Gangster nayim
-
పోలీసుల అదుపులో నయీమ్ అనుచరుడు?
నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుడు గోసుకొండ శంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని పలివెల గ్రామానికి చెందిన శంకర్ మాజీ నక్సలైటు. దళంలో పనిచేసే సమయంలో నయీమ్‌తో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండేది. దళం నుంచి జనజీవన స్రవంతిలో కలసిన తర్వాత శంకర్ తిరిగి నయీమ్ గ్యాంగ్‌లో చేరాడు. నయీమ్‌కు చేదోడువాదోడుగా ఉంటూ అతని సెటిల్మెంట్లకు సహకరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. నయీమ్ మృతి చెందిన నెల రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన శంకర్ గురించి పోలీసులు పట్టించుకోలేదు. ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టకపోవడంతో అతడు తిరిగి జనంలోకి వచ్చాడు. యథావిధిగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ తన స్వగ్రామానికి వస్తూ వెళ్తున్నాడు. వారం రోజుల క్రితం నుంచి మునుగోడు పోలీసులు.. శంకర్‌కు ఫోన్‌చేసి ఒకసారి స్టేషన్‌కు వచ్చి తమకు కావాల్సిన వివరాలు చెప్పాలని కోరినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి పోలీసుల కంటపడకుండా తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న శంకర్‌ను చండూరు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
నయీమ్ కేసులో మరిన్ని చార్జిషీట్లు!
కోర్టులో దాఖలు చేయాలని సిట్ అధికారుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరిన్ని చార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు మిర్యాలగూడ, భువనగిరి కోర్టులో మూడు చార్జిషీట్లు దాఖలుచేసిన సిట్ అధికారులు, మిగతా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మొత్తం 16 చార్జిషీట్లు కోర్టుకు చేరినా వాటిలో రెండు చార్జిషీట్లకు మాత్రమే కోర్టు సీసీ నంబర్(చార్జిషీట్ నంబర్) కేటాయించినట్లు సిట్ అధికారులు స్పష్టంచేశారు. త్వరలోనే మిగిలిన 14 చార్జిషీట్లకు కూడా సీసీ నంబర్లు కేటాయిస్తారని తెలిపారు. వారంలో మరో ఆరు చార్జిషీట్లు... వచ్చే గురువారం లోపు మహబూబ్‌నగర్, రాజేంద్రనగర్ కోర్టుల్లో ఆరు కేసులపై చార్జిషీట్లు దాఖలు చేస్తామని సిట్ వర్గాలు తెలిపాయి. రాజేంద్రనగర్ పరిధిలోని నయీమ్ రెండు ఇళ్లపై జరిగిన సోదాలకు సంబంధించిన చార్జిషీట్‌తో పాటు ఓ మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించిన అంశంపై చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిసింది. అలాగే షాద్‌నగర్, మహబూబ్‌నగర్ పరిధిలోని రెండు హత్య కేసులు, రెండు భూకబ్జా కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ప్రక్రియ పూర్తి చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు. ఇప్పటివరకు 174 కేసుల్లో 120 మంది నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేయగా.. కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు. 12 మంది అధికారులకు నోటీసులు... నయీమ్‌తో అంటకాగిన పోలీస్ అధికారు లకు నోటీసులు జారీచేసి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 14 మంది పోలీస్ అధికారులను సిట్ ప్రశ్నించింది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సిట్ కార్యాలయం ఏర్పాటుచేసి అక్కడే విచారణ సాగిస్తోంది. ఇందులో భాగంగా వారంలోగా మరో 12 మంది అధికారులను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. వీరిలో నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, ముగ్గురు సీఐలు, ఇద్దరు అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఉన్నట్లు సమాచారం. ఇప్పట్లో అరెస్టుల్లేవు... ప్రస్తుతం కేసు విచారణ దశలోనే ఉందని, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేంత ఆధారాలు లభించలేదని సిట్ వర్గాలు తెలిపాయి. ఆధారాల సేకరణలో తమ బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయని, మరో రెండు లేదా మూడు నెలల పాటు విచారణ సాగే అవకాశం ఉందని, అప్పటివరకు ఆధారాలు లభించిన అన్ని కేసుల్లో చార్జిషీట్ దాఖలుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు. -
నయీమ్ ఎన్‌కౌంటర్‌పై రేపు చర్చ
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌పై అసెంబ్లీలో చర్చ జరగనుంది. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక స్వల్పకాలిక చర్చ కింద నయీమ్ అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు ఎజెండా ఖరారైంది. నయీమ్ అతడి అనుచరుల నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. ఈ అంశంపై చర్చించాలని విపక్షాల నుంచి డిమాండ్ రాకముందే ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నట్లు అధికారపక్షం చెబుతోంది. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం వివిధ రాజకీయ పార్టీల నేతల పేర్లు బయటకు రావడం, నయీమ్‌తో సంబంధాలున్న వారిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నయీమ్ అంశాన్ని చర్చకు పెట్టింది. -
నయీం కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది?
-
నయీం కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది?
- పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి - రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖలకు హైకోర్టు ఆదేశం - కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషనర్ - దర్యాప్తు వివరాలు పరిశీలించాక నిర్ణయిస్తామన్న ధర్మాసనం.. విచారణ 3 వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అరాచకాలపై సాగుతున్న దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిం చారు. నయీమ్ అనేక అరాచకాలకు పాల్పడ్డాడని.. పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. నయీమ్ కేసుల విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, అయితే ఆ దర్యాప్తునకు సంబంధించిఏ వివరాలు కూడా తెలియడం లేదని పేర్కొన్నారు. సీబీఐకి అప్పగించాలన్న పిటిషనర్ ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పలువురితో నయీమ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయని, అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరారు. నయీమ్‌తో చాలా మంది పోలీసులకు సంబంధాలుండడం వల్ల దర్యాప్తు తీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. దర్యాప్తు వివరాలు బహిర్గతం కానంత మాత్రాన దర్యాప్తు సక్రమంగా జరగనట్లు కాదని, దర్యా ప్తు ఎలా సాగుతోందో తెలుసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. సిట్ నివేదికతో కీలక మలుపు! సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ సమర్పించిన నివేదికలో పలువురు అధికార పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లను సిట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అతడి బినామీలు, కుటుంబ సభ్యులతోపాటు పలువురు నిందితులను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అక్రమాలతో పాటు నయీమ్‌తో సంబంధాలున్న వారి పేర్లు బయటపడ్డాయి. దీనికి సంబంధించి సిట్ అధికారులు నెలరోజుల క్రితమే 156 పేజీల వాంగ్మూలాల (రిమాండ్ నోట్)ను భువనగిరి కోర్టుకు సమర్పించారు. అందులో శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ మద్దిలేటి శ్రీనివాస్‌రావు, సీఐలు వెంకట్‌రెడ్డి, బూర రాజగోపాల్‌తో పాటు మస్తాన్‌వలీ, గండికోట వెంకటయ్య, సాయి మనోహర్, మలినేని శ్రీనివాస్‌రావు తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని సిట్ అధికారులు త్వరలో విచారించే అవకాశం ఉందని సమాచారం. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పులిజాలకు చెందిన మధుకర్‌రెడ్డి పేరు కూడా సిట్ నివేదికలో ఉన్నట్లు తెలిసింది. -
నయీం గ్యాంగ్ పేరుతో ఆకతాయిల బెదిరింపులు ?
ములుగు : పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరుతో కొంతమంది ఆకతాయిలు మండల కేంద్రానికి చెంది న ఓ ఫర్టిలైజర్ వ్యాపారికి బెదిరింపు కాల్ చేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీసుల చేతిలో ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నయీ మ్ కథ ముగిసింది. అయినా కొంతమంది ఆకతాయిలు న యీమ్ గ్యాంగ్ పేరుతో ములుగు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలి సింది. దీంతో బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
నయీమ్‌కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?
-
నయీమ్‌కు ఇచ్చినవన్నీ నేనిచ్చేస్తా?
ఫిర్యాదుదారుడికి ఓ ఎమ్మెల్సీ ఆఫర్ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బెదిరింపులతో కోట్ల ముడుపులు చెల్లించుకున్న బాధితుడు ఒకవైపు.. ఆ దందాలో ప్రమేయముందన్న కారణంతో పోలీసుల ఎఫ్ఐఆర్లో పేరెక్కిన ఎమ్మెల్సీ మరోవైపు.. వారి మధ్య రాజీ కుదిర్చి, సదరు ఎమ్మెల్సీని ఒడ్డున పడేద్దామని నడుంకట్టిన కాంగ్రెస్ నేతలు ఇంకోవైపు.. మొత్తంగా సదరు బాధితుడు బలవంతంగా నయీమ్‌కు చెల్లించుకున్న కోట్ల రూపాయల కప్పాన్ని తాను వెనక్కిస్తానంటూ ఎమ్మెల్సీ బేరసారాలు.. మొత్తంగా నయీమ్ కేసులో రాజకీయ నేతల మధ్య జరుగుతున్న రసవత్తరమైన సన్నివేశమిది. నయీమ్‌తో సంబంధాల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ... కేసు నుంచి బయట పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... నయీమ్‌తో సంబంధాలున్న పార్టీ నేతలపై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చ జెండా ఊపారు. ఈ వారంలోనే పలువురికి నోటీసులు కూడా జారీ చేయనున్నారని సమాచారం. అయితే నయీమ్‌తో సంబంధాలున్న ఆయా పార్టీల నేతల్లో అత్యధికులు నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఒకరికి ఏళ్లుగా నయీమ్‌తో అనుబంధం ఉందనే దానిపై ‘సిట్’ ఆధారాలు సేకరించిందని, చర్య తీసుకోవడమే తరువాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న రాజకీయ పరిచయాలతో బయటపడేందుకు ఆ ఎమ్మెల్సీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం జరుగుతోంది? నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత కొద్ది రోజులకు భువనగిరికి చెందిన ఓ వ్యాపారి.. తనను డబ్బుకోసం నయీమ్ హింసించడం, వసూలు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీమ్ బెదిరింపులను రుజువు చేసేలా ఫోన్ సంభాషణల రికార్డులను కూడా అందజేశాడు. ఈ సంభాషణలోనే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పేరు ప్రస్తావన కూడా ఉంది. దీంతో వ్యాపారి ఫిర్యాదు మేరకు నమోదైన ఎఫ్ఐఆర్లో ఆ ఎమ్మెల్సీ పేరు కూడా చేర్చారు. త్వరలోనే ఫిర్యాదుదారు నుంచి పూర్తి వివరాలు సేకరించే యోచనలో సిట్ అధికారులు ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఫిర్యాదుదారు సిట్ అధికారులకు తన పేరు చెప్పకుండా ఉండేం దుకు సదరు ఎమ్మెల్యే ఒత్తిళ్లు మొదలుపెట్టారు. అందులో భాగంగా భువనగిరికి చెందిన ఆ వ్యాపారితో సన్నిహితంగా ఉండే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఒక మాజీ మంత్రిని కలిశారని.. ఫిర్యాదుదారు తన పేరు చెప్పకుండా ఒప్పిం చాలని బతిమిలాడినట్లు చెబుతున్నారు. ఆ యత్నం ఫలించక నల్లగొండ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేతను రాయబారానికి పంపించారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆ నేతకు, భువనగిరికి చెందిన ఫిర్యాదుదారుతో దగ్గరి సంబంధాలున్నాయంటున్నారు. డబ్బులు ఇచ్చేస్తా.. నయీమ్ బెదిరింపులకు భయపడి ఆ వ్యాపారి చెల్లించిన మొత్తం డబ్బులను తాను తిరిగి వెనక్కిస్తానని నల్లగొండ కాంగ్రెస్ నేత వద్ద ఆ ఎమ్మెల్సీ మోకరిల్లినట్లు చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం అటు టీఆర్ఎస్లో, ఇటు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనపై వేటు పడడం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చిన ఆ ఎమ్మెల్సీ.. ఈ కేసు నుంచి బయట పడేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదంటున్నారు. మరోవైపు ఈ ఎమ్మెల్సీతో, నయీమ్‌తో అంటకాగిన టీఆర్ఎస్ నాయకుడొకరు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నయీమ్ అనుచరులు పాశం శ్రీనివాస్, సుధాకర్‌లపై పీడీ యాక్టు కింద నమోదైన కేసులో వారిద్దరు అరెస్టు కాకుం డా 3 నెలల పాటు అడ్డుకోగలిగిన ఆ నేత ఇప్పటికే దేశం దాటి వెళ్లాడని ప్రచారం జరుగుతోంది. తనకు సాయపడే ఆ నేత కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆ ఎమ్మెల్సీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు. -
నయీమ్ కేసుల్లో ఇక చార్జిషీట్లు
-
పోలీసుల అదుపులో గుట్ట సబ్ రిజిస్ట్రార్.
నయీమ్ అక్రమ రిజిస్ట్రేషన్లలో పాత్రపై విచారణ భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు అక్రమ భూ రిజిస్ట్రేషన్లు చేయడానికి సహకరించాడన్న ఆరోపణలతో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఎండీ వహీద్‌ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నుంచి అనుమతి తీసుకున్నట్టు తెలిసింది. నయీ మ్ అతని అనుచరులకు అనుకూలంగా రిజి స్ట్రేషన్లు చేయడంలో వహీద్ పాత్రపై అనుమానాలున్నారుు. భువనగిరి, మోత్కూరు, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వహీద్ వివిధ హోదాల్లో పనిచేస్తూ నయీమ్ అనుచరుల అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడిపై వచ్చిన అభియోగాల్ని విచారించడానికి సిట్ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖలు రాసింది. పూర్తి సమాచారంతో విచారణకు రావాలన్న సిట్ ఆదేశంతో రికార్డులను తీసుకుని ఆయన పోలీసులకు లొంగి పోయారు. దీంతో సిట్, స్థానిక పోలీసులు వహీద్‌ను సోమవారం నుంచి విచారిస్తున్నారు. బక్రీద్ పండుగ ప్రార్థనల కోసం మంగళవారం ఉదయం పోలీస్ ఎస్కార్ట్‌తో అతడిని వదిలిపెట్టారు. తిరిగి అదుపులోకి తీసుకుని నల్లగొండకు తరలించారు. వెలుగు చూస్తున్న వాస్తవాలు నయీమ్ ప్రధాన నేరాల్లో ఒకటైన భూ రిజిస్ట్రేషన్లలో పలు అంశాలు వెలుగు చూస్తున్నారుు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. డాక్యుమెంట్ రైటర్ సహకారంతో భూముల క్రయవిక్రయ వివరాలను ఎప్పటికప్పుడు నయీమ్ అనుచరులకు తెలపడం, వాటి మార్కెట్ విలువ వివరాలు, ఎకరాల్లో, ప్లాట్లలో కొన్న భూముల యజమానుల వివరాలు అందజేయడం వంటి విషయాలపై ఆరోపణలున్నాయి. దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడంలో వహీద్ సహకరించాడని రికార్డుల్లో తేలినట్లు సమాచారం. ఉన్నతాధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయకుంటే వార్ని నయాన్నో, భయాన్నో బెదిరించి పను లు పూర్తి చేరుుంచినట్టు తెలుస్తోంది. కాగా నయీమ్ కుటుంబసభ్యులను సిట్ పోలీ స్లు విచారిస్తున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్‌కు వారిని రప్పించినట్టు తెలుస్తోంది. -
నయీమ్ కేసుల్లో ఇక చార్జిషీట్లు
♦ పోలీసులను ఆదేశించిన ఏడీజీ అంజనీకుమార్ ♦ ఇప్పటివరకు 72 కేసులు.. 80 మంది అరెస్ట్ ♦ రెండుమూడ్రోజుల్లో కీలక పరిణామాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అతని అనుచరులపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తు కీలక ఘట్టానికి చేరుకుంది. సిట్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్ మంగళవారం ఐజీ నాగిరెడ్డితో పాటు విచారణాధికారులతో సమావేశమయ్యారు. నయీమ్ కేసులను దర్యాప్తు చేసిన అధికారులందరి నుంచి వివరాలు సేకరించారు. కేసులకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనందున తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఇప్పటి వరకు ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 72 కేసులు నమోదవగా 80 మందిని అరెస్టు చేశారు. వీటికి సంబంధించి వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అంజనీకుమార్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. స్థానిక కోర్టుల్లో ఎక్కడికక్కడ వీటిని దాఖలు చేయాలని సూచించారు. నయీమ్ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టయిన 80 మందిలో అతడి కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే ఉన్నారు. నయీమ్ ద్వారా పలువురు రాజకీయ నాయకులు, పోలీసులు లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నయీమ్ అనుచరుల నుంచి ఈ కోణానికి సంబంధించి వివరాలు, వారి మధ్య నడిచిన లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరి విషయంలో పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. నయీమ్‌తో ప్రముఖుల సంబంధాలపై వార్తలు వెలువడుతుండగా.. కొందరు నేతలపై నల్లగొండ జిల్లాలో కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో గ్యాంగ్‌స్టర్ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా నయీమ్ కేసుల్లో తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో కబ్జా, బెదిరింపు ఆరోపణలతో కూడిన వాటిని కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగా ‘సిట్’లో పోలీసు సిబ్బందిని పెంచడమే కాకుండా దర్యాప్తు వేగాన్ని కూడా పెంచారు. రెండు మూడ్రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పోలీసు అధికారుల పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది -
నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు
-
నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు
కోరుట్ల కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్/కోరుట్ల/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు మహ్మద్ ఆసిఫ్‌ఖాన్(45)ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ పారిపోయే యత్నాల్లో ఉన్న ఆసిఫ్‌ను పుణె ఎయిర్‌పోర్టులో గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల వ్యాపారి రవూఫ్‌ను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు వసూలు చేసిన కేసులో ఆసిఫ్‌ను శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఆసిఫ్‌కు 15 ఏళ్లుగా నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నయీమ్‌కు అత్యంత సన్నిహితునిగా ఉండి అతనికి సంబంధించిన కీలక వ్యవహారాలు ఆసిఫ్ చక్కబెట్టేవాడని సమాచారం. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు మకాం మార్చిన ఆసిఫ్.. నయీమ్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా గుర్తింపు ఉంది. డబ్బుల రికవరీ వంటి కీలక వ్యవహారాలను చూసుకుంటాడని తెలిసింది. భువనగిరి పరిసరాల్లో నయీమ్ నిర్వహించిన అనేక భూ సెటిల్మెంట్లలో ఆసిఫ్ కీలకంగా వ్యవహరించి వ్యూహాత్మకంగా డబ్బులు గుంజేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆయుధాల సరఫరాలో.. నయీమ్ గ్యాంగ్‌కు ఆయుధాలు సరఫరా చేయడంలోనూ ఆసిఫ్ పాత్ర ఉందన్న సందేహాలున్నాయి. ఆగస్టు 8న నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం వనస్థలిపురంలో సిట్ పోలీసులు నిర్వహించిన దాడిలో ఓ ఇంటి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను అక్కడికి తరలించడంలో ఆసిఫ్ పాత్ర ప్రధానమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నయీమ్ గ్యాంగ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఆయుధాలు తీసుకువచ్చి అప్పగించే పనిలోనూ ఆసిఫ్ ముఖ్యభూమిక పోషించాడన్న అనుమానాలున్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆసిఫ్.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో సిట్ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టుల్లో అతడిపై లుక్అవుట్ ప్రకటించారు. మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను వెల్లడించిన విషయాలతో మరికొందరి అరెస్టులకు సిట్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు పీడీ యాక్ట్ నమోదుతో వరంగల్ జైలులో ఉన్న పాశం శ్రీనును ఆగస్టు 31న సిట్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియనుండగా.. పాశం శ్రీను నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. నయీమ్ గ్యాంగ్ కిడ్నాప్‌లు, బెదిరింపులతో భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో పాల్గొన్న నిందితులు, బాధితుల వివరాలను శ్రీను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అక్రమ దందాల్లో తనతోపాటు పాల్గొన్న వారి పేర్లను శ్రీను బహిర్గతం చేయడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు శ్రీను కస్టడీని పొడిగించేలా కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ‘పోలీస్ పేజీ’పై సిట్ ఆరా..! గ్యాంగ్‌స్టర్ నయీమ్ ద్వారా లబ్ధి పొందిన వారిని గుర్తించే పనిలో సిట్ నిమగ్నమైంది. ప్రత్యేకించి నయీమ్ వల్ల లాభపడిన పోలీసులపై దృష్టి సారించింది. నయీమ్ డైరీలో ‘పోలీస్ పేజీ’లో వెలుగు చూసిన పేర్లతో పాటు చివరి దాకా అతనితో టచ్‌లో ఉన్న పోలీసులను విచారించాలని యోచిస్తోంది. గ్యాంగ్‌స్టర్ అండ చూసుకుని కోట్లకు పడగలెత్తిన పోలీసు అధికారుల చిట్టా రూపొందిస్తోంది. ఇప్పటికే కొంత మందిని గుర్తించిన సిట్ అధికారులు.. ఒకట్రెండు రోజుల్లో వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. నయీమ్ ఇచ్చిన సమాచారంతో అనేక మంది అగ్రశ్రేణి మావోయిస్టులను ఎన్కౌంటర్లలో మట్టుబెట్టిన కొందరు పోలీసు అధికారులు రివార్డులు, ప్రమోషన్లతో లబ్ధి పొందారు. సిట్ విచారణ చేపట్టాలని భావిస్తుండటంతో తమ బండారం బయటపడుతుందని కొందరు అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 62 కేసులు నమోదు సిట్ చీఫ్ నాగిరెడ్డి గ్యాంగ్‌స్టర్ నయీమ్‌పై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు నమోదైనట్లు సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే 53 మందిని అరెస్టు చేయగా.. శుక్రవారం ఒక్క రోజే పది మందిని అరెస్టు చేశారు. వీరిని కోరుట్ల, భువనగిరి పోలీస్స్టేషన్లకు తరలించారు. నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు వీరంతా సన్నిహితులని సిట్ పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో ఆసిఫ్‌ఖాన్, చిన్నబత్తిని బెంజమిన్, కాసాని ఇంద్రసేనా, గుమ్మడెల్లి మల్లేశ్, కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేశ్, గడ్డం జంగయ్య, రాకాల శ్రీనివాస్, సందెల ప్రవీణ్‌కుమార్, మహ్మద్ యూనస్‌లను అరెస్టు చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్‌లు, ఆయుధాలతో బెదిరించి బలవంతపు వసూళ్లు, భూ రిజిస్ట్రేషన్లు తదితర నేరాలకు సంబంధించి వీరిపై ఏడు కేసులు నమోదయ్యాయి. -
భువనగిరిలో సిట్ విచారణ
-నయీమ్ అనుచరులు సన్నిహితులపై నజర్ -అదుపులోకి తీసుకుని విచారణ భువనగిరి గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై సిట్ స్పందిస్తోంది. ఇందులో భాగంగా సిట్ అధికారుల బృందం గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్య వర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్‌లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్‌ను సిట్ అధికారులు విచారించారు. కాగా కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ కోసం తీసుకువచ్చిన వారిని కొందరిని విడిచిపెట్టగా మరికొందరిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. రిజిస్ట్రేషన్ అధికారిపై పెంచిన నిఘా భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నయీమ్‌కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ పరిశీలనలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను నిలువునా తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ గుర్తించింది. -
12 రోజుల పాపనూ వదల్లేదు !
♦ నయీమ్ ముఠా చెంతకు పెద్దవూర చిన్నారి ♦ పోలీసుల అదుపులో నిందితులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠా అమాయక గిరిజనుల బల హీనతలను కూడా సొమ్ము చేసుకుందని తెలుస్తోంది. గిరిజన కుటుంబాల్లో శిశు విక్రయాలు ఉంటాయనే ఆలోచనతో దానిపై దృష్టి సారించిన నయీమ్ 12 రోజుల పసిపాపను కూడా కొనుక్కుని తీసుకెళ్లాడనే విషయం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పెదవూర మండ లం ఏనెమీది గూడేనికి చెందిన గిరిజన దంపతులకు జూన్ 3వ తేదీన హాలి యాలోని ఓ ఆస్పత్రిలో ఆడపిల్ల జన్మించింది. డిశ్చార్జి అయిన రెండు రోజులకే త్రిపురారం, వేములపల్లి మండలాలకు చెందిన ఆర్ఎంపీలు రఫీ, రమేశ్‌లు ఆ దంపతుల దగ్గరకు వెళ్లి పాపను నయీమ్ బంధువు సుల్తానా బేగంకు అమ్మాలని ఒప్పించారు. ఇందుకోసం వారికి రూ.30 వేలు చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ విషయం పోలీసు విచారణలో వెల్లడైన వెంటనే గురువారం రాత్రి సిట్ బృందం హాలియాలోని ఆస్పత్రికి వచ్చి ఆ పాప డిశ్చార్జి షీట్‌ను తీసుకెళ్లినట్టు సమాచా రం. ఇద్దరు ఆర్ఎంపీలను కూడా సిట్ అదుపులోనికి తీసుకుని విచారిస్తోందని తెలిసింది. ఇప్పటికే తమ అదుపుల్లో ఉన్న నయీమ్ అత్త సుల్తానా, బావమరిది సాదిక్, ఆయన భార్య ఫర్జానాలను మిర్యాలగూడలో విచారించి పలు కీలక అంశాలపై సమాచారం రాబ ట్టింది. బ్యాంకు లాకర్లలో 28 తులాల బంగారం, 70 తులాల వెండితోపాటు రూ.1.50 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని సీఐ తెలిపారు. -
నయీమ్ దందాలో ఆ నలుగురు!
• అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఓ ఇన్స్పెక్టర్ల దోస్తీ • గ్యాంగ్‌స్టర్‌కు వాహనం, రివాల్వర్‌ను కూడా అందించిన అధికారులు • సెటిల్మెంట్లు, దందాలకు ప్రతిఫలంగా ‘సమాచారమిచ్చిన’ డీఎస్పీ • విచారణను తప్పుదారి పట్టించేందుకు సోషల్‌మీడియా ద్వారా పుకార్లు పుట్టించిన ఏఎస్పీ సాక్షి, హైదరాబాద్: కరుడుగట్టిన నేరగాడు, గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో ‘చింటు సార్, టై బాస్’లే కాదు, మరికొందరు అధికారులూ చాలా సన్నిహితంగా మెలిగారని తెలుస్తోంది. వారిలో ఓ అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. నయీమ్‌ను వివిధ రకాలుగా ‘వినియోగించుకున్న’ ఆ నలుగురూ అతడికి అనేక రకాలుగా సహాయపడినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నలుగురి వ్యవహారం వెలుగులోకి రావడానికి నయీమ్ డైరీలు ఒక కారణమైతే... కోడ్ పదాల్లో ఉన్న వారి పేర్లను డీ-కోడ్ చేయడానికి ఆధారాన్ని వాళ్లే పరోక్షంగా ఇవ్వడం గమనార్హం. నలుగురివీ ఆ రెండు నేపథ్యాలే.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో స్థిరపడ్డాడు. నయీమ్‌తో సంబంధాలున్నట్లుగా తేలిన నలుగురు అధికారులకు కూడా ఈ రెండు ప్రాంతాలతో సంబంధాలున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ అధికారులు గతంలో నల్లగొండ జిల్లాతో పాటు సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. నల్లగొండలో పనిచేసినప్పుడు నయీమ్‌తో ఏర్పడిన పరిచయాన్ని తర్వాత కూడా కొనసాగించారు. వీరిలో ఇద్దరు అధికారులు మావోయిస్టు వ్యతిరేక, నిఘా విభాగాల్లో పనిచేసినప్పుడు నయీమ్‌తో సంబంధాలు బలపడ్డాయి. తొలుత ఈ నలుగురూ సమాచారం కోసమే నయీమ్‌పై ఆధారపడ్డా.. అతడి ‘ఎదుగుదల’ తర్వాత హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో సెటిల్మెంట్లు కోసం కూడా వినియోగించుకున్నారు. వారిలో ఇద్దరు అధికారులు సైబరాబాద్ పరిధి డివిజన్లలోనే ప్రస్తుతం నయీమ్ డెన్లను పోలీసులు గుర్తిస్తుండటం గమనార్హం. ఎన్‌కౌంటర్‌తో ప్రచారానికి తెర లేపారు నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో చింటు సార్, టై బాస్ అనే పేర్లతో పాటు ఈ నలుగురికి సంబంధించిన కోడ్ పేర్లు కూడా ఉన్నాయి. వాటిని డీ-కోడ్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఓ సుదీర్ఘ వార్తాంశం దర్యాప్తు అధికారుల దృష్టిని ఆకర్షించింది. పోలీసు విభాగంలోని అందరు ఉన్నతాధికారులు, కొన్ని యూనిట్ల అధిపతులపై ఆరోపణలతో వచ్చిన ఆ వార్తాంశంలోని నిజానిజాలను నిర్ధారించుకునేందుకు అధికారులు దానిని క్షుణ్నంగా విశ్లేషించారు. అందులోని అంశాలు, పారిభాషిక పదాల వాడుకను బట్టి అది పోలీసు అధికారులే తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో సాంకేతికంగా దర్యాప్తు చేసి.. దానిని సృష్టించిన ఓ అదనపు ఎస్పీని గుర్తించారు. ఆయనపై నిఘా కొనసాగించగా మిగతా ముగ్గురు బయటకు వచ్చారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత వీలైనంత మంది ఉన్నతాధికారుల పేర్లను జనాల్లోకి తీసుకువెళ్లి.. కేసు దర్యాప్తు దిశను మార్చడానికే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిపై శాఖాపరమైన విచారణ చేపట్టారని, మరిన్ని ఆధారాలు సేకరించాక నోటీసులు జారీ చేసి విచారించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. పనిచేశారు.. పనులు చేయించుకున్నారు.. వివిధ హోదాల్లో ఉన్న ఈ నలుగురు అధికారులు తొలుత ఒకరికి తెలియకుండా మరొకరు నయీమ్‌తో సంబంధాలు కొనసాగించారు. పలు కీలక కేసుల్ని కొలిక్కితేవడానికి నయీమ్ నుంచి సమాచారం సేకరించడంతో మొదలుపెట్టి.. సెటిల్మెంట్లు చేయించడం, నేరాలను చూసీచూడనట్లు వదిలేయడంతో పాటు భారీగా నజరానాలు తీసుకోవడానికి అలవాటుపడ్డారు. కొన్ని సందర్భాల్లో ఈ నలుగురినీ నయీమ్ దావత్‌లకు పిలవడం, కలవడంతో ఒకరి విషయాలు మరొకరికి తెలిశాయి. కొన్నాళ్లకు నయీమ్ సైతం వీరిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. రాష్ట్ర విభజనకు రెండేళ్ల ముందు నయీమ్ కోసం వేట ప్రారంభమైంది. అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు దగ్గరి వరకు వెళ్లగలి గినా నయీమ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆపరేషన్ విఫలమైంది. ఈ నలుగురిలో నిఘా విభాగంలో పనిచేసిన ఓ అధికారి ఇచ్చిన సమాచారంతోనే నయీమ్ తప్పించుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో డీఎస్పీ స్థాయి అధికారి ఏకంగా తన సర్వీసు రివాల్వర్‌నే నయీమ్‌కు బహుమతిగా ఇచ్చాడని.. అవసరమైనప్పుడల్లా తీసుకువెళ్లి బెదిరించడానికి, కాల్పులు జరపడానికి అవకాశమిచ్చాడని సమాచారం. దీనికి ప్రతిఫలంగా నల్లగొండ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్ సొంతం చేసుకున్నాడు. ఇంకో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నయీమ్‌కు అత్యవసర సమయాల్లో తన వ్యక్తిగత వాహనాన్ని ఇచ్చి పంపేవాడని తెలిసింది. -
కస్టడీకి నయీమ్ కుటుంబ సభ్యులు
♦ అదుపులోకి తీసుకున్న షాద్‌నగర్ పోలీసులు ♦ వారం రోజులపాటు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు షాద్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కుటుంబసభ్యులను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులపాటు వారిని కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 8న నయీమ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన అనంతరం నయీమ్ భార్య హసీనాబేగం, అక్క సలీమాబేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్కు తరలించిన విషయం తెలిసిందే. నయీమ్ నేరాలపై విచారణ జరుగుతున్నందున మరింత సమాచారం సేకరించేం దుకు అతడికి సంబంధించిన నలుగురిని విచారణకు అవకాశం కల్పించాలని మంగళవారం షాద్‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ఎన్. మూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఆ నలుగురిని బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జైలునుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు గంటలకు నేరుగా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ నిమిత్తం వారిని సిట్ అధికారులకు అప్పగించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. కానీ, సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో స్థానిక పోలీసులే విచారణ జరిపినట్లు తెలిసింది. పోలీసు కస్టడీకి నయీమ్ గ్యాంగ్ హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఠా సభ్యులను జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నయీమ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఫర్హానా, అఫ్సా, సాజీదాలను నార్సింగ్ పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం తెలిపారు. -
అల్వాల్‌లో కాల్పుల కలకలం
నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి రెండు వర్గాలకు చెందిన వారి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మచ్చబొల్లారంలో గురువారం రాత్రి ఓ కారులో వచ్చిన నలుగురు వ్యక్తుల మధ్య ఏదో గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి గన్‌తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. శబ్ధం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఓ వాడిన బుల్లెట్(ఖాళీ కేస్)ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగిన అనంతరం ఈ ఘటన వెలుగుచూడటంతో.. ఇందులో అతని అనుచరులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'నయీం బాధితులు పోలీసులను ఆశ్రయించొచ్చు'
గ్యాంగ్‌స్టర్ నయీం బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఏ రాజకీయ పార్టీ నేతల పేర్లు వెల్లడి కాలేదని.. అవసరాన్ని బట్టి సిట్ బృందంలో మరికొంత మంది అధికారులను చేర్చుకోవచ్చని ఆయన తెలిపారు. నయీం బాధితులు సిట్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చన్నారు. బాధితులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 94406 27218