tenants problems
-
మిమ్మల్ని ఒత్తిడి చేసే అధికారం వారికి లేదు..!
మేము ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాము. ఓనర్లతో మేం రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఆ అపార్ట్మెంటు నుంచి మమ్మల్ని ఖాళీ చేయించేందుకు వీలు లేదు. కానీ ఓనర్ మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు. అలా ఎలా చేస్తాం అని అగ్రిమెంట్ విషయం గుర్తు చేస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్లి తన పరపతితో మాపై ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వారు కూడా మమ్ములను సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి, సలహా ఇవ్వగలరు. – బి.నారాయణ, హైదరాబాద్సాధారణ ΄పౌరులకసలు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా పోలీసు వారిని సంప్రదించాలి అని అనిపిస్తుంది. అది కుటుంబ సమస్య, భూమి తగాదా, అద్దె ఇల్లు ఖాళీ చేయక΄ోవటం వంటి ఏ సమస్య అయినా ముందుగా పోలీసు వారి దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే మీ సమస్య సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా ఏదైనా నేరం అంటే క్రిమినల్ చట్టం కింద జరిగిందా అని పోలీసువారు చూడాలి. సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలాసార్లు స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ సివిల్ కేసులలో కూడా పోలీసుల తరచు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. సివిల్ కేసులలో పోలీసుల జోక్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో నెల నెలా నమోదవుతున్న వందలాది కేసులే అందుకు నిదర్శనం. సివిల్ కేసులకు క్రిమినల్ రంగు పులిమి కేసులు పెట్టడం కూడా కొత్తేమీ కాదు. అలాంటి కేసులను కోర్టులు తిరస్కరించాయి! పోలీసు వారు సివిల్ కేసులను ‘సెటిల్మెంట్ చేసుకోండి’ అని ఒత్తిడి చేయడానికి వారికి ఎటువంటి అధికారమూ లేదు. అలాగని మీరు పోలీసు వారితో వాగ్వాదానికి దిగవలసిన అవసరం లేదు. మీ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. మీకు పోలీసుల నుంచి అటువంటి ఒత్తిడి వస్తోందని అంటున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం లభించకపోతే హైకోర్టులో కేసు వేయవచ్చు. పూర్వాపరాలు విచారించిన తర్వాత హైకోర్టు మీకు రక్షణ కలిగిస్తుంది. మీకు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి అగ్రిమెంట్‌ను అతిక్రమించేందుకు వీలు లేకుండా రక్షణ పొందవచ్చు.శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది (న్యాయయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు )(చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
గూగుల్ ఇంటర్వ్యూలో నెగ్గాడు.. కానీ అక్కడ మాత్రం!
కోవిడ్-19 తర్వాత మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు సంపాదించడం తలకు మించిన భారంగా మారింది. ఎంతలా అంటే? గూగుల్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించొచ్చు..కానీ బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉందంటూ అద్దెకోసం అన్వేషిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాల గురించి ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాకు ఎక్కిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇంటి యజమానులు పెట్టే సవాలక్ష కండీషన్లకు ఒప్పుకోవాలి. ఇంటర్వ్యూ పేరుతో వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకదు. అలా అద్దె ఇల్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న రీపు సోనారిక భడోరియా (Ripu Daman Bhadoria) తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. భడోరియా గత ఏడాది అమెరికా సియాటెల్ నుంచి బెంగళూరు వచ్చాడు. అక్కడ తన బడ్జెట్ తగ్గట్లు రెంట్‌కు ఉండేందుకు అద్దె ఇల్లు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇంటి ఓనర్స్ రకరకాల ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. అలా ఓనర్ చేసిన తొలి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినట్లు బహదోరియా చెప్పుకొచ్చాడు. అప్పుడే బెంగళూరులో అద్దె ఇల్లును సొంతం చేసుకోవడం కంటే గూగుల్ (google) ఇంటర్వ్యూని క్రాక్ చేయడం చాలా సులభమని భావించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఓ చిన్న చిట్కాతో మరో ఇంటి ఓనర్ చేసిన ఇంటర్వ్యూలో పాస్ అయినట్లు వివరించాడు. బహదోరియా గూగుల్ ఉద్యోగి. తాను గూగుల్ ఉద్యోగినని. సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం వల్లే తనకు అద్దె ఇల్లు దొరికిందని చెప్పాడు. గూగుల్‌లో పనిచేయడం విపత్కర పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని ఎప్పుడూ ఊహించలేదని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో రాశారు. ఆ పోస్ట్‌కు స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. విసుగు తెప్పించడంలో బెంగళూరులో ఇంటి ఓనర్స్ అద్దె ఇంటి కోసం వెతికే వారికి తెగ విసుగు తెప్పిస్తుంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ నెటిజన్ . 2016 లో అనుకుంటా. మీరు పొట్టి స్కర్టులు ధరిస్తారా? మీ ఇంటికి మగ స్నేహితులు వస్తారా? అని ప్రశ్నించారు. నేను టీసీఎస్‌లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అద్దె ఇల్లు దొరికింది. వేరే కంపెనీలో ఉన్న నా స్నేహితుడికి ఉండేందుకు 2 నెలలు పాటు అద్దె ఇల్లు దొరకలేదు. అప్పటి నుంచి బెంగళూరుకు దూరంగా ఉంటున్నా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి👉 హీరా గోల్డ్ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్ -
Model Tenancy Act: వారు 2 నెలల అద్దె ముందే చెల్లించాలి!
న్యూఢిల్లీ: యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన చట్టం... ‘మోడల్ టెనన్సీ యాక్ట్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక సంస్కరణలతో కూడిన ఈ నమూనా చట్టానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. వివాదాల సత్వర పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యథాతథంగా అమలు చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే తమ వద్ద అమల్లో ఉన్న సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేసి, అమలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఈ కొత్త చట్టం ద్వారా సమూల మార్పులు వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు. ఈ చట్టం రెంటల్ హౌజింగ్‌ను ఒక వ్యాపార మోడల్‌గా నిర్వహించే అవకాశం కల్పిస్తుందని, తద్వారా దేశంలో రెంటల్ హౌజింగ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాల వారికి అందుబాటులో, సమస్యలు లేని విధంగా అద్దె వసతి లభించేలా చట్టం రూపొందిందని వెల్లడించింది. 2011 జనగణన ప్రకారం దేశవ్యాప్తంగా, నగరాలు, పట్టణాల్లో దాదాపు కోటి గృçహాలు ఖాళీగా ఉన్నాయని హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు. కిరాయిదారులు ఖాళీ చేయరేమోనని, లేదా ఆక్రమించుకుంటారేమోనని, లేదా ఖాళీ చేయడానికి ఇబ్బంది పెడ్తారేమోనని భయంతో యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదని గృహ నిర్మాణశాఖకు చెందిన ఒక అధికారి వివరించారు. ఈ తాజా చట్టంలో కిరాయిదారు, యజమానుల పాత్రను, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించినందున ఇకపై వారిలో ఈ భయాందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నామన్నారు. ఈ చట్టం ప్రకారం.. ► నివాస సముదాయాల్లో కిరాయిదారు యజమానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా గరిష్టంగా రెండు నెలల అద్దె ముందే చెల్లించాలి. అదే, వాణిజ్య సముదాయాలైతే ఆరునెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ► అన్ని కొత్త అద్దె ఒప్పందాలు ఇకపై కచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే, వాటిని సంబంధిత జిల్లా ‘రెంట్ అథారిటీ’కి సమర్పించాలి. ► ఇప్పటికే అమల్లో ఉన్న రెంటల్ అగ్రిమెంట్‌పై కొత్త చట్టం ప్రభావం ఉండదు. ► అద్దె, కాలవ్యవధులను పరస్పర అంగీకారంతో కిరాయిదారు, యజమాని నిర్ణయించుకోవాలి. లిఖిత పూర్వక ఒప్పందంలో ఆ విషయాన్ని పొందుపర్చాలి. ► యజమాని, లేదా ప్రాపర్టీ మేనేజర్ కిరాయిదారుల నివాసాలకు నిత్యావసర సదుపాయాలను నిలిపివేయకూడదు. ► అద్దె ఒప్పందం అమలులో ఉన్న సమయంలో కిరాయిదారును ఖాళీ చేయించకూడదు. ఒకవేళ ఒప్పందంలో సంబంధిత నిబంధన ఉంటే ఖాళీ చేయించవచ్చు. ► కిరాయిదారు నష్టపరిచినవి మినహా మిగతా నిర్మాణ మరమ్మతులు, రంగులు వేయించడం, పాడైన ప్లంబింగ్ పైప్‌ల మార్పు, విద్యుత్ వైరింగ్ తదితరాలను యజమానే చేయించాలి. ► డ్రైనేజ్ క్లీనింగ్, విద్యుత్ స్విచ్‌లు, సాకెట్ల మరమ్మతులు, కిచెన్‌లో అవసరమైన రిపేర్లు, మరమ్మతులు, ధ్వంసమైన కిటికీలు, ద్వారాల గ్లాస్ ప్యానెళ్ల మార్పు, గార్డెన్ నిర్వహణ.. మొదలైనవాటిని కిరాయిదారు చేయాల్సి ఉంటుంది. ► కిరాయిదారు ఆక్రమణలో ఉన్న చోట యజ మాని ఏదైనా అదనపు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, దాన్ని కిరాయిదారు వ్యతిరేకిస్తే.. యజమాని జిల్లా రెంట్ కోర్టును ఆశ్రయించాలి. ► యజమాని ముందస్తు అనుమతి లేకుండా, కిరాయిదారు తాను అద్దెకు ఉన్న ప్రాంగణంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. ► ప్రతీ జిల్లాలో రెంట్ ట్రిబ్యునల్‌గా జిల్లా జడ్జిని కానీ, జిల్లా అదనపు జడ్జీని కానీ హైకోర్టు సూ చనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. ► రెంట్ కోర్ట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను కాని, తత్సమాన హోదా ఉన్న అధికారిని కానీ నియమించాలి. ► రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటీ కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని ‘రెంట్ అథారిటీ’గా జిల్లా కలెక్టర్ నియమించాలి. ► యజమానికి, కిరాయిదారుకు మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మొదట రెంట్ అథారిటీని ఆశ్రయించాలి. అక్కడి పరిష్కారంతో సంతృప్తి చెందనట్లయితే, తరువాత రెంట్ కోర్టును, ఆ తరువాత రెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ► కిరాయిదారులను ఖాళీ చేయించే విషయంలో ఇబ్బంది పడే యజమానుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న మేరకు ముందస్తు నోటీసు ఇవ్వడం సహా అన్ని నిబంధనలను పాటిస్తూ ఖాళీ చేయాలని యజమాని కోరినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. అలాగే, ఒప్పందం కాలపరిమితి ముగిసినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. యజమాని నెలవారీ అద్దెను మొదట రెండు నెలల పాటు రెండింతలు, ఆ తరువాత ఖాళీ చేసేంతవరకు నాలుగు రెట్లు చేయవచ్చు. ► కిరాయిదారుకు చెల్లించాల్సిన రీఫండ్‌ను యజమాని సమయానికి ఇవ్వనట్లయితే.. సాధారణ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. -
కౌలుదారులకు ఇక ప్రభుత్వ రాయితీలు
సాక్షి, కడప అగ్రికల్చర్ : కౌలు రైతులకు అన్ని రకాల సాయం అందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు శాసనసభలో గురువారం ఆమోదం పొందింది. ఇక కౌలు రైతుల కష్టాలు తీరినట్లేనని చెప్పవచ్చు. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏడాది నుంచి కౌలు రైతులకు మేలు చేస్తూ.. శాసనసభలో బిల్లుకు శాసన సభ్యులు ఆమోదం తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కౌలుదారుల (గుత్త రైతుల) రక్షణకు చట్టబద్ధమైన భరోసా కల్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ దిశగా ప్రస్తుత చట్టానికి సవరణలు తీసుకొస్తున్నారు. దీంతో పలు ప్రభుత్వ రాయితీలు తమకు దక్కనుండటంతో జిల్లాలోని కౌలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాటి చట్టంలో.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆధీకృత కౌలు రైతుల చట్టం–2011 తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో ఉన్న అనేక లొసుగుల కారణంగా అమలులో ఆశించిన ఫలితాలు సాధ్యం కాలేదు. ప్రధానంగా భూమిని కౌలుకు ఇస్తున్నట్లు యజమానులు రాత పూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించలేదు. యజమాని మౌఖిక అంగీకారంతో రెవెన్యూ గ్రామ సభల ద్వారా కౌలుదారులను గుర్తించి రుణ అర్హత కార్డులు (ఎల్‌ఈసీలు) పంపిణీ చేస్తున్నారు. ఎల్ఈసీ కాలపరిమితి జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది. కౌలుదారులు భూమిపై హక్కును క్లెయిమ్ చేసుకోవడానికి లేదా సమర్పించుకోవడానికి రుణ అర్హత కార్డు సాక్ష్యంగా ఉపయోగించరాదని చట్టంలో పొందుపరిచారు. అలాగే అడంగల్‌లో అనుభవదారునిగా కూడా కౌలుదారు పేరును నమోదు చేయరు. కౌలుదారులకు ఎల్‌ఈసీల ద్వారా ఇచ్చే రుణం కేవలం పంటపై మాత్రమేనని, భూమిపై కాదని ప్రభుత్వం ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొంది. భూ యజమానులకు ఇన్ని రక్షణలు కల్పించినప్పటికీ.. కౌలుదారుల కంటే ముందే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలు పొందుతున్నారు. అందువల్ల కౌలుదారులకు పంట రుణాలు, బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర ప్రభుత్వ రాయితీలు అందకుండా పోయాయి. జిల్లాలో సుమారు లక్ష మంది వరకు కౌలు రైతులు ఉంటారని అనధికార అంచనాలు చెబుతున్నాయి. అయితే ఏనాడూ రెవెన్యూ గ్రామసభల ద్వారా 20 వేలకు మించి కౌలు రైతులను గుర్తించలేదు. కౌలు రైతులకు ఇచ్చిన ఎల్‌ఈసీలు, వారికి అందిన పంట రుణాల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ చట్టం ఎంత అధ్వానంగా అమలు జరుగుతుందో అర్థమవుతుంది. గతేడాది రెన్యువల్, కొత్తగా కలుపుకొని 12 వేల మందికి రుణ అర్హత కార్డులు మంజూరు చేయగా, అందులో 883 మందికి వివిధ బ్యాంకుల ద్వారా రూ.10.17 కోట్ల పంట రుణాలు అందాయి. ఈ ఏడాది జూన్ ఆఖరు వరకు 322 మంది కౌలు రైతులకు రూ.2.93 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. 2011లో ఏపీ ఆధీకృత రైతుల చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులకు పంట రుణాలు అందాయని బ్యాంకర్లే స్పష్టం చేస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ముఖ్యమంత్రి, మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుని కౌలు రైతులకు మేలు చేస్తూ శాసనసభలో బిల్లు ఆమోదం పొందేలా చేశారు. దాన్నే చట్టంగా తీసుకురానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా.. కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 వడ్డీలేని పంట రుణాలు, పంటల బీమా.. కరువు, అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోతే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ వర్తింపు, విపత్తుల సహాయ నిధి, ధరల స్థిరీకరణ నిధి, విత్తనాలు, ఎరువుల సబ్సిడీ తదితరాలు వర్తించేలా, ప్రయోజనాలు ఒనగూరేలా చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు సభలో బిల్లు ఆమోదం పొందేలా చేశారు. దీనిపై చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కౌలు రైతులకు ఎంతో మేలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కౌలు రైతులకు ఎంతో మేలు చేసేదిగా ఉంది. గతంలో ఈ చట్టం ఉన్నా.. కౌలు రైతులకు ఉపయోగపడేది కాదు. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం చాలా బాగుంది. కౌలు రైతులు భూములను గుత్తకు తీసుకుని పంటలు పండించే సమయంలో వర్షా భావం వల్లనో, అకాల వర్షాల వల్లనో పంటలు దెబ్బతింటే ఒక్క రూపాయి వచ్చేది కాదు. ఇప్పుడు చేయబోయే చట్టం వల్ల కౌలు రైతులకు మేలు జరుగుతుంది. – వెంకటరమణ, కౌలు రైతు, సుండుపల్లె మంచి రోజులు వచ్చినట్లే కౌలు రైతులు గత ప్రభుత్వాలలో చాలా ఇబ్బంది పడ్డారు. వ్యవసాయశాఖ అమలు చేసే ఏ పథకం వర్తించేది కాదు. సబ్సిడీలు అమలు చేసే నాథుడే లేడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చర్యలు తీసుకుని కౌలు చట్టం చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా రైతు భరోసా పథకం వర్తిస్తుందని ప్రకటించడం సంతోషంగా ఉంది. – వీరబ్రహ్మం, కౌలురైతు, గోనుమాకులపల్లె, వీఎన్ పల్లె మండలం చట్ట సవరణతో రాయితీలు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన ముసాయిదా బిల్లు చట్ట రూపం దాలిస్తే.. కౌలు రైతులకు 11 నెలలపాటు చెల్లుబాటు అయ్యేలా భూ యజమానులతో సాగు ఒప్పంద పత్రాలు గ్రామ సచివాలయాల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తారు. ఇందువల్ల కౌలు రైతులకు అనేక ప్రభుత్వ రాయితీలు అందనున్నాయి. ఒప్పంద పత్రాలు కలిగిన కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకంలో ఉన్న అన్ని అంశాలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. -
ఇళ్ల కష్టాలు తీర్చేందుకు ఫేస్బుక్ గ్రూప్!
న్యూఢిల్లీ: నీదే కులం, ఏ మతం, ఏ ప్రాంతం, మగా.. ఆడా, పెళ్లయిందా, కాలేదా, భర్త ఉన్నాడా, పోయాడా, పిల్లలున్నారా, లేదా, విజిటేరియనా, నాన్ వెజిటేరియనా.....? ఇలాంటి ప్రశ్నల పరంపరతో ఇళ్ల వేటలో అష్టకష్టాలు అనుభవించిన వారంతా ఇప్పుడు ఫేస్బుక్లో ఏకమయ్యారు. ముంబై నగరంలోని వడాలా ప్రాంతంలో ఇటీవల ముస్లిం మహిళ అయినందున అద్దె ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చిన మిస్బా ఖాద్రికి అండగా నిలిచారు. గురువారం నాటికి దాదాపు వెయ్యిమంది ఫేస్బుక్లో ఓ గ్రూపుగా ఏర్పడి, ఇప్పటికే మైనారిటీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ ముందు పోరాటం చేస్తున్న ఖాద్రీకి మద్దతుగా నిలుస్తున్నారు. నగరం ఏదైనా ఇళ్ల అద్దె, కొనుగోళ్లలో యజమానులు, హౌసింగ్ సొసైటీలు చూపిస్తున్న వివక్షపై న్యాయ పోరాటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వివక్షపూరిత అనుభవాలను ఎదుర్కొన్న వారు దేశంలో కోకొల్లలే ఉన్నారు. వారిలో సామాన్యులు ఉన్నారు. ప్రముఖులూ ఉన్నారు. ముస్లిం అవడం వల్ల తమకు నచ్చిన చోట ఫ్లాట్ కొనుక్కోలేక పోతున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ భార్య, సామాజిక కార్యకర్త, ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ రెండేళ్ల క్రితం వాపోయారు. ఒకప్పుడు వివిధ కులాలు, మతాలు, జాతులతో భిన్నత్వంలో ఏకత్వంగా, దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిన ముంబై మహానగరం ఇప్పుడు కుల, మతాల ప్రాతిపదికన విడిపోతుంది. నగరంలోని గురుగావ్ ప్రాంతంలో మహారాష్ర్ట హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బెండి బజార్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. మాజ్గావ్లో క్రైస్తవులు, మాతుంగ ప్రాంతంలో హిందూ తమిళులు, గుజరాతీ, మలయాళీలు ఎక్కువగా ఉన్నారు. మలబార్ ప్రాంతంలో జైనులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఇల్లు అద్దెకివ్వడం, కొనుగోలు చేయడానికి ఇతరులను అనుమతించడం లేదు. కుల, మత, ప్రాంతాలతో ప్రమేయం లేకుండా ఐక్యంగా ఉన్న నగర ప్రజల మధ్య విభజన రేఖ ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది ? ఎవరు చిచ్చు పెట్టారన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం పెద్ద కష్టం కాదు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992-93 మధ్య జరిగిన మత కల్లోలాలతో ప్రజల మధ్య విభజన, వివక్ష ప్రారంభమైంది. ఇళ్ల వేటలో ఏర్పడుతున్న వివక్షను ఎదుర్కోవడానికి అన్ని న్యాయ మార్గాలను అన్వేషిస్తున్నామని ‘ఫేస్బుక్ గ్రూప్’ చెబుతోంది. అయితే ఇలాంటి వివక్షకు శాశ్వత పరిష్కారం సూచించే అవకాశం 2005లో వచ్చినా సుప్రీం కోర్టు వదిలేసుకొంది. మహారాష్ట్రకు చెందిన ఓ పార్సీ వ్యక్తి తన బంగళాను అమ్మకానికి పెట్టాడు. పార్సీలకు తప్ప ఇతరులకు అమ్మడానికి వీల్లేదని జోరాస్ట్రియన్ హౌసింగ్ సొసైటీ ఆంక్షలు విధించింది. దీనికి వ్యతిరేకంగా సదరు యజమాని సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ఓ ప్రైవేటు సొసైటీ ఇలాంటి ఆంక్షలు విధించుకోవచ్చంటూ అతని కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.