పరివర్తన్ నినాదంతో కమలం
పాతికేళ్లుగా అధికారానికి దూరం
ప్రజలకు ‘అవినీతిరహిత’ హామీలు
అభివృద్ధి, పథకాలపైనే ఆప్ ఆశలు
భయపెడుతున్న అవినీతి,ప్రజా వ్యతిరేకత
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు.
ఈసారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆప్ అంటే ఆపద అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53.6 శాతం ఓట్లతో 62 సీట్లు కొల్లగొట్టగా బీజేపీ 39 శాతం ఓట్లతో 8 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండాపోయింది. కేవలం 4.3 శాతం ఓట్లకు పరిమితమైంది. సీట్ల ఖాతాయే తెరవలేక కుదేలైంది.
ద్విముఖమే
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ద్విముఖ పోరు సాగుతోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్ కూడా మొత్తం 70 సీట్లలోనూ బరిలో ఉన్నా దాని పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఈసారి బీజేపీ, ఆప్‌లతోపాటు పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్‌కు అవి కలిసొచ్చేది అనుమానమే.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు బరిలో ఉండటం విశేషం. బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఈసారి తమకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నేతలంటున్నారు.
కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు లాభిస్తాయని అంటున్నారు. ఆప్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో తమకు విజయం సులభం కాదని అంగీకరిస్తున్నారు. అయితే కేజ్రీవా ల్‌కు జనాదరణ, విశ్వసనీ యత, సంక్షేమ పథకాల సక్రమ అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న
సంగతి తెలిసిందే.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment