-నయీమ్ అనుచరులు సన్నిహితులపై నజర్
-అదుపులోకి తీసుకుని విచారణ
భువనగిరి
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సిట్ స్పందిస్తోంది. ఇందులో భాగంగా సిట్ అధికారుల బృందం గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు.
వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్య వర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్‌ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్‌లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్‌ను సిట్ అధికారులు విచారించారు. కాగా కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ కోసం తీసుకువచ్చిన వారిని కొందరిని విడిచిపెట్టగా మరికొందరిని తమ అదుపులోనే ఉంచుకున్నారు.
రిజిస్ట్రేషన్ అధికారిపై పెంచిన నిఘా
భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నయీమ్‌కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ పరిశీలనలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ గుర్తించింది.