
న్యూఢిల్లీ: ఇంటింటికి రేషన్ డెలివరీ పథకానికి కేంద్రం మోకాళ్లు అడ్డుపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారాయన.
‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్‌దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ, సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రసగించిన ఆయన.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు.
‘‘కరోనా టైంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలుచేస్తోంది. రేషన్ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు.
కేసు ఉందనేనా?
కాగా, ప్రైవేట్ డీలర్లలతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్ సర్కార్ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్‌ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్‌ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment