
ఆగిఉన్న బస్సులో మహిళను రేప్ చేసిన పాత నేరస్తుడు
పుణె: మహారాష్ట్రలోని పుణెలో మంగళవారం ఉదయం స్వార్‌గేట్ జంక్షన్ బస్టాండ్‌లో ఆగిఉన్న ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళను ఒక పాత నేరస్తుడు రేప్ చేసి పారిపోయాడు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌కు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్‌గేట్ బస్టాండ్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు.
గతంలో ఇతనిపై దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్‌టణ్ పట్టణానికి వెళ్లే బస్సు ఎక్కేందుకు బాధిత మహిళ ఈ బస్టాండ్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ వద్ద వేచిచూస్తోంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన నిందితుడు ‘సోదరీ’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. తాను బస్ కండక్టర్‌ను అని, మీరు ఎక్సాలిన బస్సు సమీపంలో ఆగి ఉందని చెప్పి, సమీపంలో ఆగి ఉన్న ‘శివ్ షాహీ’ ఏసీ బస్సును చూపించాడు.
అది మీరు వెళ్లాల్సిన రూట్‌లో వెళ్తుందని చెప్పి ఆ బస్సు ఎక్కాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అతని మాటలు నమ్మిన ఆమె ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది. లైట్లు ఆఫ్ చేసి, చిమ్మచీకటిగా ఉన్న బస్సును ఎక్కేందుకు తొలుత ఆమె తటపటాయించింది. బస్సులో ప్రయాణికులు నిద్రిస్తుండటంతో లైట్లు ఆర్పివేశారని, నచ్చజెప్పి బస్సులో లోపలిదాకా వెళ్లేలా చేశాడు. వెంటనే వెనకాలే వచ్చిన అతను బస్సు తలుపు మూసేసి, ఆమెను రేప్‌చేసి పారిపోయాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్మార్థనా పాటిల్ చెప్పారు.
ఘటన జరిగినప్పుడు బస్టాండ్‌లో ఎన్నో బస్సులు, ఎంతో మంది ప్రయాణికులు ఉన్నారు. మహిళ తనకు జరిగిన అన్యాయంపై వెంటనే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్‌టణ్‌కు వెళ్లే బస్సు ఎక్కి మార్గమధ్యంలో తన స్నేహితురాలికి ఫోన్‌చేసి ఘోరాన్ని వివరించింది. ఆమె సలహామేరకు బాధితురాలు వెంటనే బస్సు దిగి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్‌చేసేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి వేట మొదలెట్టారు. పోలీస్‌స్టేషన్‌కు ఈ బస్టాండ్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు గతంలో ఒక కేసులో బెయిల్ సంపాదించి 2019 ఏడాది నుంచి బయటే ఉన్నాడు.
విపక్షాల విమర్శలు
‘‘ఏమాత్రం భయం లేకుండా అసాంఘిక శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి. పుణెలో నేరాలను అరికట్టడంలో హోం శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం విఫలమయ్యారు’’ అని ఎన్సీపీ(ఎస్పీ) నాయ కురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment