ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు.
అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment