♦ మేడిగడ్డపై వేగం పెంచిన మహారాష్ట్ర
♦ రంగంలోకి కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న బ్యారేజీ నిర్మాణం పై మహారాష్ట్ర సర్కారు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రధానం గా మేడిగడ్డ వద్ద చేపట్టే బ్యారేజీ విషయమై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేస్తూనే.. మరోవైపు ముంపు గ్రామాల ప్రజలతో చర్చలు జరుపుతోంది. గడ్చిరోలి ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి హన్స్‌రాజ్, ఆ రాష్ట్ర మంత్రులు గిరీశ్ మహాజన్, రాజే అంబరీశ్ ఆత్రమ్‌లు రంగంలోకి దిగి సిరోంఛా తాలూకాలోని ముంపు గ్రామాల ప్రజలతో చర్చలు జరుపుతూ ముంపు లేకుండా చూస్తామని హామీనిస్తున్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద బ్యారేజీ ప్రతిపాదనపై మహారాష్ట్ర, కేంద్రం అభ్యంతరాలు చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నుంచి నిర్ణీత 160 టీఎంసీల నీటిని మళ్లించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించే బ్యారేజీ విషయమై మహారాష్ట్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈ ఎత్తులో సుమారు 3 వేల ఎకరాల మేర ముంపు ఉండటంతో దాన్ని సమ్మతించలేమని, ఎత్తు తగ్గించాలని సూచించింది. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మంత్రులస్థాయిలో చర్చలు జరుపగా, అధికారులస్థాయిలో జాయింట్ సర్వేలు జరుగుతున్నాయి. ముంపుపై ఆందోళన చెందుతున్న ప్రజలు అడ్డుకోవడంతో అక్కడ వారంరోజులుగా సర్వే నిలిచిపోయింది.
దీంతో మరోమారు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగి ప్రజలకు నచ్చజెప్పే యత్నం చేశారు. బ్యారేజీపై కేవలం సర్వే మాత్రమే జరుగుతోందని, ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ముంపు ప్రాంతం కచ్చితంగా ఎంతో తెలుసుకునేందుకు సర్వేకు సమ్మతించాలని గ్రామసభల ద్వారా కోరారు. దీనికి ఆయా గ్రామాల ప్రజలు సమ్మతించడంతో బుధవారం నుంచి తిరిగి సర్వే మొదలైంది. ఈ సర్వే పూర్తయిన అనంతరం ఎత్తుపై ఓ నిర్ణయానికి రావాలని మహారాష్ట్ర భావిస్తోంది. ఈ చర్చలు పూర్తయితేనే మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి అంతరాష్ట్ర ఒప్పందాలపై ముందడుగు పడే అవకాశం ఉంది.