నయీమ్ కేసులో మరిన్ని చార్జిషీట్లు!
కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు మిర్యాలగూడ, భువనగిరి కోర్టులో మూడు చార్జిషీట్లు దాఖలుచేసిన సిట్ అధికారులు, మిగతా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మొత్తం 16 చార్జిషీట్లు కోర్టుకు చేరినా వాటిలో రెండు చార్జిషీట్లకు మాత్రమే కోర్టు సీసీ నంబర్(చార్జిషీట్ నంబర్) కేటాయించినట్లు సిట్ అధికారులు స్పష్టంచేశారు. త్వరలోనే మిగిలిన 14 చార్జిషీట్లకు కూడా సీసీ నంబర్లు కేటాయిస్తారని తెలిపారు.
వారంలో మరో ఆరు చార్జిషీట్లు...
వచ్చే గురువారం లోపు మహబూబ్‌నగర్, రాజేంద్రనగర్ కోర్టుల్లో ఆరు కేసులపై చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిట్ వర్గాలు తెలిపాయి. రాజేంద్రనగర్ పరిధిలోని నయీమ్ రెండు ఇళ్లపై జరిగిన సోదాలకు సంబంధించిన చార్జిషీట్‌తో పాటు ఓ మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించిన అంశంపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిసింది. అలాగే షాద్‌నగర్, మహబూబ్‌నగర్ పరిధిలోని రెండు హత్య కేసులు, రెండు భూకబ్జా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ప్రక్రియ పూర్తి చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటివరకు 174 కేసుల్లో 120 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేయగా.. కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు.
12 మంది అధికారులకు నోటీసులు...
నయీమ్‌తో అంటకాగిన పోలీస్ అధికారు లకు నోటీసులు జారీచేసి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 14 మంది పోలీస్ అధికారులను సిట్ ప్రశ్నించింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సిట్ కార్యాలయం ఏర్పాటుచేసి అక్కడే విచారణ సాగిస్తోంది. ఇందులో భాగంగా వారంలోగా మరో 12 మంది అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. వీరిలో నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు సీఐలు, ఇద్దరు అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నట్లు సమాచారం.
ఇప్పట్లో అరెస్టుల్లేవు...
ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉందని, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేంత ఆధారాలు లభించలేదని సిట్ వర్గాలు తెలిపాయి. ఆధారాల సేకరణలో తమ బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయని, మరో రెండు లేదా మూడు నెలల పాటు విచారణ సాగే అవకాశం ఉందని, అప్పటివరకు ఆధారాలు లభించిన అన్ని కేసుల్లో చార్జిషీట్ దాఖలుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు.