two-pronged strategy
-
హస్తినలో ఆప్, బీజేపీ హోరాహోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈసారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆప్ అంటే ఆపద అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53.6 శాతం ఓట్లతో 62 సీట్లు కొల్లగొట్టగా బీజేపీ 39 శాతం ఓట్లతో 8 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండాపోయింది. కేవలం 4.3 శాతం ఓట్లకు పరిమితమైంది. సీట్ల ఖాతాయే తెరవలేక కుదేలైంది.ద్విముఖమే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ద్విముఖ పోరు సాగుతోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్ కూడా మొత్తం 70 సీట్లలోనూ బరిలో ఉన్నా దాని పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఈసారి బీజేపీ, ఆప్‌లతోపాటు పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్‌కు అవి కలిసొచ్చేది అనుమానమే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు బరిలో ఉండటం విశేషం. బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఈసారి తమకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నేతలంటున్నారు. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు లాభిస్తాయని అంటున్నారు. ఆప్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో తమకు విజయం సులభం కాదని అంగీకరిస్తున్నారు. అయితే కేజ్రీవా ల్కు జనాదరణ, విశ్వసనీ యత, సంక్షేమ పథకాల సక్రమ అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.– సాక్షి నేషనల్ డెస్క్ -
ఒకవైపు సర్వే.. మరోవైపు చర్చలు!
♦ మేడిగడ్డపై వేగం పెంచిన మహారాష్ట్ర ♦ రంగంలోకి కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న బ్యారేజీ నిర్మాణం పై మహారాష్ట్ర సర్కారు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రధానం గా మేడిగడ్డ వద్ద చేపట్టే బ్యారేజీ విషయమై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేస్తూనే.. మరోవైపు ముంపు గ్రామాల ప్రజలతో చర్చలు జరుపుతోంది. గడ్చిరోలి ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి హన్స్‌రాజ్, ఆ రాష్ట్ర మంత్రులు గిరీశ్ మహాజన్, రాజే అంబరీశ్ ఆత్రమ్‌లు రంగంలోకి దిగి సిరోంఛా తాలూకాలోని ముంపు గ్రామాల ప్రజలతో చర్చలు జరుపుతూ ముంపు లేకుండా చూస్తామని హామీనిస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ ప్రతిపాదనపై మహారాష్ట్ర, కేంద్రం అభ్యంతరాలు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించే బ్యారేజీ విషయమై మహారాష్ట్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ ఎత్తులో సుమారు 3 వేల ఎకరాల మేర ముంపు ఉండటంతో దాన్ని సమ్మతించలేమని, ఎత్తు తగ్గించాలని సూచించింది. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మంత్రులస్థాయిలో చర్చలు జరుపగా, అధికారులస్థాయిలో జాయింట్ సర్వేలు జరుగుతున్నాయి. ముంపుపై ఆందోళన చెందుతున్న ప్రజలు అడ్డుకోవడంతో అక్కడ వారంరోజులుగా సర్వే నిలిచిపోయింది. దీంతో మరోమారు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగి ప్రజలకు నచ్చజెప్పే యత్నం చేశారు. బ్యారేజీపై కేవలం సర్వే మాత్రమే జరుగుతోందని, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ముంపు ప్రాంతం కచ్చితంగా ఎంతో తెలుసుకునేందుకు సర్వేకు సమ్మతించాలని గ్రామసభల ద్వారా కోరారు. దీనికి ఆయా గ్రామాల ప్రజలు సమ్మతించడంతో బుధవారం నుంచి తిరిగి సర్వే మొదలైంది. ఈ సర్వే పూర్తయిన అనంతరం ఎత్తుపై ఓ నిర్ణయానికి రావాలని మహారాష్ట్ర భావిస్తోంది. ఈ చర్చలు పూర్తయితేనే మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి అంతరాష్ట్ర ఒప్పందాలపై ముందడుగు పడే అవకాశం ఉంది.