మేము ఒక అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాము. ఓనర్లతో మేం రాసుకున్న అగ్రిమెంటు ప్రకారం ఐదు సంవత్సరాల వరకు ఆ అపార్ట్‌మెంటు నుంచి మమ్మల్ని ఖాళీ చేయించేందుకు వీలు లేదు. కానీ ఓనర్ మమ్మల్ని తక్షణమే ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారు. అలా ఎలా చేస్తాం అని అగ్రిమెంట్ విషయం గుర్తు చేస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్లి తన పరపతితో మాపై ఒత్తిడి చేస్తున్నారు. పోలీసు వారు కూడా మమ్ములను సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు. ఈ పరిస్థితులలో మేము ఏం చేయాలి, సలహా ఇవ్వగలరు.
– బి.నారాయణ, హైదరాబాద్
సాధారణ ΄పౌరులకసలు ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా పోలీసు వారిని సంప్రదించాలి అని అనిపిస్తుంది. అది కుటుంబ సమస్య, భూమి తగాదా, అద్దె ఇల్లు ఖాళీ చేయక΄ోవటం వంటి ఏ సమస్య అయినా ముందుగా పోలీసు వారి దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ ఉంటారు. అందులో తప్పు లేదు. అయితే మీ సమస్య సివిల్ పరిధిలోకి వస్తుందా లేదా ఏదైనా నేరం అంటే క్రిమినల్ చట్టం కింద జరిగిందా అని పోలీసువారు చూడాలి.
సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకునే వీలు లేదు. ఈ విషయాన్ని దిగువ కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చాలాసార్లు స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ సివిల్ కేసులలో కూడా పోలీసుల తరచు జోక్యం చేసుకుంటున్నారు అనేది వాస్తవం. సివిల్ కేసులలో పోలీసుల జోక్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో నెల నెలా నమోదవుతున్న వందలాది కేసులే అందుకు నిదర్శనం. సివిల్ కేసులకు క్రిమినల్ రంగు పులిమి కేసులు పెట్టడం కూడా కొత్తేమీ కాదు. అలాంటి కేసులను కోర్టులు తిరస్కరించాయి! పోలీసు వారు సివిల్ కేసులను ‘సెటిల్మెంట్ చేసుకోండి’ అని ఒత్తిడి చేయడానికి వారికి ఎటువంటి అధికారమూ లేదు.
అలాగని మీరు పోలీసు వారితో వాగ్వాదానికి దిగవలసిన అవసరం లేదు. మీ హక్కులను కాపాడుకోవడానికి చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకోవాలి. మీకు పోలీసుల నుంచి అటువంటి ఒత్తిడి వస్తోందని అంటున్నారు కాబట్టి మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత కూడా మీ సమస్యకు తగిన పరిష్కారం లభించకపోతే హైకోర్టులో కేసు వేయవచ్చు. పూర్వాపరాలు విచారించిన తర్వాత హైకోర్టు మీకు రక్షణ కలిగిస్తుంది. మీకు అగ్రిమెంట్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి అగ్రిమెంట్‌ను అతిక్రమించేందుకు వీలు లేకుండా రక్షణ పొందవచ్చు.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(న్యాయయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు )
Comments
Please login to add a commentAdd a comment