న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కేజ్రివాల్ ఇంటికే రేషన్ పథకం ఆమ్ ఆద్మీ పార్టీ రేషన్ మాఫియా కోసమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకాన్ని ఢిల్లీలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఇంటికే రేషన్ అన్నది వినడానికి బాగానే ఉంది. ఓ సారి అందులోని లూప్ హోల్స్‌ను పరిశీలిస్తే అందులో అవినీతికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుస్తాయి. కేజ్రివాల్‌కు కావాల్సింది కూడా అదే. నువ్వు(కేజ్రివాల్) చట్టాన్ని బ్రేక్ చేసి.. ప్రజల్ని ఫూల్స్‌ను చేద్దామనుకుంటున్నావా?. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అందించలేకపోతున్నాడు కానీ, ఇంటికే రేషన్ అందిస్తాడంట! ఢిల్లీ ప్రభుత్వం రేషన్ మాఫియా కంట్రోల్ ఉంది.
మేము ఒక దేశం, ఒక రేషన్ కార్డు పథకాన్ని తెచ్చాం. ఈ పథకం ద్వారా ప్రజలు ఆధార్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ పథకాన్ని దేశం మొత్తం అమలు చేసింది. కానీ, ఢిల్లీ, బెంగాల్, అస్సాం రాష్ట్రాలు అమలు చేయకపోవటం బాధగా ఉంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో సమస్య ఉంది. కానీ, ఢిల్లీకి, అరవింద్ కేజ్రివాల్‌కు ఏం సమస్య ఉంది. చవకగా రేషన్ కార్డుదారులకు, పేద ప్రజలకు రేషన్ అందిస్తున్నాము. అలాంటప్పుడు నువ్వెందుకు ఆ పథకాన్ని అమలు చేయలేదు? నీ సమస్య ఏంటి?’’ అంటూ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment