‘ఆప్’
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం అద్దె ఇంట్లోనే నివసిస్తోంది. మొత్తం ఓటర్లలో అద్దెదార్ల వాటా తక్కువేమీ కాదు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించిగల స్థాయిలో ఉన్న ఈ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు వల విసురుతున్నాయి.
వారి ఓట్లపై గురిపెడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అద్దెదార్ల ఓట్లు గంపగుత్తగా పడితే ఎన్నికల్లో గెలుపునకు ఢోకా ఉండదని భావిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.
→ ఢిల్లీ నివాసితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నగరంలో 66.6 శాతం మంది సొంత ఇళ్లల్లో నివసిస్తుండగా, 32.4 శాతం మంది కిరాయి ఇళ్లల్లోనే బతుకులీడుస్తున్నారు.
→ అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారిలో 51.9 శాతం మంది న్యూఢిల్లీ జిల్లాలోనే ఉండగా, 41.9 శాతం మంది సౌత్‌ఈస్ట్ జిల్లాలో ఉన్నారు.
→ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 62.7 శాతం మంది, ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో 46.9 శాతం మంది అద్దెదార్లు ఉన్నారు.
→ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ప్రజలు వలస వస్తున్నారు. ప్రధానంగా పూర్వాంచల్‌గా పిలిచే ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ వాసులు దేశ రాజధాని గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొనే పూర్వాంచల్ ప్రజల్లో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తున్నారు.
→ ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ సైతం అద్దెదార్ల ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
→ తాము అధికారంలోకి వస్తే పూర్వాంచల్ ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
→ ఆమ్ ఆద్మీ సర్కారు పాలనలో అద్దెదార్లు నిర్లక్ష్యానికి గురయ్యారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment