మానే మరణశిక్షను తోసిపుచ్చిన హైకోర్టు
ముంబై: పుణే బస్ డ్రైవర్ మరణ శిక్షను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అధికారుల మీద కోపంతో బస్సును అడ్డదిడ్డంగా నడిపి తొమ్మిది మంది మృతికి, 37 మంది గాయాలపాలు కావడానికి కారకుడైన సంతోష్ మానేకు ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8న మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. తనకు విధించిన శిక్షపై మానే వాదనను ట్రయల్ కోర్టు వినలేదన్న కారణంతో మానేకు విధించిన మరణ శిక్షను హైకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి పీవీ హర్దాస్, పీఎన్ దేశ్ముఖ్లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మానే వాదనను కూడా వినాల్సిన అవసరాన్ని న్యాయస్థానం గుర్తించాలని పేర్కొంది.
కేసును మళ్లీ ట్రయల్ కోర్టుకే పంపుతున్నట్లు తెలిపింది. మానే తరఫు వాదనను కూడా వినాలని ట్రయల్ కోర్టుకు సూచిందింది. మానేను అక్టోబర్ 15న ట్రయల్ కోర్టులో హాజరుపర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆయన తరఫు వాదన కూడా విన్న తర్వాత న్యాయమూర్తి శిక్షను విధించాలని పేర్కొంది. అంతకుముందు జరిగిన వాదనల సమయంలో మానే తరఫు న్యాయవాది జేడీ మానే మాట్లాడుతూ... నిందితుడు మానే తరఫు వాదనలను ట్రయల్ కోర్టు వినలేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది మాధవీ మాత్రే స్పందిస్తూ... ట్రయల్ కోర్టులో మానే తన వాదన వినిపించినా తీర్పు విషయంలో ఎటువంటి తేడా వచ్చే అవకాశం లేదన్నారు. ఎందుకంటే మానే కేసు ‘అరుదైన వాటిలోకెళ్ల అరుదైన కేసు’గా ఆమె అభివర్ణించారు.
‘అధికారులు తనకు విశ్రాంతినివ్వకుండా పదేపదే విధులను అప్పగిస్తుండడంతో కోపంతో డిపోలోనుంచి బస్సును తీసుకెళ్లి ప్రయాణికులకు వ్యతిరేక దిశలో దూసుకుపోనిచ్చాడు. ఈ సమయంలో మానే పూర్తిగా స్పృహలోనే ఉన్నాడు. భవనాలనుగానీ, డివైడర్లనుగానీ ఢీకొట్టకుండా ప్రజలనే లక్ష్యంగా చేసుకొని మారణకాండను కొనసాగించాడు. ప్రయాణికులను నేరుగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా 37 మంది క్షతగాత్రులుగా మారారు. వారిలో ఇప్పటికీ ఎంతోమంది వికలాంగులుగా జీవనం సాగిస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇంతటి హేయమైన నేరానికి కోర్టు సరైన శిక్షే విధించింది. ఆయన వాదన విన్నా తీర్పులో ఎటువ ంటి తేడా ఉండే అవకాశం లేదు’అని మాధవి చెప్పారు. అయినప్పటికీ న్యాయస్థానాలు విధించిన శిక్షపై నిందితుడు అభిప్రాయాలను కూడా వినాల్సిన బాధ్యత ఉందని, అందువల్లే కేసును ట్రయల్ కోర్టు పంపుతున్నామని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.