లీగల్ : ఆ కేసు చెల్లకపోవచ్చు!
నేను ఒక వ్యక్తి దగ్గర 2019 జనవరి లో కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. కానీ కోవిడ్ వేవ్ రావడం వల్ల ఉద్యోగం పోయి అనుకున్న సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాను. డబ్బు తీసుకునేటప్పుడు ష్యూరిటీ కింద ప్రామిసరీ నోటు, డేట్ వేయని రెండు చెక్కులు ఇచ్చాను. పోయిన నెలలో ఆ చెక్కులు నాకు చెప్పకుండా బ్యాంకులో వేసి బౌన్స్ చేశారు. చెక్ బౌన్స్ కేసు వేస్తాము అంటూ లీగల్ నోటీస్ కూడా పంపించారు. నేను డబ్బు కట్టేస్తాను అని వారికి తెలియజేయగా, ‘ఇప్పుడు తీసుకున్న దానికి మూడింతలు ఇవ్వాలి, లేకుంటే నీ మీద చీటింగ్ కేసు పెడతాము, జైలుకు వెళతావు’ అని బెదిరిస్తూ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తగిన పరిష్కారం చూపగలరు. – మానవేందర్, విజయవాడ
అవతలి వాళ్లు మీ మీద చీటింగ్ కేసు పెడతామని అనగానే భయపడవలసిన అవసరం లేదు. కోర్టు వాయిదాల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ సరైన న్యాయసలహా పొందితే తప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా వర్ణించి, క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది. చాలా సందర్భాలలో హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం అలాంటి కేసులను కొట్టివేశాయి. మీ కేసులో కూడా సివిల్ కేసును క్రిమినల్ పరిధిలోకి తీసుకు రావడానికి చట్టాన్ని దుర్వినియోగం చేశారు అని రుజువైతే కేసు కొట్టివేస్తారు.
ఇకపోతే... చెక్కు బౌన్స్ కేసులో వచ్చిన నోటీసుకు సరైన గడువులోపు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఆ సమాధానంలోనే చెక్కు మీద రాసినంత నగదు చెల్లిస్తాము అని అంగీకరిస్తూ కూడా మీరు నోటీసుకు రిప్లై ఇవ్వవచ్చు. ఒకవేళ నోటీసులో తప్పులు ఉన్నట్లయితే వాటన్నింటినీ తిరస్కరిస్తూ మీరు ప్రపోజల్ చేయవచ్చు. ఒకవేళ వాళ్లు అప్పటికీ కేసు వేస్తే, కోర్టుకు కూడా మీ వాదనలు తెలియపరుస్తూ, సగటు అప్పు చెల్లిస్తాము అని చెప్తే, కోర్టు మీ అభ్యర్థనను పరిగణించి అందుకు అనుగుణంగా తీర్పు చెబుతుంది. అప్పుడు మీకు జైలు శిక్ష పడకపోవచ్చు. అయితే చెక్ బౌన్స్ కేసులలో నిందారోపితులు డబ్బులు కట్టేస్తాము అన్నంత మాత్రాన నేరం లేకుండా పోదు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే చెప్తుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసును మాత్రం కొంత సీరియస్‌గానే పరిగణించండి.
మీ లాయర్ గారి సలహా మేరకు కేసు నడపాలా లేక రాజీ కుదుర్చుకోవాలా అనే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. మీరు డబ్బులు ఇవ్వాలి అనేది నిజమే అని చెప్తున్నారు కాబట్టి, లాయర్ గారి ద్వారా లేదా కోర్టు అనుమతి ద్వారా కూడా మధ్యవర్తిత్వం చేసి రాజీ కుదుర్చుకోవచ్చు.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం
sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు.
ఇదీ చదవండి: మార్నింగ్ టీ కప్‌తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్!
Comments
Please login to add a commentAdd a comment